రవితేజ కోసం మారుతి స్పెషల్ స్క్రిప్ట్.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా కొత్త కాంబినేషన్
మాస్ మహారాజా రవితేజ(Ravi teja) తదుపరి ప్రాజెక్టులపై ఇప్పటికే సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతున్న వేళ, తాజాగా మరో కొత్త కాంబినేషన్ వార్త హాట్ టాపిక్‌గా మారింది. డైరెక్టర్ మారుతి(Maruthi)తో రవితేజ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల ప్రభాస్(Prabhas) హీరోగా తెరకెక్కిన ది రాజా సాబ్(The Raja Saab) ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోవడంతో మారుతి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా సోషల్ మీడియాలో గత కొన్ని నెలలుగా వచ్చిన నెగెటివ్ ట్రోలింగ్ మధ్య ఆయన తన తదుపరి ప్రాజెక్ట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం రవితేజ, మారుతి మధ్య ప్రాథమిక స్థాయి చర్చలు ప్రారంభమైనట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం మారుతి ఒక కొత్త కథను సిద్ధం చేస్తున్నాడని, ఆ స్క్రిప్ట్ పూర్తిగా సంతృప్తికరంగా అనిపిస్తేనే రవితేజ ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశముందని చెబుతున్నారు. ది రాజా సాబ్‌ను నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory) ఈ సినిమాను కూడా నిర్మించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. అయితే ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇక రవితేజ ప్రస్తుతం ఇరుముడి(Irumudi) షూటింగ్‌ను పూర్తి చేసి హాసిత్ గోలి(Hasith Goli) దర్శకత్వంలో దిల్ రాజు(Dil Raju) నిర్మిస్తున్న సినిమాను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) నిర్మాణంలో వివేక్ ఆత్రేయ(Vivek Athreya) దర్శకత్వంలో మరో ఆసక్తికర ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తైన తర్వాతే మారుతి దర్శకత్వంలోని సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కథ, ప్రణాళికలు అనుకున్న విధంగా కుదిరితే ఈ కాంబినేషన్ త్వరలోనే అధికారిక రూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.







