సాయికృష్ణ మిస్సింగ్ కేసులో ‘సిట్’ దూకుడు..!
విజయవాడలో(Vijayawada) తీవ్ర సంచలనం సృష్టించిన సాయికృష్ణ(Sai Krishna) అదృశ్యం కేసు విచారణ రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న సీఐ నాగరాజును ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అధికారులు సుదీర్ఘంగా మూడు గంటల పాటు ప్రశ్నించారు. పోలీస్ శాఖలోనే ఉంటూ ఒక వ్యక్తి మిస్సింగ్ కేసులో కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు రావడంతో ఈ విచారణను అత్యంత రహస్యంగా, పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. సాయికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్న అధికారిక తేదీ ఏది? అసలు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో అతడిని ఉంచారు? అనే కోణంలో సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు.
ముఖ్యంగా ఈ ఆపరేషన్లో టాస్క్ఫోర్స్ పోలీసుల పాత్రపై సిట్ కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వాహనాలను కాదని, ప్రైవేట్ వాహనాల్లో సాయికృష్ణను ఎందుకు తరలించాల్సి వచ్చింది? దీని వెనుక ఉన్న ఉన్నతాధికారుల హస్తం ఏంటి? అనే అంశాలపై సిట్ ఆరా తీస్తోంది. సిట్ అధికారులు అడిగిన చాలా ప్రశ్నలకు సీఐ నాగరాజు సరైన సమాధానాలు చెప్పకుండా మౌనం వహించడం లేదా తప్పుడు సమాచారంతో దాటవేసే ప్రయత్నం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
సాయికృష్ణను అదుపులోకి తీసుకున్న సమయంలో అతడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారా? అందుకే అతడి వివరాలను దాచిపెడుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఐ నాగరాజు సమాధానాలు దాటవేస్తుండటంతో సిట్ అధికారులు సాంకేతిక ఆధారాలను (కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్) ఆయన ముందు ఉంచి నిలదీస్తున్నట్లు తెలుస్తోంది. ఒక సీఐ స్థాయి అధికారిని సిట్ అధికారులు ఈ స్థాయిలో విచారించడం విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసులో సీఐ నాగరాజుతో పాటు మరికొందరు ఉన్నతాధికారుల పేర్లు కూడా వినబడుతుండటంతో, ఎప్పుడు ఎవరిపై చర్యలు ఉంటాయోనని పోలీస్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. సాయికృష్ణను క్షేమంగా కోర్టు ముందు ప్రవేశపెట్టే వరకు లేదా అతడి ఆచూకీ కనుగొనే వరకు విచారణను ఆపే ప్రసక్తే లేదని సిట్ అధికారులు స్పష్టం చేస్తున్నారు.








