ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగ సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని చాటుతూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ వర్గాల్లో హర్షాతిరేకాలు నింపాయి. ప్రధానంగా పెన్షన్ విధానం, పదవీ విరమణ వయస్సు పెంపుదలపై కేబినెట్ చారిత్రాత్మక ముందడుగు వేసింది.
మెమో-57 ప్రకారం.. 2004 సంవత్సరానికి ముందు నోటిఫికేషన్ పొంది, ఆ తర్వాత ఉద్యోగాల్లో నియమితులైన సుమారు 11 వేల మంది ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని (OPS) వర్తింపజేసేందుకు రాష్ట్ర కేబినెట్ అధికారికంగా ఆమోదం తెలిపింది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఈ ప్రధాన డిమాండ్‌పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కారం చూపడంపై ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మరో కీలక నిర్ణయంలో భాగంగా.. రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలు (PSUs), గురుకుల పాఠశాలలు, వివిధ ప్రభుత్వ సొసైటీలలో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును ప్రస్తుతం ఉన్న 60 సంవత్సరాల నుండి 62 సంవత్సరాలకు పెంచుతూ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయంతో వేలాది మంది సొసైటీ, గురుకుల ఉద్యోగులకు అదనంగా రెండేళ్ల సేవా కాలం లభించనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ సంక్షేమ నిర్ణయాలపై ఏపీ ఎన్జీవో (APNGO) సంఘం నేతలు, ఉద్యోగ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan), ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌లకు ఉద్యోగ సంఘాలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాయి. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ఆలకించి, వాటి పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపడం అభినందనీయమని ఏపీ ఎన్జీవో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ జేఏసీ చైర్మన్ అలపర్తి విద్యాసాగర్ పేర్కొన్నారు.








