కోహ్లీపై ఆర్సీబీ సీఈఓ క్లారిటీ, డౌట్స్ వద్దు..!
ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అభిమానులతో పాటు క్రికెట్ ప్రియులందరినీ వేధిస్తున్న ఒకే ఒక్క ప్రశ్నకు ఆర్సీబీ సీఈఓ రాజేష్ మీనన్ ఎట్టకేలకూ సమాధానమిచ్చారు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ఐపీఎల్లో ఇంకెంత కాలం కొనసాగుతారనే అంశంపై ఆయన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. కోహ్లీకి ప్రస్తుతం 38 ఏళ్లు వచ్చినప్పటికీ, అతను కనీసం మరో మూడు నుండి నాలుగు సంవత్సరాల పాటు ఐపీఎల్లో సులువుగా ఆడగలడని రాజేష్ మీనన్ ధీమా వ్యక్తం చేశారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మరియు విరాట్ కోహ్లీ ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాల లాంటి వారని సీఈఓ వ్యాఖ్యానించారు. ఆర్సీబీ ప్రయాణంలో కోహ్లీ ఎల్లప్పుడూ ఒక కీలకమైన స్థిరమైన శక్తిగా ఉన్నాడని కొనియాడారు. కోహ్లీలో ఉన్న ఫిట్నెస్, పరుగులు సాధించాలనే కసి, మైదానంలో చూపించే అద్భుతమైన ఎనర్జీ మరియు వైఖరిని బట్టి చూస్తే.. రాబోయే నాలుగేళ్ల పాటు అతను లీగ్‌లో ఆడటానికి ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ఐపీఎల్ చరిత్రలో మొదటి టైటిల్ కోసం ఏకంగా 18 ఏళ్ల పాటు సుదీర్ఘంగా వేచి చూసిన ఆర్సీబీ జట్టు, విరాట్ కోహ్లీ నాయకత్వ పటిమతో సరికొత్త రికార్డు సృష్టించింది.
గతేడాది టైటిల్ గెలవడమే కాకుండా, ఈ ఏడాది (2026) జరిగిన ఐపీఎల్ సీజన్ ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి బ్యాక్-టు-బ్యాక్ ఛాంపియన్‌గా నిలిచింది. తద్వారా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తర్వాత ఐపీఎల్లో టైటిల్‌ను విజయవంతంగా డిఫెండ్ చేసుకున్న మూడో జట్టుగా ఆర్సీబీ చరిత్రకెక్కింది. వరుసగా రెండుసార్లు ఐపీఎల్ కప్‌లు సాధించడంపై విరాట్ కోహ్లీ సామాజిక మాధ్యమం ‘X’ వేదికగా ఒక ఎమోషనల్ వీడియోను పంచుకుంటూ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో ఒత్తిడులు, ఆటంకాలు ఎదుర్కొని నమ్మకంతో సీజన్ ప్రారంభించి వరుస టైటిల్స్ సాధించామని, ఆర్సీబీ ఎల్లప్పుడూ తనకు సొంత ఇల్లు లాంటిదని కోహ్లీ భావోద్వేగానికి గురయ్యారు. ఆర్సీబీ కాకుండా తాను మరే ఇతర ఐపీఎల్ ఫ్రాంచైజీకి ఆడబోనని కోహ్లీ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే.








