’సుప్రీత’ వారి సుమధుర అన్నమ స్వరార్చన
అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా. శోభారాజు గారి ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న అన్నదానం – అన్నమ స్వరార్చన కార్యక్రమంలో భాగంగా ఈ శనివారం మధ్యాహ్నం భక్తులకు అన్నదాన ప్రసాద వితరణ జరిగగా సాయంత్రం యథావిధిగా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, అన్నమయ్య అష్టోత్తరం, అన్నమ గాయత్రి (గురు స్తుతి)తో కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రారంభమైంది.
అనంతరం సుప్రీత మ్యూజిక్ అకాడమీ గురువు శ్రీమతి కొమరవోలు రామాదేవి గారి మార్గదర్శకత్వంలో శిష్యులు శ్రీమతి కొమరవోలు రామాదేవి, బి.కె. కుసుమకుమారి, బి. అనిత, ధృవి తేజస్విని, వృత్తి ఓజస్విని, శ్రీమతి వసంతి, శ్రీమతి శ్రీదేవి, డా. వసుంధర, శ్రీమతి వసంత, కుమారి మౌనిక తదితరులు సంయుక్తంగా “శ్రీమత్వదీయ, శక్తి సహిత గణపతిం, చక్కని తల్లికి చాంగుభళా, జగడపు చనువుల జాజర, మేడలెక్కి నిన్ను జూచి, వేడుకొందామా, ఇందరికి అభయంబులిచ్చు చేయి, చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు, తిరుమల గిరిరాయ, ముద్దుగారే యశోద, సిరుత నవ్వులవాడే సిన్నెక్క, చూడరమ్మ సతులాలా” అనే బహుళ ప్రాచుర్యము పొందిన అన్నమాచార్య సంకీర్తనలను శ్రుతి–లయ-భక్తి సమన్వయంతో ఆలపించి విచ్చేసిన భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు. శిష్యుల గానం, భక్తి, సాహిత్య భావం, రాగభావ వ్యక్తీకరణలతో సాగి సభలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది. ముఖ్యంగా అన్నమయ్య సంకీర్తనల మాధుర్యాన్ని శ్రోతల హృదయాలకు చేరవేస్తూ స్వరార్చనను విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశ్రీ డా. శోభారాజు గారు ఒక అన్నమయ్య సంకీర్తనకు భావార్థ వివరణ ఇచ్చి, గురువు శ్రీమతి కొమరవోలు రామాదేవి గారు తమ శిష్యులను భక్తి, సంగీతం, సాహిత్య విలువలతో తీర్చిదిద్దుతున్న విధానం ప్రశంసనీయమని అభినందించారు.
తదనంతరం అన్నమాచార్య భావనా వాహిని పక్షాన సంస్థ వ్యవస్థాపకురాలు పద్మశ్రీ డా. శోభారాజు గారు, సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా. నందకుమార్ గారు పాల్గొన్న గాయకులకు, కళాకారులకు శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారి జ్ఞాపికలను అందించి సత్కరించారు.
కార్యక్రమం ముగింపులో శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి అంగనలీరే మంగళహారతి సమర్పించి, విచ్చేసిన భక్తులందరికీ పసందైన ప్రసాద వితరణతో విజయవంతంగా ముగిసింది.








