అలరించిన సూధా కూచిపూడి నృత్యం
అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా. శోభారాజు గారి ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న అన్నదానం – అన్నమ స్వరార్చన కార్యక్రమంలో భాగంగా ఈ శనివారం మధ్యాహ్నం భక్తులకు అన్నదాన ప్రసాద వితరణ జరిగింది. అనంతరం సాయంత్రం యథావిధిగా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, అన్నమయ్య అష్టోత్తరం, అన్నమ గాయత్రి (గురు స్తుతి)తో కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రారంభమైంది.
అనంతరం కూచిపూడి నర్తకి జి. సుధా శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి భక్తిపూర్వక నృత్యార్చన సమర్పించారు.
గురువులు పసుమర్తి రత్తయ్య శర్మ గారు మరియు శ్రీ లక్ష్మి గోవర్ధనన్ గారి శిక్షణలో తీర్చిదిద్దబడిన సుధా గారు తమ నృత్య నైపుణ్యంతో “సకల గణాధిప”, “దశావతార శబ్దం”, “మండోదరి శబ్దం” అనే నృత్యాంశాలను భావ, రాగ, లయ, అభినయ సమన్వయంతో ప్రదర్శించి భక్తులను విశేషంగా అలరించారు. ముఖ్యంగా దశావతార శబ్దంలో శ్రీమహావిష్ణువు దశావతారాల వైభవాన్ని, మండోదరి శబ్దంలో పాత్రోచిత అభినయాన్ని హృద్యంగా ఆవిష్కరించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
ఈ సందర్భంగా పద్మశ్రీ డా. శోభారాజు గారు ఒక అన్నమయ్య సంకీర్తనకు భావార్థ వివరణ ఇచ్చి, కళాకారిణి ప్రదర్శనను అభినందించారు. గురువుల శిక్షణలో సుధా గారు నృత్యకళలో సాధించిన ప్రావీణ్యం ప్రశంసనీయమని పేర్కొన్నారు.
తదనంతరం అన్నమాచార్య భావనా వాహిని పక్షాన సంస్థ వ్యవస్థాపకురాలు పద్మశ్రీ డా. శోభారాజు గారు, సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా. నందకుమార్ గారు కళాకారిణికి శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారి జ్ఞాపికను అందించి సత్కరించారు.
కార్యక్రమం ముగింపులో శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి అంగనలీరే మంగళహారతి సమర్పించి, విచ్చేసిన భక్తులందరికీ ప్రసాద వితరణతో ఈ శనివారం అన్నమయ్యపురంలో జరిగిన కూచిపూడి నృత్యార్చన కార్యక్రమం భక్తి, నాట్య మాధుర్యంతో విజయవంతంగా ముగిసింది.








