తిరుమల బ్రహ్మోత్సవాలకు రంగం సిద్దం..!
తిరుమల(Tirumala) కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 28 నుండి జూన్ 5 వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. దీనికి సంబంధించిన బ్రహ్మోత్సవాల పోస్టర్లు, కరపత్రాలను టీటీడీ(TTD) ఈవో ముద్దాడ రవిచంద్ర తిరుపతిలోని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల నిర్వహణపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఈవో, మే 24న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, మే 27న అంకురార్పణం కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఆధ్యాత్మిక దివ్యానుభూతి కలిగేలా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 7:30 నుండి 9:30 గంటల వరకు, అలాగే రాత్రి 7:00 నుండి 9:00 గంటల వరకు స్వామివారు, అమ్మవార్లు వివిధ దివ్య వాహనాలపై పురవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇందులో భాగంగా మే 28న ఉదయం ధ్వజారోహణం, రాత్రి పెద్దశేష వాహన సేవలు ఉంటాయి. ఆ తర్వాత వరుసగా మే 29న చిన్నశేష, హంస వాహనాలు, మే 30న సింహ, ముత్యపుపందిరి వాహనాలు, మే 31న కల్పవృక్ష, సర్వభూపాల వాహనాలు, జూన్ 1న మోహినీ అవతారం, గరుడ వాహనం, జూన్ 2న హనుమంత, గజ వాహనాలు, జూన్ 3న సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలపై స్వామివారు విహరిస్తారు.
జూన్ 4న ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహన సేవలు జరగనుండగా, జూన్ 5న ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన స్వామివారి కల్యాణోత్సవాన్ని జూన్ 4వ తేదీ రాత్రి 8:30 గంటలకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ కల్యాణోత్సవానికి భారీ సంఖ్యలో తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో అధికారులను ఆదేశించారు. కల్యాణోత్సవ వేడుకను కళ్లారా వీక్షించేందుకు వచ్చే భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, ప్రసాదాల పంపిణీ, గ్యాలరీల్లో కూర్చునే వసతులు మరియు భద్రతా చర్యలలో ఎలాంటి లోపాలు లేకుండా సమగ్రంగా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.







