పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు : మంత్రి కొండా సురేఖ
సరస్వతి అంత్య పుష్కరాల (Saraswati Antya Pushkaralu)కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) వెల్లడించారు. వరంగల్ లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో కంచి పీఠాధిపతి విజయేంద్రస్వామి (Vijayeendra Swami)తో కలిసి కొండ సురేఖ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయం బయట కొండా సురేఖ విలేకర్లతో మాట్లాడుతూ ఈ పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. పుష్కరాలకు రూ. 200 కోట్లకు పైగా నిధులు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు. రోజుకు ఒక స్వామీజీ స్నానంతో ఈ పుష్కరాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ పుష్కరాలు జరిగే ఈ పది రోజులు, 10 మంది పీఠాధిపతులు వస్తారని తెలిపారు. కాళేశ్వరం (Kaleshwaram)లో జరిగే ఈ సరస్వతి పుష్కరాల్లో ప్రతి రోజు సాయంత్రం గోదావరి హారతి ఇస్తారని చెప్పారు. ఈ పుష్కరాల సందర్భంగా పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ పుష్కరాల సందర్భంగా భక్తులకు పెద్ద ఎత్తున సేవలందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బాసర నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం వరకు దేవాలయాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు.
ఇవి కూడా చదవండి







