యుద్ధంలో మొదలైన కథ… భారత్ తో భారీ డీల్‌గా ఎలా మారింది?
–సూర్య ప్రకాష్ జోశ్యుల
భారీ చెక్క తలుపు నెమ్మదిగా మూసుకుంది.
గదిలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది.
బయట కెమెరాలు ఇంకా మెరుస్తూనే ఉన్నాయి. గార్డ్ ఆఫ్ ఆనర్ ముగిసింది. ప్రపంచ మీడియా ఇంకా బయటే ఎదురుచూస్తోంది.
కానీ…
ఆ గదిలో ఇప్పుడు కెమెరాలు లేవు. మాటలు కూడా లేవు. టేబుల్ మీద మాత్రం మూడు ఫైళ్లు ఉన్నాయి.
మొదటి ఫైల్‌పై పెద్ద అక్షరాల్లో…
ASTRA
రెండో ఫైల్‌పై…
BRAHMOS
మూడో ఫైల్‌పై…
EVM
ఒక్కొక్క ఫైల్ తెరుచుకుంటోంది.
ఒక్కొక్క సంతకం పడుతోంది.
చూడటానికి అవి మూడు వేర్వేరు ఒప్పందాలు.
కానీ…
ఆ మూడు ఫైళ్లను ఒకే కనిపించని దారం కలిపి ఉంచింది.
ఆ దారం… ఏడాది క్రితం యుద్ధరంగంలో నేయబడింది.
…
ఆకాశాన్ని చీల్చుకుంటూ అగ్నిరేఖలా దూసుకెళ్లిన భారత క్షిపణి…
కొన్ని సెకన్లలో లక్ష్యాన్ని ఛేదించింది.
ఆ పేలుడు శబ్దం సరిహద్దుల దగ్గరే ఆగిపోలేదు. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశాల వ్యూహాత్మక లెక్కల్లో కూడా ప్రతిధ్వనించింది.
అందుకే…
ఈరోజు ఒక దేశం భారత్‌ను కేవలం క్షిపణులు అడగలేదు. ఎన్నికలు నిర్వహించే సాంకేతికతను కూడా అడిగింది. సముద్ర మార్గాల భద్రతలో భాగస్వామ్యం కూడా కోరింది.
ఒకప్పుడు ప్రపంచం వైపు చూసి ఆయుధాలు కొనుగోలు చేసిన భారత్… ఈరోజు ప్రపంచ దేశాలు తలుపు తట్టి, “మాకూ మీ టెక్నాలజీ కావాలి… మీ క్షిపణులు కావాలి… మీతో భాగస్వామ్యం కావాలి” అని చెప్పే స్థాయికి ఎలా చేరుకుంది?
ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే…
జకార్తాలో మూసుకున్న ఆ చెక్క తలుపుల వెనుక జరిగిన సమావేశం దగ్గర నుంచి కాదు…అంతకంటే ముందే ప్రారంభమైన ఆపరేషన్ సిందూర్ దగ్గర నుంచి కథ మొదలుపెట్టాలి.
ఆపరేషన్ సిందూర్.
యుద్ధరంగంలో భారత రక్షణ సాంకేతికతపై ప్రపంచ దృష్టి ఒక్కసారిగా పడిన క్షణం అది. అక్కడ కనిపించింది కేవలం ఒక క్షిపణి సామర్థ్యం మాత్రమే కాదు… భారత్ రక్షణ రంగం ఎంత వేగంగా మారుతోందో ప్రపంచానికి కనిపించిన ఒక సంకేతం.
అదే సంకేతాన్ని ఇండోనేషియా కూడా గమనించింది.
అందుకే జకార్తాలో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో మొదటి చర్చల్లో ఒకటి అస్త్రా గాలి నుంచి గాలిలోని లక్ష్యాలను ఛేదించే క్షిపణుల గురించే జరిగింది. ఆపరేషన్ సిందూర్‌లో భారత సామర్థ్యం చూసిన తర్వాత ఈ క్షిపణులను దిగుమతి చేసుకోవాలని ఇండోనేషియా నిర్ణయించినట్లు సమాచారం.
అయితే అది ఆ సమావేశంలో జరిగిన అతిపెద్ద పరిణామం కాదు.
ఎందుకంటే… ఇండోనేషియా భారత్‌ను అడిగింది కొత్త ఆయుధాలను మాత్రమే కాదు. ఇప్పటికే తన వద్ద ఉన్న బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థను మరింత విస్తరించాలని కూడా నిర్ణయించింది. అదనపు క్షిపణి బ్యాటరీలను భారత్ సరఫరా చేయడానికి ఇరు దేశాలు ముందుకు వస్తున్నాయి.
ఒకే సమావేశంలో…
ఒక దేశం రెండు రకాల భారత క్షిపణి వ్యవస్థలపై ఆసక్తి చూపడం… భారత్‌కు లభిస్తున్న వ్యూహాత్మక నమ్మకానికి మరో ఉదాహరణగా మారింది.
కానీ…
టేబుల్‌పై ఉన్న మూడో ఫైల్ ఇంకా తెరవాల్సి ఉంది.ఆ ఫైల్‌పై ఉన్న మూడు అక్షరాలు…
EVM.
క్షిపణులు కొనడం ఒక విషయం.
కానీ…ఒక దేశం మరో దేశ ఎన్నికల నిర్వహణ సాంకేతికతను స్వీకరించాలని నిర్ణయించుకోవడం పూర్తిగా వేరే విషయం.
భారత్ ఎన్నికల నిర్వహణ అనుభవాన్ని ఆధారంగా చేసుకుని, ఇండోనేషియాకు అనుగుణంగా ప్రత్యేక ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను అభివృద్ధి చేయడంలో భారత్ సహకరించనుంది. అంటే భారత్ ఇప్పుడు భద్రతా సాంకేతికత మాత్రమే కాదు… ప్రజాస్వామ్య నిర్వహణలోని తన అనుభవాన్ని కూడా ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంటోంది.
అయితే ఈ కథ ఇంకా పూర్తికాలేదు.
టేబుల్‌పై మరో మ్యాప్ విప్పారు.
ఆ మ్యాప్‌లో ప్రపంచంలోనే అత్యంత కీలక సముద్ర వాణిజ్య మార్గాల్లో ఒకటైన మలక్కా జలసంధి కనిపిస్తోంది.
దానికి ఎదురుగా…
సబాంగ్ పోర్ట్.
మరోవైపు…
భారత్ అభివృద్ధి చేస్తున్న గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్.
ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం వంద మైళ్లకు కొద్దిగా ఎక్కువే.
అందుకే సబాంగ్ పోర్టును సంయుక్తంగా అభివృద్ధి చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఇది కేవలం ఒక పోర్టు ప్రాజెక్టు కాదు… హిందూ మహాసముద్రంలో భారత్ వ్యూహాత్మక ఉనికిని మరింత బలపరిచే అడుగు.
సమావేశం అక్కడితో ఆగలేదు.
ప్రపంచం ఇప్పుడు అత్యంత పోటీగా చూస్తున్న మరో రంగం… క్రిటికల్ మినరల్స్. స్టీల్, నికెల్, అరుదైన భూ ఖనిజాలతో తయారయ్యే పర్మనెంట్ మ్యాగ్నెట్ల ఉత్పత్తిలో ఇండోనేషియాతో కలిసి భారత్ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. ఎలక్ట్రిక్ వాహనాల నుంచి అధునాతన రక్షణ వ్యవస్థల వరకు అవసరమయ్యే ఈ ఖనిజాల్లో భాగస్వామ్యం, రెండు దేశాల సరఫరా గొలుసును మరింత బలోపేతం చేయనుంది.
సమావేశం ముగిసింది.
మూడు ఫైళ్లు మళ్లీ మూసుకుపోయాయి.
భారీ చెక్క తలుపులు నెమ్మదిగా తెరుచుకున్నాయి.
బయట కెమెరాలు మళ్లీ మెరిపించాయి.
భారత ప్రధాని నరేంద్ర మోదీ… ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో… చిరునవ్వుతో బయటకు నడిచివచ్చారు.
ప్రపంచం చూసింది… ఒక సాధారణ హ్యాండ్‌షేక్. అలాగే… ఆ గది నుంచి బయటకు వచ్చినది…కొన్ని ఒప్పందాలు మాత్రమే కాదు. భారత్‌కు సంబంధించిన ఒక కొత్త నిర్వచనం.
ఒకప్పుడు…
ప్రపంచం నుంచి ఆయుధాలు కొనుగోలు చేసిన దేశం.
ఈరోజు…
ప్రపంచ దేశాలే భారత్‌ను ఆశ్రయించి క్షిపణులు కోరుతున్నాయి.
ఒకప్పుడు…
ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ప్రపంచ అనుభవాలను అధ్యయనం చేసిన దేశం.
ఈరోజు…
తన ఎన్నికల సాంకేతికతను మరో దేశం స్వీకరించాలని కోరుతోంది.
ఒకప్పుడు…
సముద్ర మార్గాల భద్రతను ఇతర శక్తులు నిర్ణయించేవి.
ఈరోజు…
అదే సముద్ర మార్గాల భవిష్యత్తును నిర్ణయించే టేబుల్ వద్ద భారత్ కూడా కూర్చుంది.
ఆ రోజు జకార్తాలో కనిపించింది…
Battlefield నుంచి Business వరకు…
భారత్ రాసుకుంటున్న కొత్త కథ.








