మెలోనీ విషయంలో.. ట్రంప్ యూ టర్న్..!
జీ-7 సదస్సు సందర్భంగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ.. తనతో ఫోటో దిగేందుకు బతిమలాడిందని.. పోనీలే అని తాను సెల్ఫీ దిగానంటూ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ట్రంప్.. ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. ఆ సమయంలో ట్రంప్ తీరుపై ఇటలీ ప్రదానితో పాటు విపక్షనేత, పార్లమెంటు సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు . దీంతో అది అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అయితే ఇప్పుడు అదే ట్రంప్.. ఇటలీ ప్రధాని మెలోనీ అంటే తనకు అభిమానమే అని చెప్పుకొచ్చారు.
ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మంచి వ్యక్తి అని, ఆమె అంటే తనకు అభిమానమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) పేర్కొన్నారు. అయితే, ఇరాన్ విషయంలో తమకు సాయం చేసేందుకు ఆమె నిరాకరించారని, దాంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు కొంత దెబ్బతిన్నాయని వ్యాఖ్యానించారు. తుర్కియే రాజధాని అంకారాలో జరుగుతున్న నాటో శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మీడియాతో ట్రంప్ మాట్లాడుతూ.. ఇటలీ ప్రధాని గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు ఇలా స్పందించారు.
హర్మూజ్ విషయంలో అమెరికాకు మద్దతు ఇచ్చేందుకు ఇటలీ నిరాకరించిందని, అయినప్పటికీ తాము మెలోనీపై ఎటువంటి ఒత్తిడి చేయలేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఆమె నిర్ణయం ఓ తప్పిదమన్న ఆయన.. అమెరికాకు సొంత ఇంధన వనరులు ఉన్నందున హర్మూజ్‌పై ఆధారపడటం లేదన్నారు. కేవలం దానిని వ్యూహాత్మకంగా ముఖ్యమైన ప్రాంతంగానే చూస్తున్నామన్నారు. ఇటలీ అండగా నిలవనందునే.. తాను కొంత అసంతృప్తికి గురయ్యానని అన్నారు.








