ఇరాన్ చమురు విక్రయాల లైసెన్స్ రద్దు.. మళ్లీ పశ్చిమాసియాలో దాడుల పర్వం..!
అగ్రరాజ్యం అమెరికా.. పశ్చిమాసియా శాంతిప్రక్రియను రెండడుగులు ముందుకు ఓ అడుగు ముందుకు తీసుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. దాదాపు మూడు నెలల తర్వాత ఇరాన్ తో శాంతిప్రక్రియను ముగింపు దశకు తీసుకొచ్చిన అమెరికా.. తిరిగి దాన్ని ప్రమాదంలో పడేసినట్లు కనిపిస్తోంది. ఇరాన్ సుప్రీంనేత అయాతుల్లా ఖమైనీ అంత్యక్రియల వేళ.. ఇరాన్ హర్మూజ్ జలసంధిలో మూడు వాణిజ్య నౌకలపై దాడి చేసింది .దీనికి ప్రతిగా గంటల వ్చవధిలోనే ఇరాన్ సైనిక స్థావరాలు, నౌకాశ్రయాల మౌలిక సదుపాయాలపై అమెరికా విరుచుకుపడింది. ఈమేరకు యుఎస్ సెంట్రల్ కమాండ్ ఓ ప్రకటన విడుదల చేసింది. అంతర్జాతీయ జలమార్గంలో అమాయక పౌరులు ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై దాడులకు ఇరాన్ మూల్యం చెల్లించుకునేలా.. అమెరికా దళాలు ఈ దాడులు చేపట్టాయని పేర్కొంది.
ఇరాన్ (Iran) వైమానిక రక్షణ వ్యవస్థలు, తీరప్రాంత నిఘా వ్యవస్థలు, క్షిపణి నిల్వలు, డ్రోన్ల ప్రయోగ స్థావరాలను తమ సేనలు లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా అధికారులు తెలిపారు. ఇరాన్ నౌకాశ్రయాల మౌలిక సదుపాయాలపైనా దాడులు చేసినట్లు చెప్పారు. ఖేష్మ్, బందర్ అబ్బాస్‌లలో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. నాటో కూటమి శిఖరాగ్ర సమావేశం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తుర్కియేలో ఉన్న సమయంలో ఈ దాడులు జరిగాయి.
చమురు విక్రయాల లైసెన్స్ రద్దు..
ఈ దాడులకు ముందే చమురు విక్రయాలకు సంబంధించి ఇరాన్ లైసెన్స్‌ను అమెరికా (USA) రద్దు చేసింది. హర్మూజ్‌లో ఇరాన్ చర్యలు ఆమోదయోగ్యం కావని, అందుకే లైసెన్స్‌ను రద్దు చేసినట్లు ఓ అమెరికా అధికారి తెలిపారు. ఈ చర్యను ఇరాన్ విదేశాంగశాఖ తీవ్రంగా ఖండించింది. ఇది తాత్కాలిక ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొంది. దీని పర్యవసానాలకు అమెరికా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పింది.








