దిల్జిత్ ఆరా టూర్ దూకుడు.. నార్త్ అమెరికాలోనే ₹425 కోట్ల కలెక్షన్స్!
పంజాబీ సంగీతాన్ని ప్రపంచవ్యాప్తంగా మరింత ఎత్తుకు తీసుకెళ్తున్న సింగర్, నటుడు దిల్జిత్ దోసాంజ్(Diljith Dosanjh) తన ఆరా వరల్డ్ టూర్(Aura World tour) తో మరో అరుదైన మైలురాయిని అందుకున్నారు. ఈ టూర్లో నార్త్ అమెరికా షోలు మాత్రమే సుమారు 3.17 లక్షల టికెట్లు విక్రయించగా, దాదాపు 45 మిలియన్ డాలర్ల (సుమారు ₹425 కోట్లు) గ్రాస్ కలెక్షన్లు నమోదైనట్లు అంతర్జాతీయ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది దిల్జిత్ కెరీర్లో ఇప్పటివరకు ఆ ఏరియాలో సాధించిన అత్యుత్తమ టూర్ రిజల్ట్ గా నిలవడంతో పాటు, ఇండియన్ మ్యూజిక్ ఆర్టిస్టుల గ్లోబల్ మార్కెట్ ఎంత వేగంగా విస్తరిస్తోందో మరోసారి రుజువు చేసింది.
ఇంతకుముందు సంచలన విజయాన్ని నమోదు చేసిన దిల్ లుమినటి వరల్డ్ టూర్ నార్త్ అమెరికా లెగ్‌తో పోలిస్తే ఈసారి కలెక్షన్లు గణనీయంగా పెరిగినట్లు విశ్లేషణలు సూచిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గత టూర్ దాదాపు 100 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ ను అందుకోగా, ప్రస్తుతం కొనసాగుతున్న ఆరా టూర్ అదే రికార్డును అధిగమించే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇంకా పలుచోట్ల షోలు మిగిలి ఉండటంతో ఫైనల్ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
మ్యూజిక్, సినిమాలు, లైవ్ కాన్సర్ట్స్ అనే మూడు రంగాల్లోనూ దిల్జిత్ కొనసాగిస్తున్న విజయయాత్ర అతడిని భారతీయ వినోద రంగంలో అత్యంత ప్రభావవంతమైన స్టార్లలో ఒకరిగా నిలబెట్టింది. ప్రపంచవ్యాప్తంగా భారీ అరేనాలను వరుసగా హౌస్‌ఫుల్ చేయగల సామర్థ్యం అతని బ్రాండ్ విలువను మరింత పెంచుతోంది. ఇదే జోరు కొనసాగితే ప్రస్తుతం అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న భారతీయ ఎంటర్టైన్మెంట్ సెలబ్రిటీల లిస్ట్‌లో దిల్జిత్ అగ్రస్థానానికి చేరుకోవడం ఆశ్చర్యకరం కాదనే అభిప్రాయం సినీ, సంగీత విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది.








