ఫుట్‌బాల్ అభిమానులకు బ్యాడ్ న్యూస్..!
ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో(C Ronaldo) అంతర్జాతీయ కెరీర్ ముగింపు దశకు చేరుకుందనే వార్త అభిమానుల గుండెల్ని పిండేస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ 2026(FIFA World CUP) టోర్నమెంట్ రొనాల్డోకు పోర్చుగల్ జాతీయ జట్టు తరఫున ఆఖరి టోర్నీ కానుందని ఆయన సోదరి కటియా అవీరో హింట్ ఇచ్చారు. రొనాల్డో అంతర్జాతీయ ప్రయాణం ముగింపునకు దగ్గరపడిందని, ఇది ఆయనకు ‘లాస్ట్ డాన్స్’ (చివరి ప్రదర్శన) అని ఆమె పేర్కొన్నారు. టొరంటోలోని బీఎమ్‌ఓ ఫీల్డ్ వెలుపల మీడియాతో మాట్లాడిన ఆమె, రొనాల్డో ఆటను మునుపటి కంటే ఎక్కువగా ఆస్వాదించాలని, ఎందుకంటే ఆయన త్వరలోనే వీడ్కోలు చెప్పబోతున్నారని స్పష్టం చేశారు.
రొనాల్డో తన కెరీర్లో 1,000 గోల్స్ మైలురాయిని అందుకున్న తర్వాత రిటైర్ అవుతారా? అని రిపోర్టర్లు ప్రశ్నించగా, కటియా అవీరో కీలక వివరణ ఇచ్చారు. తాను కేవలం పోర్చుగల్ జాతీయ జట్టుకు సంబంధించిన వీడ్కోలు గురించే మాట్లాడుతున్నానని ఆమె స్పష్టం చేశారు. ఒక నమ్మకమైన మూలం ద్వారా అందిన సమాచారం ప్రకారమే ఈ వరల్డ్ కప్ టోర్నీ అతడికి చివరిదని చెబుతున్నట్లు తెలిపారు. అయితే క్లబ్ ఫుట్‌బాల్ కెరీర్‌ను ఆయన ఇప్పుడప్పుడే ముగించే అవకాశం లేదని ఆమె మాటల ద్వారా స్పష్టమవుతోంది.
ప్రస్తుతం 41 ఏళ్ల వయసులో ఉన్న రొనాల్డో, పోర్చుగల్ చరిత్రలోనే అత్యధిక మ్యాచ్‌లు ఆడిన మరియు అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా రికార్డుల్లో నిలిచారు. 5 సార్లు ప్రతిష్టాత్మక ‘బాలోన్ డి ఓర్’ అవార్డు గెలుచుకున్న ఈ స్టార్ ప్లేయర్, పోర్చుగల్‌కు యూఈఎఫ్ఏ యూరో 2016 టైటిల్‌తో పాటు 2019 నేషన్స్ లీగ్‌ను అందించారు. వరల్డ్ కప్ రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో క్రొయేషియాపై పెనాల్టీ ద్వారా రొనాల్డో గోల్ కొట్టడంతో పోర్చుగల్ 2-1తో విజయం సాధించి రౌండ్ ఆఫ్ 16కు దూసుకెళ్లింది. తదుపరి రౌండ్లో పోర్చుగల్ జట్టు స్పెయిన్‌తో తలపడనుండగా, రొనాల్డో ఈ ఆఖరి మెగా టోర్నీని కప్ గెలవడంతో ముగించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.








