అయాతుల్లా ఖమైనీ అంత్యక్రియలకు ఏర్పాట్లు.. మొజ్తబా దూరం..!
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) అంత్యక్రియలకు జోరుగా ఏర్పాట్లు సాగుతున్నాయి. జులై 5 న ప్రారంభమై.. జులై 9న ఈ కార్యక్రమం ముగియనుంది. దీనికిగానూ ప్రపంచదేశాధినేతలకు ఆహ్వానాలందాయి. భారత్ తరపున ప్రధాని మోడీకి బదులుమంత్రులు హాజరు కానున్నారు. అయితే.. అంత్యక్రియలకు తరలివచ్చే లక్షలాది అభిమానులను నియంత్రించడం ఇరాన్ అధికారులకు సవాలుగా మారనుందని తెలుస్తోంది.
గతంలో ఆయతుల్లా రుహొల్లా ఖొమేనీ, ఖాసిమ్ సులేమానీ అంత్యక్రియల సమయంలో తోపులాటలు జరగడం, ఆయా ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడం వంటి మునుపటి విషాదాలు ఇరాన్ పాలకులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి.
ఇరాక్, ఇరాన్ దేశాల్లో అనేక నగరాల మీదుగా ఖమేనీ అంతిమయాత్ర (Khamenei Funeral) ఎటువంటి ఆటంకం లేకుండా సాగేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జులై 5న ఈ ప్రక్రియ రాజధాని టెహ్రాన్‌లో మొదలై.. ఇరాక్‌లోని నజాఫ్, కర్బలా నగరాల్లో కొనసాగనుంది. ఆ తర్వాత పార్థివదేహాన్ని ఇరాన్‌లోని ఖోమ్ మీదుగా ఖమేనీ స్వస్థలం మషాద్‌కు జులై 9న తీసుకురానున్నట్లు సమాచారం. మతపెద్దల సమక్షంలో ప్రార్థనలు నిర్వహించి అక్కడే ఖననం చేయనున్నారు. అత్యవసర చర్యల్లో భాగంగా హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించుతున్నారు.
రద్దీని నియంత్రించడం, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చూడడం అత్యంత సవాలుగా మారినట్లు ఇరాన్ అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు ఏర్పాట్లకు సంబంధించి వారం క్రితం బాగ్దాద్‌లో పర్యటించిన ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాగ్చీ.. అక్కడి అధికారులతో చర్చించారు.
కోల్డ్ స్టోరేజీలో మృతదేహం..?
ఫిబ్రవరి 28న జరిగిన దాడిలో సుప్రీం లీడర్ అలీ ఖమేనీ చనిపోగా. నాలుగు నెలలుగా ఆయన మృతదేహాన్ని ఎలా భద్రపరిచారనే విషయం ఆసక్తిగా మారింది. ప్రస్తుతం యుద్ధం కారణంగా అంత్యక్రియలు ఆలస్యం కావడంతో ఖమేనీ మృతదేహాన్ని కోల్డ్ స్టోరేజీలోనే భద్రపరిచి ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మొజ్తాబా దూరం..?
ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ, తన తండ్రి దివంగత అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకాకపోవచ్చని తెలుస్తోంది. తీవ్రమైన భద్రతా ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో, ఆయన బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనకపోవచ్చని ఇరాన్ సీనియర్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఈ పరిణామం ఇరాన్‌తో పాటు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో, భారత్‌లోని ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి అయతొల్లా హకీం ఇలాహీ కీలక విషయాలను వెల్లడించారు. “మొజ్తబా స్వయంగా ప్రజల వద్దకు రావాలని, వారిని కలవాలని ఆకాంక్షిస్తున్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో భద్రతా దళాలు అందుకు అనుమతించడం లేదు. ఆయనకు రక్షణ కల్పించడం అత్యంత ప్రమాదకరమని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. ఈ కారణంతోనే ఆయన అంత్యక్రియలకు కూడా హాజరుకాకపోవచ్చు” అని ఇలాహీ తెలిపారు.








