క్రిప్టో కరెన్సీ బిజినెస్ లో ఎలాంటి తప్పు లేదు.. విమర్శకులపై ట్రంప్ పైర్….!
2025లో ట్రంప్ కుటుంబానికి చెందిన క్రిప్టో సంస్థలు ఏకంగా 1.4 బిలియన్ డాలర్లు సంపాదించాయి. ట్రంప్ మొత్తం వార్షికాదాయం 2.2 బిలియన్ డాలర్లుగా చూపించగా.. అందులో సగానికి పైగా క్రిప్టో కరెన్సీ ద్వారానే వచ్చాయి. అయితే క్రిప్టో ద్వారా భారీ లాభాలపై వస్తున్న విమర్శలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. తమ వ్యాపార సామ్రాజ్యం సంపాదించిన నిధులలో ఎలాంటి ‘చట్టవిరుద్ధమైన’ లేదా తప్పుడు విధానాలు లేవని సమర్థించుకున్నారు.
ట్రంప్ కుమారులు ఎరిక్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్లతో కలిసి ప్రారంభించిన ఈ క్రిప్టో ప్లాట్‌ఫాం గవర్నెన్స్ టోకెన్ల విక్రయం ద్వారా 500 మిలియన్ డాలర్లకు పైగా లాభాలు వచ్చాయి.ట్రంప్ పేరుతో నడిచే ‘$TRUMP’ మీమ్‌కాయిన్ లైసెన్సింగ్, ఫీజుల ద్వారా ఈ సంస్థ ఏకంగా 600 మిలియన్ డాలర్ల పైగా ఆర్జించింది.
ట్రంప్ రియాక్షన్..!
ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ ‘సీఎన్‌బీసీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యవహారంపై స్పందించారు. తనకు ఈ వ్యాపారాల కచ్చితమైన లాభాల గణాంకాలు తెలియకపోయినప్పటికీ.. ఇవన్నీ చట్టబద్ధమైన వ్యాపారాలేనని ఆయన తేల్చి చెప్పారు. “ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో చైనాతో పోటీ పడుతున్నట్లే.. క్రిప్టో రంగంలోనూ అమెరికా అగ్రస్థానంలో నిలవాలనేది తన వ్యూహమన్నారు ట్రంప్. ఇందులో ఎలాంటి ప్రయోజనాల ఘర్షణ లేదు” అని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ వ్యాపారాలను ట్రంప్ కుమారులు స్వతంత్రంగా చూసుకుంటున్నారని వైట్ హౌస్ వెల్లడించింది.
పెద్దఎత్తున విమర్శలు..!
ఈ వ్యవహారంపై అమెరికాలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్‌ను నమ్మి ఆయన బ్రాండ్ ఉన్న క్రిప్టో కాయిన్స్ కొనుగోలు చేసిన వేలాది మంది రిటైల్ ఇన్వెస్టర్లు (ముఖ్యంగా ట్రంప్ రాజకీయ మద్దతుదారులు) ఘోరంగా నష్టపోయారు. ప్రారంభంలో ఈ కాయిన్స్ అమ్మిన ట్రంప్ సంస్థలు లాభాలు గడించగా, ప్రస్తుతం మెజారిటీ ఇన్వెస్టర్ల క్రిప్టో వాలెట్లు భారీ నష్టాల్లో ఉన్నట్లు నివేదికలు చెప్తున్నాయి.
మరోవైపు, క్రిప్టో రంగాన్ని ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకునే అధికారంలో ఉన్న దేశాధ్యక్షుడే.. స్వయంగా ఆయా కాయిన్స్ ద్వారా లాభాలు పొందడం నైతికంగా తప్పని నైతిక విశ్లేషకులు, డెమొక్రాట్ పార్టీ నేతలు మండిపడుతున్నారు.








