అమెరికా – కెనడా ట్రేడ్ వార్.. 50 శాతం సుంకాలు విధించిన కార్నీసర్కార్..!
అమెరికా-కెనడా మధ్య వాణిజ్యపోరు మరింత తీవ్రమైంది. అమెరికా ఇప్పటికే 50 శాతం సుంకాలతో విరుచుకుపడగా.. కెనడా సైతం అగ్రరాజ్యంపై తాజాగా ప్రతీకార సుంకాలు విధించింది (Canada Tariffs). 27.6 బిలియన్ కెనడియన్ డాలర్ల (సుమారు 20బిలియన్ డాలర్లు) విలువైన.. 700లకు పైగా అమెరికా వస్తువులపై టారిఫ్లు విధిస్తున్నట్లు ఆ దేశ పరిశ్రమల శాఖ మంత్రి ఫ్రాంకోయిస్-ఫిలిప్ షాంపేన్ ప్రకటించారు.
25 శాతం సుంకాలు ఉన్న వస్తువుల్లో గృహోపకరణాలు, జున్ను వంటి పాల ఉత్పత్తులు, చేపలు, సముద్రపు ఆహారం వంటివి ఉన్నాయి. ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులతో పాటు ఫర్నిచర్, వస్త్రాలకు అత్యధికంగా 50 శాతం సుంకాలు అమల్లోకి రానున్నాయి. మరికొన్ని వస్తువులు, ఉత్పత్తులపై 15, 25 శాతం చొప్పున ప్రతి-సుంకాలు విధించింది. కెనడియన్ కార్లు, ట్రక్కులు, ఆటోమోటివ్ విడిభాగాలు ఉక్కు దిగుమతులపై ట్రంప్ 50శాతం సుంకాలు విధించిన నేపథ్యంలో ఈ తాజా ప్రకటన వెలువడింది.
అమెరికా వస్తువులపై ప్రతీకార సుంకాలతో పాటు, దేశీయ వ్యాపారాలు, కార్మికుల కోసం కెనడా 7.5 బిలియన్ కెనడియన్ డాలర్లతో సహాయ ప్యాకేజీని ప్రకటించింది. ‘అమెరికా ప్రతిపాదించిన కొత్త నిబంధనలు కెనడా ప్రయోజనాలకు అనుకూలంగా లేవు. కెనడా నుంచి ఎక్కువ ఆశిస్తున్న అగ్రరాజ్యం.. ప్రతిఫలంగా మాకు చాలా తక్కువ వనరులను ఇస్తోంది. అందువల్లే మా కార్మికులు, వ్యాపారాలు, వ్యూహాత్మక రంగాలు.. జాతీయ ప్రయోజనాలు దెబ్బతినకుండా ఉండేందుకు ఆ దేశంతో చర్చలు నిలివేశాం’ అని కెనడా ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
కెనడా ఫ్రీరైడ్ ముగిసింది..
కెనడా దశాబ్దాలుగా అమెరికాను దోచుకుంటోందని మరోవైపు అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ (White House) ఆరోపించింది. తాజా సుంకాలతో ట్రంప్ దాని దోపిడీకి ముగింపు పలికారని తెలిపింది. వివక్షపూరితమైన ఆ దేశ వాణిజ్య పద్ధతులను ఇకపై తాము అంగీకరించబోమని స్పష్టం చేసింది. ‘చర్చల సమయంలో ఉక్కు, అల్యూమినియం, కలప ఇతర వస్తువులపై భారీ తగ్గింపులు చేపట్టడానికి హామీ ఇచ్చాం. ప్రపంచంలోని ఏ దేశానికీ ఇవ్వని ప్రాధాన్యతను కెనడాకు ఇచ్చాం. అయినప్పటికీ ఒప్పందం నుంచి వైదొలిగారు. చర్చలకు బదులుగా ప్రతీకారాన్ని ఎంచుకున్నారు’ అని పేర్కొంది.








