నేపాల్ విలయానికి భూకంపమే ప్రధానకారణం..!
నేపాల్ నీటమునిగింది. ముఖ్యంగా రసువా జిల్లా అయితే నామరూపాల్లేకుండా పోయింది. భోటెకోశీనది మహోగ్రరూపం దాల్చడంతో… భారతీయులు సహా వందలాది మంది గల్లంతయ్యారు. అనేక భవనాలు, వాహనాలు కొట్టుకుపోయాయి. బురదలో అనేక మంది కూరుకుపోయినట్లు అంచనా వేస్తున్నారు. అయితే, భూకంపం ఆపై కొండచరియలు విరిగిపడటంతోనే భోటెకోశీ నది ప్రళయానికి కారణమని నేపాల్ విదేశాంగ శాఖ వెల్లడించింది.
‘‘బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయంలో భూకంపం వచ్చింది. దాని కారణంగా భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. నది ప్రవాహానికి అడ్డుపడడం ఆకస్మిక వరదలకు కారణమైనట్లు తెలుస్తోంది’’ అని విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ పేర్కొన్నారు. రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టామని, పొరుగు దేశాల సహకారం తీసుకుంటున్నామని అన్నారు.
నేపాల్ కు భారత్ ఆపన్నహస్తం..!
వరదల కారణంగా ప్రాణనష్టం సంభవించడంపై భారత ప్రధాని మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నేపాల్ ప్రధాని బాలెన్ షాతో ఫోన్లో మాట్లాడిన ఆయన.. మానవతాసాయం అందించడంతోపాటు రెస్క్యూ ఆపరేషన్‌లో తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆపద కాలంలో నేపాల్‌కు యావత్ భారత ప్రజలు తోడుగా ఉంటారని భరోసా ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
వరదలతో అతలాకుతలమైన నేపాల్‌కు ఆపన్నహస్తం అందించేందుకు భారత్ ఏర్పాట్లు మొదలుపెట్టింది. వాయుసేన విమానాల ద్వారా సహాయక సామగ్రి తరలిస్తోంది. నిత్యావసర సరుకులు, ఔషధాలు పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు.








