కౌశిక్ రెడ్డిపై ఎథిక్స్ అస్త్రం.. వేటు తప్పదా?
తెలంగాణ శాసనసభలో హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరుపై శాసనసభ ఎథిక్స్ కమిటీ విచారణకు రంగం సిద్ధమైంది. ఈ నెల 29న ఎథిక్స్ కమిటీ సమావేశమై కౌశిక్ రెడ్డి అంశంపై సమగ్రంగా చర్చించనుంది. ఈ మేరకు కమిటీలోని సభ్యులైన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటేరియట్ నుంచి అధికారిక లేఖలు కూడా చేరాయి. గత శాసనసభ సమావేశాల్లో చోటుచేసుకున్న తీవ్ర గందరగోళం, నాటకీయ పరిణామాల నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ వివాదాన్ని ఎథిక్స్ కమిటీకి నివేదిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా సభలో ధరణి అక్రమాలు, భూవ్యవహారాలపై చర్చ జరుగుతున్న సమయంలో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రసంగించారు. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ వైపు వెళ్లిన కడియం శ్రీహరి పార్టీ మారడాన్ని ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఆ సమయంలో కౌశిక్ రెడ్డి సభామర్యాదలకు విరుద్ధంగా కడియం శ్రీహరిని ఉద్దేశించి తీవ్రమైన హావభావాలు, గన్‌తో కాలుస్తానన్నట్లుగా చేతితో బెదిరింపు సంజ్ఞలు చేశారని అధికార కాంగ్రెస్ పక్షం ఆరోపించింది.
ఒక సీనియర్ దళిత ప్రజాప్రతినిధిపై బెదిరింపు ధోరణిలో ప్రవర్తించారని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. సభలో కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరుపై వీడియో ఫుటేజీలను పరిశీలించాలని, ఆయన వ్యవహారశైలిపై సుమోటోగా విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఆమోదం తెలపడంతో, స్పీకర్ ఈ అంశాన్ని ఎథిక్స్ కమిటీ పరిశీలనకు పంపించారు.
కొంతకాలంగా కౌశిక్ రెడ్డి తీరు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి గాజులు, చీరల పంపిణీ వ్యాఖ్యలు చేయడం, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఇంటి వద్ద హైడ్రామా వంటి ఘటనలు తీవ్ర దుమారం రేపాయి. అసెంబ్లీ లోపల కూడా అధికార పక్షంపై దూకుడుగా వ్యవహరించడం, పార్టీ ఫిరాయింపులపై ప్రత్యక్షంగా ఘర్షణాత్మక వైఖరి కనబరచడం కౌశిక్ రెడ్డిపై విమర్శలకు తావిచ్చింది.
ఈ పరిణామంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా స్పందిస్తోంది. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాలను, మంత్రులపై వస్తున్న అవినీతి, అక్రమ మైనింగ్ ఆరోపణలను కప్పిపుచ్చుకునేందుకే ‘డైవర్షన్ పాలిటిక్స్’ చేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో నిలదీయడం సభ్యుడి హక్కని, అందులో తప్పేముందని గులాబీ శ్రేణులు సమర్థిస్తున్నాయి. ప్రతిపక్షం గొంతు నొక్కేందుకు, ప్రజా సమస్యలపై సభా సంఘం వేయాలన్న తమ డిమాండ్ల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఎథిక్స్ కమిటీ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారని బీఆర్ఎస్ విమర్శిస్తోంది.
ఈ ఎథిక్స్ కమిటీ సమావేశం కేవలం ఒక క్రమశిక్షణ చర్యగా మాత్రమే కాకుండా, కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య రాజకీయ యుద్ధ వేదికగా మారనుంది. కడియం శ్రీహరి అంశాన్ని తెరపైకి తెచ్చి బీఆర్ఎస్ దళిత వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తోందని ప్రచారం చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని కాంగ్రెస్ వ్యూహం రచిస్తోంది. అసెంబ్లీలో అత్యంత దూకుడుగా ఉండే కౌశిక్ రెడ్డి వంటి యువ నేతలపై ఎథిక్స్ కమిటీ ద్వారా చర్యలు తీసుకుంటే, సభలో ప్రతిపక్ష దూకుడుకు కళ్లెం వేయవచ్చని అధికార పక్షం భావిస్తోంది. ఎమ్మెల్యేల అనర్హత అంశం కోర్టులు, స్పీకర్ పరిధిలో ఉన్న సమయంలో ఈ కమిటీ విచారణ పార్టీ ఫిరాయింపుల వివాదాన్ని మరోసారి కేంద్ర బిందువుగా మార్చనుంది.
ఈ నెల 29న జరిగే ఎథిక్స్ కమిటీ భేటీలో కమిటీ ఎలాంటి సిఫార్సులు చేయనుంది, కౌశిక్ రెడ్డికి నోటీసులు ఇచ్చి వివరణ కోరుతుందా లేక నేరుగా చర్యలకు సిఫార్సు చేస్తుందా అనేది తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.








