మీ పాన్ కార్డుతో ఎవరైనా బ్యాంక్ అకౌంట్ తెరిచారా? ఇలా తెలుసుకోండి.. దుర్వినియోగం జరిగితే ఏం చేయాలి?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
మీరు ఎప్పుడూ వెళ్లని బ్యాంకు నుంచి మీ పేరుతో ఓ లెటర్ వచ్చింది. అందులో మీకు తెలియని బ్యాంక్ అకౌంట్ వివరాలు ఉన్నాయి. లేదా మీరు ఎప్పుడూ తీసుకోని లోన్ గురించి సమాచారం వచ్చింది. “ఇదేంటి?” అని మీరు ఆశ్చర్యపోతారు.
కానీ విషయం అక్కడితో ఆగకపోవచ్చు. ఆ అకౌంట్లో జరిగిన లావాదేవీలు, ఆర్థిక వ్యవహారాలు మీ పాన్ నంబర్‌తో అనుసంధానమై ఉంటే.. అసలు ఆ లావాదేవీలతో మీకు సంబంధమే లేకపోయినా, ముందుగా వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి మీకు రావచ్చు.
ఇప్పుడు అసలు ప్రశ్న.. మీ పాన్ కార్డును ఉపయోగించి ఎవరైనా మీకు తెలియకుండా బ్యాంక్ అకౌంట్ తెరిచారా? మీ పేరుతో ఏదైనా లోన్ తీసుకున్నారా? మీ పాన్‌ను ఎక్కడెక్కడ ఉపయోగించారో మీకు తెలుసా? ఈ విషయాన్ని తెలుసుకోవడానికి కొన్ని ముఖ్యమైన రికార్డులను మీరే చెక్ చేసుకోవచ్చు.
పాన్ నంబర్ ఎందుకంత కీలకం?
పర్మనెంట్ అకౌంట్ నంబర్.. అంటే పాన్. ఇది కేవలం పన్నులు చెల్లించడానికి ఉపయోగించే నంబర్ కాదు. బ్యాంకింగ్, పెట్టుబడులు, పెద్ద మొత్తంలో జరిగే ఆర్థిక లావాదేవీలు, ఆదాయపు పన్ను వ్యవహారాలు వంటి అనేక సందర్భాల్లో పాన్ అవసరం అవుతుంది.
అందుకే మీ పాన్ వివరాలు తప్పు వ్యక్తి చేతికి వెళితే సమస్య మొదలవుతుంది. ముఖ్యంగా పాన్‌తో పాటు మీ ఇతర వ్యక్తిగత వివరాలు కూడా దుర్వినియోగం అయితే, మీకు తెలియకుండానే ఆర్థిక కార్యకలాపాలు జరిగే అవకాశం ఉంటుంది.
అందుకే “నా పాన్ కార్డు నా దగ్గరే ఉంది కదా.. నాకు ఏం ప్రమాదం?” అని నిర్లక్ష్యం చేయకండి. పాన్ కార్డు మీ దగ్గర ఉండటం ఒక్కటే సరిపోదు. మీ పాన్ ఎక్కడెక్కడ ఉపయోగించబడిందో కూడా తెలుసుకోవాలి.
మీ పాన్‌తో అకౌంట్ తెరిచారా? ఇలా చెక్ చేయండి
మొదట మీ క్రెడిట్ రిపోర్ట్‌ను పరిశీలించండి. క్రెడిట్ బ్యూరోల రిపోర్టుల్లో మీ పేరుతో ఉన్న రుణాలు, క్రెడిట్ కార్డులు, ఇతర క్రెడిట్ సంబంధిత ఖాతాల వివరాలు కనిపిస్తాయి. మీరు ఎప్పుడూ తీసుకోని లోన్ లేదా క్రెడిట్ కార్డు కనిపిస్తే, అది మీ పాన్ లేదా ఇతర వ్యక్తిగత వివరాల దుర్వినియోగానికి సంకేతం కావచ్చు.
అలాగే ఆదాయపు పన్ను శాఖకు సంబంధించిన మీ రికార్డులను కూడా పరిశీలించాలి. ముఖ్యంగా ఫారం 26AS, వార్షిక సమాచార నివేదిక (AIS)లో మీ పాన్‌తో అనుసంధానమైన ఆదాయం, ఆర్థిక లావాదేవీల వివరాలు కనిపిస్తాయి. మీకు సంబంధం లేని ఆదాయం, లావాదేవీ లేదా ఆర్థిక సమాచారం కనిపిస్తే దాన్ని నిర్లక్ష్యం చేయకండి.
ఈ సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త
మీకు తెలియని ఆదాయం గురించి ఆదాయపు పన్ను శాఖ నుంచి సమాచారం రావడం, మీరు చేయని లావాదేవీలకు సంబంధించిన వివరాలు కనిపించడం, మీకు తెలియని బ్యాంకు ఖాతా లేదా ఆర్థిక వ్యవహారాల గురించి లేఖలు లేదా సందేశాలు రావడం వంటి విషయాలు పాన్ దుర్వినియోగానికి సంకేతాలు కావచ్చు.
అలాంటి సమయంలో అది నిజంగా మీకు సంబంధం లేని లావాదేవీయేనా, లేక రికార్డుల్లో ఏదైనా పొరపాటు జరిగిందా అనేది ముందుగా నిర్ధారించుకోవాలి.
దుర్వినియోగం జరిగినట్లు తేలితే ఏం చేయాలి?
మీ పాన్‌ను ఉపయోగించి మీకు తెలియని బ్యాంకు ఖాతా లేదా ఆర్థిక లావాదేవీ జరిగినట్లు గుర్తిస్తే, సంబంధిత బ్యాంకును వెంటనే సంప్రదించాలి. ఆ ఖాతా మీది కాదని స్పష్టంగా తెలియజేసి, దానికి సంబంధించిన వివరాలను కోరాలి.
అదే సమయంలో ఆదాయపు పన్ను శాఖకు కూడా సమాచారం ఇవ్వాలి, ముఖ్యంగా ఆ లావాదేవీ మీ పాన్ రికార్డులో కనిపిస్తే. అవసరమైతే సంబంధిత అధికారిక ఫిర్యాదు వ్యవస్థల్లో ఫిర్యాదు చేయాలి. మీ దగ్గర ఉన్న పాన్ కాపీ, బ్యాంకు సందేశాలు, లావాదేవీల వివరాలు, పన్ను రికార్డులు వంటి ఆధారాలను భద్రంగా ఉంచుకోవడం చాలా ఉపయోగపడుతుంది.
పాన్‌ను ఎలా సురక్షితంగా ఉంచుకోవాలి?
అవసరం లేని చోట పాన్ వివరాలను ఇవ్వకండి. పాన్ కాపీని ఎవరికి పడితే వారికి పంపకుండా, అవసరమైనప్పుడు మాత్రమే విశ్వసనీయ సంస్థలకు ఇవ్వడం మంచిది. గుర్తుతెలియని వెబ్సైట్లలో పాన్ కార్డు కాపీని అప్లోడ్ చేయకండి.
అంతేకాదు, అప్పుడప్పుడు మీ క్రెడిట్ రిపోర్ట్, ఆదాయపు పన్ను రికార్డులు, బ్యాంకు లావాదేవీలను పరిశీలిస్తూ ఉండండి. మీ పేరుతో ఏదైనా అనుమానాస్పద ఆర్థిక కార్యకలాపం జరిగితే ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా నష్టం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.








