భట్టితో భేటీ తర్వాత కొండా మురళి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న అంతర్గత విభేదాలు, పరిణామాలు అధికార పక్షంలో తీవ్ర అలజడి సృష్టిస్తున్నాయి. వివాదాలకు కేంద్రబిందువుగా మారిన మంత్రి కొండా సురేఖ వ్యవహారం సద్దుమణుగుతుందని భావిస్తున్న తరుణంలో, ఆమె భర్త, సీనియర్ కాంగ్రెస్ నేత కొండా మురళి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త ప్రకంపనలు రేపుతున్నాయి. ప్రజాభవన్‌లో జరిగిన కీలక నేతల మంతనాల తర్వాత కూడా ఈ వ్యవహారం మరింత జటిలంగా మారిందే తప్ప, పరిష్కార దిశగా అడుగులు పడలేదన్న విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి.
హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలతో కొండా మురళి సుదీర్ఘంగా సమావేశమయ్యారు. పార్టీలో తలెత్తిన తాజా సంక్షోభం, మంత్రి సురేఖ చుట్టూ ముసురుకున్న వివాదాలను చల్లార్చేందుకే ఈ పంచాయితీ జరిగినట్లు అందరూ భావించారు. అయితే, భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కొండా మురళి వైఖరి రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.
తాజా భేటీలో కొండా సురేఖ అంశంపై గానీ, రాజకీయ పరిణామాలపై గానీ ఎలాంటి చర్చ జరగలేదని కొండా మురళి కొట్టిపారేశారు. తాము కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూనే.. అధిష్టానం అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల నాయకత్వంపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందని ప్రకటించారు. అయితే అసలు ట్విస్ట్ వారి కుమార్తె సుస్మిత పటేల్ చేసిన సంచలన వ్యాఖ్యల ప్రస్తావన వచ్చినప్పుడే ఎదురైంది.
కుమార్తె సుస్మిత చేసిన కామెంట్లతో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పిన మురళి, ఆమె ‘ప్లాన్-ఎ’ ప్రకారం ఆ వ్యాఖ్యలు చేసిందని, ఇక ఆమె ‘ప్లాన్-బి’ ఏమిటో తమకు తెలియదంటూ చేసిన కామెంట్ పార్టీ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది. ఒకవైపు కుమార్తె వ్యాఖ్యల నుంచి వ్యూహాత్మకంగా తప్పుకుంటూనే, మరోవైపు హైకమాండ్‌కు పరోక్షంగా ఒక బలమైన పొలిటికల్ హెచ్చరిక పంపారనే వాదనలు వినిపిస్తున్నాయి. ‘ప్లాన్-బి’ అనే పదాన్ని తెరపైకి తీసుకురావడం ద్వారా, పరిణామాలు తమకు ప్రతికూలంగా మారితే భవిష్యత్ కార్యాచరణ వేరేలా ఉంటుందనే సంకేతాలు ఇచ్చారనే చర్చ రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది.
మంత్రి కొండా సురేఖ మంగళవారం వనమహోత్సవంలో పాల్గొన్నారని, ఆ మరుసటి రోజు కూడా అధికారిక కార్యక్రమాలకు హాజరయ్యారని గుర్తుచేసిన మురళి.. ప్రస్తుతం తమపై వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదులపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం వెలువడేంత వరకు ఏమీ మాట్లాడబోనని స్పష్టం చేశారు. బాధ్యతను క్రమశిక్షణ కమిటీ కోర్టులోకి నెట్టడం ద్వారా పార్టీ నిర్ణయంపై ఒత్తిడి పెంచే ఎత్తుగడను కొండా దంపతులు ప్రదర్శిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
ప్రజాభవన్ భేటీతో కొండా ఎపిసోడ్‌కు తెరపడుతుందని ఆశించిన కాంగ్రెస్ నాయకత్వానికి ఈ పరిణామాలు కొత్త తలనొప్పిగా మారాయి. వివాదాన్ని ఉపశమింపజేసేలా కాకుండా, ‘ప్లాన్-ఎ, ప్లాన్-బి’ అంటూ కొండా మురళి చేసిన వ్యాఖ్యలు పార్టీలో అంతర్గత పోరు ఇప్పట్లో ముగిసేలా లేదని స్పష్టం చేస్తున్నాయి. క్రమశిక్షణ కమిటీ ఇచ్చే నివేదిక, ఆ తర్వాత అధిష్టానం తీసుకోబోయే చర్యల ఆధారంగానే కొండా కుటుంబం తదుపరి అడుగులు ఆధారపడి ఉన్నాయని, అప్పటివరకూ ఈ రాజకీయ ఉత్కంఠ కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.








