కొండా సురేఖ, చిన్నారెడ్డిలపై వేటు ఖాయం?
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ, పార్టీ వర్గాల్లోనూ తీవ్ర దుమారం రేపిన అంతర్గత విభేదాలు, వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి, ప్రభుత్వ ప్రతిష్టను ఇరకాటంలో పడేసిన మంత్రి కొండా సురేఖ, ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డిలపై వేటు వేసేందుకు అధిష్టానం రంగం సిద్ధం చేసినట్లు స్పష్టమవుతోంది. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా వీరిద్దరినీ తమ పదవుల నుంచి తప్పుకోవాల్సిందిగా ఆదేశించే అవకాశం ఉందని, ఒకవేళ వారు స్వచ్ఛందంగా రాజీనామా చేయకపోతే నేరుగా బర్తరఫ్ చేసే దిశగా హైకమాండ్ ఆలోచిస్తున్నట్లు పార్టీ అత్యున్నత వర్గాల సమాచారం.
ఈ వివాదాలపై లోతుగా అంతర్గత విచారణ జరిపిన టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ తన నివేదికను సిద్ధం చేసింది. ఎంపీ మల్లు రవి అధ్యక్షతన, సీనియర్ నేత శ్యామ్ మోహన్ సభ్యుడిగా ఉన్న ఈ క్రమశిక్షణా కమిటీ.. ఇరు నేతలకు జారీ చేసిన షోకాజ్ నోటీసులకు వారు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానాలను, ఇతర సమగ్ర ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించింది. అయితే, వీరిద్దరినీ కమిటీ వ్యక్తిగతంగా పిలిపించి విచారించకపోవడం గమనార్హం. అనంతరం క్రమశిక్షణా కమిటీ తన తుది నివేదికను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు సమర్పించింది. ఆ నివేదికను ఆయన ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కు పంపారు. ఆమె ఈ నివేదికను ఏఐసీసీ అధిష్టానం ముందుంచనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లతో సంప్రదింపులు జరిపిన తర్వాతే హైకమాండ్ తుది నిర్ణయం తీసుకోనుంది.
మంత్రి కొండా సురేఖ వ్యవహారశైలిపై క్రమశిక్షణా కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వరుస వివాదాల్లో చిక్కుకుంటూ ఆమె పార్టీ పరువును, ప్రభుత్వ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీశారని కమిటీ భావించింది. నేరారోపణలు ఎదుర్కొంటున్న ఆమె మాజీ ఓఎస్డీ వివాదం మొదలుకుని, సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడిన తీరు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. వీటికి తోడు, ఇటీవల ఆమె కుమార్తె స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన ఆరోపణలను కమిటీ అత్యంత తీవ్రమైన అంశంగా పరిగణించింది. షోకాజ్ నోటీసు ఇచ్చినప్పటికీ సురేఖ ఎక్కడా పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోగా, ధిక్కార స్వరంతోనే వివరణ ఇచ్చారని, తన ప్రవర్తనను మార్చుకునేందుకు సిద్ధంగా లేరని నివేదికలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డిపై చిన్నారెడ్డి చేసిన ఆరోపణలను క్రమశిక్షణా సంఘం తీవ్రంగా పరిగణించింది. మేఘా రెడ్డి డబ్బులు చెల్లించి కాంగ్రెస్ టికెట్ తెచ్చుకున్నారని చిన్నారెడ్డి బహిరంగంగా ఆరోపించడం పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. అభ్యర్థుల ఎంపిక బాధ్యత వహించే ఏఐసీసీ నిర్ణయాధికారాన్నే నేరుగా ప్రశ్నించేలా, పార్టీని అవమానించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని కమిటీ తేల్చింది. చిన్నారెడ్డి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎంతో గౌరవం ఉన్నప్పటికీ, ఆయనపై చర్యలు తీసుకోవడం రాజకీయంగా సున్నితమైన అంశంగా మారినప్పటికీ.. క్రమశిక్షణ విషయంలో రాజీ పడకూడదనే సంకేతాన్ని పంపాలని పార్టీ భావిస్తోంది.
మొత్తంగా చూస్తే.. ప్రభుత్వ పాలన, పార్టీ పరువు ముఖ్యం అనే స్పష్టమైన సందేశం ఇవ్వడానికి ఇద్దరు కీలక నేతలపై వేటు వేసేందుకే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు రాజకీయ విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి.








