గోదావరి పుష్కరాలకు కౌంట్‌డౌన్.. కోట్లాది భక్తుల కోసం భారీ ఏర్పాట్లు..
గోదావరి నది అంటేనే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ప్రకృతి అందాలు, ఆధ్యాత్మికత, సంస్కృతి గుర్తుకొస్తాయి. మహారాష్ట్రలో (Maharashtra) పుట్టి తెలంగాణ (Telangana) మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించే గోదావరి.. రాజమహేంద్రవరం (Rajamahendravaram) వద్ద మరింత విశాలంగా దర్శనమిస్తుంది. నదీ తీర ప్రాంతాల అందాలతో పాటు ఎన్నో పుణ్యక్షేత్రాలకు గోదావరి పరివాహక ప్రాంతం నిలయంగా ఉంది. అందుకే గోదావరి పుష్కరాలకు దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది.
పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే గోదావరి పుష్కరాల కోసం ఇప్పుటి నుంచే ఏర్పాట్లు మొదలయ్యాయి. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు పుష్కరాలు జరగనున్నాయి. ఈసారి గతంతో పోలిస్తే మరింత ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 2015లో జరిగిన గోదావరి మహా పుష్కరాలకు ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 4.86 కోట్ల మంది హాజరైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2027లో ఈ సంఖ్య 8 నుంచి 10 కోట్లకు చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఘాట్ల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. మొత్తం 440 ఘాట్లను సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఉన్న 259 ఘాట్లను మెరుగుపరచడంతో పాటు మరో 181 కొత్త ఘాట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. పుష్కరాల కోసం మొత్తం రూ.4,026 కోట్ల అంచనా వ్యయంతో 4,932 పనులు చేపడుతున్నట్లు అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)కి వివరించారు.
తూర్పుగోదావరి జిల్లాలో (East Godavari) 82, పశ్చిమగోదావరిలో (West Godavari) 40, కోనసీమలో (Konaseema) 175, ఏలూరులో (Eluru) 44, కాకినాడలో (Kakinada) 88, పోలవరంలో (Polavaram) 11 ఘాట్లను అభివృద్ధి చేయనున్నారు. పుష్కర సమయంలో భారీగా భక్తులు ఒకేసారి నదీ తీరానికి చేరుకునే అవకాశం ఉండటంతో రద్దీ నియంత్రణ, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య సేవలు, రవాణా వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టనుంది.
గోదావరి పుష్కరాలను కేవలం పుణ్యస్నానాల కార్యక్రమంగా కాకుండా ఆధ్యాత్మిక పర్యాటకానికి పెద్ద అవకాశంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రముఖ ఆలయాలను కలుపుతూ ప్రత్యేక టెంపుల్ టూరిజం సర్క్యూట్‌ను అభివృద్ధి చేయాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. పిఠాపురం (Pithapuram), అన్నవరం (Annavaram), ద్వారకా తిరుమల (Dwaraka Tirumala), వాడపల్లి (Vadapalli), అంతర్వేది (Antarvedi) వంటి పుణ్యక్షేత్రాలను ఈ పర్యాటక ప్రణాళికలో భాగం చేయాలని చూస్తున్నారు. పంచారామ క్షేత్రాల్లోని ముఖ్య ఆలయాలను కూడా ఈ సర్క్యూట్‌తో అనుసంధానించే ఆలోచన ఉంది.
దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు వసతి కల్పించేందుకు హోమ్‌స్టేలను ప్రోత్సహించడంతో పాటు కొత్త హోటళ్లకు త్వరగా అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. రహదారులు, రవాణా, వసతి, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా పుష్కర యాత్రికులకు సౌకర్యవంతమైన అనుభూతి కల్పించాలన్నది లక్ష్యంగా కనిపిస్తోంది.
మొత్తంగా 2027 గోదావరి పుష్కరాలు భక్తి, పర్యాటకం, సంస్కృతి కలయికగా నిలిచేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. కోట్లాది మంది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో సమన్వయంతో ముందస్తు ప్రణాళికలు అమలు చేస్తే ఈ మహా వేడుకను విజయవంతంగా నిర్వహించే అవకాశం ఉంది.








