రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
సుజ్లాన్ రాకతో ఏపీ రెన్యువబుల్ ఎనర్జీ పెరిగింది
పవన విద్యుత్ రంగంలో సుజ్లాన్‌కు ప్రపంచ ఖ్యాతి
175 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యమే లక్ష్యం
ఏపీ వ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీలో 22 క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నాం
ఏపీ-సుజ్లాన్ భాగస్వామ్యంతో 12వేల మంది యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ
అనంతపురం అంటే కియా కార్లు, ఫైటర్ జెట్లు, సుజ్లాన్ రెన్యువబుల్ ఎనర్జీ
రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి లోకేష్
రాయదుర్గం: పునరుత్పాదక ఇంధన రంగంలో ఏపీని నంబర్ వన్‌గా నిలబెట్టడమే మన లక్ష్యమని, సుజ్లాన్ పవన విద్యుత్ ప్రాజెక్ట్ ఏపీ నూతన అధ్యాయానికి నాంది అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కణేకల్లు మండలం హులికెర వద్ద సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు శంకుస్థాపన అనంతరం నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ.. ఈ రోజు అనంతపురం జిల్లాలో మీ అందరి మధ్య ఉండటం ఎంతో ఆనందంగా ఉంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నూతన అధ్యాయానికి నాంది. ఈ రోజు సుజ్లాన్, ఏపీ మధ్య రెండు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న బంధాన్ని పునరుద్ధరించుకునే సందర్భం కూడా. సుజ్లాన్ తొలినాళ్లలోనే ఏపీకి వచ్చి, తయారీ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసి, బలమైన విండ్ ఎనర్జీ ఎకో సిస్టమ్ నిర్మించింది. సుజ్లాన్ గురించి మాట్లాడేటప్పుడు దివంగత తులసి తంతి గారిని మనం స్మరించుకోవాలి. స్వచ్ఛ ఇంధనం ప్రపంచ ప్రాధాన్యతగా మారకముందే ఆయన పునరుత్పాదక ఇంధనంపై నమ్మకం ఉంచారు. ఆయన ఆలోచన చాలా సింపుల్. భారతదేశ ఆర్థిక స్వావలంబనకు ఇంధన స్వావలంబన అత్యంత అవసరం. ఆ దార్శనికతకు అనంతపురంలోనే బలమైన పునాది పడింది.
అనంతలో 1,260 మెగావాట్ల సామర్థ్యం సుజ్లాన్ సొంతం
2019-24 మధ్య రాష్ట్రంలో పవన విద్యుత్ అభివృద్ధి దాదాపుగా నిలిచిపోయింది. కేవలం 6 మెగావాట్ల పవన విద్యుత్ సామర్థ్యం మాత్రమే అదనంగా చేరింది. నేడు అనంతపురంలోని సుజ్లాన్ యూనిట్‌కు ఏడాదికి సుమారు 1,260 మెగావాట్ల తయారీ సామర్థ్యం ఉంది. ప్రత్యక్షంగా సుమారు 1,200 మందికి ఉపాధి కల్పిస్తోంది. వారిలో 70 శాతానికి పైగా స్థానికులే. ఏపీ వ్యాప్తంగా సుజ్లాన్ ఇప్పటికే 2 వేలకు పైగా గ్రీన్ ఉద్యోగాలను సృష్టించింది. పారిశ్రామికీకరణ అంటే ఇలాగే ఉండాలి. ఒక జిల్లాకు పెట్టుబడులు రావాలి. ఆ జిల్లాలో తయారీ రంగం అభివృద్ధి చెందాలి. ఆ జిల్లాలో నైపుణ్యాలు పెరగాలి. యువతకు వారి సొంత జిల్లాలోనే ఉద్యోగాలు లభించాలి.
విండ్ ఎనర్జీ రంగంలో మన దేశం సత్తా చాటింది సుజ్లాన్
భారతదేశ పవన విద్యుత్ రంగాన్ని ప్రపంచ పటంలో నిలిపిన సంస్థల్లో సుజ్లాన్ ఒకటి. పట్టుదల, పునరుద్ధరణ సామర్థ్యంతో సుజ్లాన్ సంస్థ అత్యున్నత విజయాలను చూసింది. అత్యంత క్లిష్టమైన పరిస్థితులను కూడా ఎదుర్కొంది. అయినప్పటికీ సుజ్లాన్ ఎప్పుడూ కనుమరుగుకాలేదు. ఎందుకంటే నిబద్ధతతో కూడిన ఈ సంస్కృతిని తులసి తంతి గారు ఏర్పరచగా, ప్రస్తుత నాయకత్వం దానిని ముందుకు తీసుకెళ్లింది.
రూ.10వేల కోట్ల పెట్టుబడి, 4వేలకు పైగా ఉద్యోగాల కల్పన
ఈ రోజు మనం ముందుకు తీసుకెళ్తున్న ప్రాజెక్టులు మొత్తం 1,325 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం. సుమారు రూ.10వేల కోట్ల పెట్టుబడి, 4 వేలకు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను తీసుకురానున్నాయి. మనం నిర్మించే ప్రతి మెగావాట్ చివరికి మన యువతకు అవకాశంగా మారాలి. ఏపీలో సుజ్లాన్‌కు ఇప్పటికే సుమారు 1,600 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉంది. మరో 2,700 మెగావాట్లు అభివృద్ధి, నిర్మాణ దశలో ఉన్నాయి. అనంతపురం ప్రాంతంలో సుమారు 1,300 మెగావాట్ల కొత్త పవన విద్యుత్ ప్రాజెక్టులు అభివృద్ధి దశలో ఉన్నాయి.
సౌర, పవన విద్యుత్, నిల్వ సాంకేతికతలు కలిసి పనిచేయాలి
ఆంధ్రప్రదేశ్‌కు పవన విద్యుత్ భవిష్యత్ ఇంధన మిశ్రమంలో కీలక భాగం. భారతదేశంలో సూర్యరశ్మి సమృద్ధిగా ఉంది. పగటి సమయంలో సౌర విద్యుత్ కీలక పాత్ర పోషిస్తుంది. కానీ ప్రతి సాయంత్రం సూర్యుడు అస్తమిస్తాడు. మన ఆర్థిక వ్యవస్థ మాత్రం ఆగదు. సాయంత్రం 6 గంటలకైనా మన ఇళ్లకు విద్యుత్ అవసరం ఉంటుంది. మన పరిశ్రమలు పనిచేస్తూనే ఉంటాయి. మన ఆసుపత్రులు పనిచేస్తూనే ఉంటాయి. మన డేటా సెంటర్లు ప్రతి క్షణం సమాచారాన్ని ప్రాసెస్ చేస్తూనే ఉంటాయి. అందుకే సౌర, పవన విద్యుత్, నిల్వ సాంకేతికతలు కలిసి పనిచేయాలి. ఆంధ్రప్రదేశ్ దేశంలోని అతిపెద్ద డేటా సెంటర్ పర్యావరణ వ్యవస్థల్లో ఒకదాన్ని నిర్మిస్తున్నందున ఇది మరింత కీలకంగా మారుతోంది. మేం 6.5 గిగావాట్ల డేటా సెంటర్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఈ డిజిటల్ మౌలిక వసతులకు అవసరమైన విద్యుత్‌ను అందించేందుకు సుమారు 25 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన అవకాశాన్ని సృష్టించవచ్చు.
175 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం లక్ష్యం
మా విజన్ కేవలం విద్యుత్‌తో ఆగిపోదు. క్లీన్ ఎనర్జీని గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియాగా మార్చాలని మేం కోరుకుంటున్నాం. గ్రీన్ డేటా సెంటర్ల ద్వారా AI ఆర్థిక వ్యవస్థకు విద్యుత్ అందించాలని కోరుకుంటున్నాం. చివరికి క్లీన్ ఎనర్జీకి సౌది అరేబియాగా ఏపీని తీర్చిదిద్దాలన్నదే మా అంతిమ లక్ష్యం. వివిధ రూపాల్లో స్వచ్ఛ ఇంధనాన్ని ప్రపంచానికి ఎగుమతి చేయగల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దాలి. మనకు పునరుత్పాదక ఇంధన సామర్థ్యం ఉంది. సుదీర్ఘ సముద్ర తీరం ఉంది. ఓడరేవులు ఉన్నాయి. ఇండస్ట్రియల్ ల్యాండ్ ఉంది. మెరుగైన కనెక్టివిటీ ఉంది. నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఉన్నాయి. ఈ ప్రయోజనాలన్నింటినీ ఒకచోటకు తీసుకురావడానికి అవసరమైన పాలసీ ఎన్విరాన్ మెంట్ ను మేం సృష్టిస్తున్నాం. రాష్ట్ర స్థాయిలో 175 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ లక్ష్యాన్ని సాధించడంలో సుజ్లాన్ వంటి సంస్థలు కీలక పాత్ర పోషించనున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా 22 క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నాం
పూర్తిస్థాయి ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్ నిర్మాణంలో భాగంగా ఎనర్జీ, డేటా సెంటర్లు, ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్, ఆటోమొబైల్, కెమికల్స్, ఫిషరీస్, ఆక్వాకల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్ వంటి అధిక వృద్ధి రంగాల్లో 22 పారిశ్రామిక క్లస్టర్ల ఏర్పాటు దిశగా ముందుకు వెళ్తున్నాం. క్లస్టర్లు ఎందుకంటే.. కంపెనీలు ఒంటరిగా పెట్టుబడులు పెట్టవు. అవి ఎకోసిస్టమ్ లో పెట్టుబడులు పెడతాయి. అందుకే మా విధానం చాలా సులభం. కేవలం ఒక కంపెనీని తీసుకురావడం కాదు.. ఆ కంపెనీ చుట్టూ పూర్తి ఎకోసిస్టమ్ ను నిర్మించాలి. ఒక కంపెనీ సప్లయర్స్ ను తీసుకొస్తుంది. సప్లయర్స్ మరిన్ని కంపెనీలను తీసుకొస్తారు. కంపెనీలు ఉద్యోగాలను సృష్టిస్తాయి. ఉద్యోగాలు స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. దీంతో పెద్దఎత్తున పెట్టుబడులు తరలివస్తాయి.
ఏపీ-సుజ్లాన్ భాగస్వామ్యంతో 12వేల మంది యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ
ఈ భాగస్వామ్యంలో గర్వంగా అనిపించే మరో అంశం నైపుణ్యాభివృద్ధి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సుజ్లాన్ కలిసి 12వేల మంది యువతకు, అందులో 25 శాతం మహిళలకు ప్రాతినిధ్యం ఉండేలా గ్రీన్ ఎనర్జీ ఉద్యోగాల కోసం శిక్షణ అందిస్తున్నాయి. ఉరవకొండ, విజయవాడలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పునరుత్పాదక ఇంధన రంగానికి అవసరమైన ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులను సిద్ధం చేస్తున్నాయి. రేపటి కంపెనీలు నైపుణ్యం ఉన్న ప్రాంతాలకే వస్తాయి. ఆ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్ యువత సిద్ధంగా ఉండేలా చూడటం మన బాధ్యత. భారతదేశ స్వచ్ఛ ఇంధన భవిష్యత్తు కోసం శిక్షణ పొందుతున్న యువ ఇంజనీర్లు, సాంకేతిక నిపుణుల ద్వారా స్వర్గీయ తులసి తంతి గారి వారసత్వం మరోసారి కొనసాగుతోంది.
అనంతపురం కొత్త కేరాఫ్ అడ్రస్ ఇదే..
అనంతపురం జిల్లా అంటే కియా కార్లు, ఫైటర్ జెట్లు, సుజ్లాన్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఒకప్పుడు అనంతపురం జిల్లా నుంచి యువత ఉపాధి, ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు, ఇతర జిల్లాలకు వెళ్లేవారు. ఇప్పుడు ఆ రోజులు పోయాయి. ఇతర ప్రాంతాల వాళ్లు ఉద్యోగాలు వెతుక్కుంటూ అనంతపురం జిల్లాకు వచ్చే రోజులు వచ్చాయి. ఇదంతా మన ఏపీ బ్రాండ్, విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి వల్లే సాధ్యమైంది.
20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం
ఒక్క కియా పరిశ్రమ ఎన్ని కుటుంబాల్లో వెలుగు నింపిందో నేను పాదయాత్రలో స్వయంగా చూశాను. అప్పుడే 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి అనే లక్ష్యంగా పెట్టుకున్నాను. ప్రపంచమంతా తిరిగి కంపెనీలను తీసుకువస్తున్నాం. మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా మన రాష్ట్రానికి కంపెనీలను తీసుకురావడానికి సహకరిస్తున్నారు. కంపెనీలను తీసుకురావడం మా బాధ్యత.
ఆ అవకాశాలను అందిపుచ్చుకోవడం యువత బాధ్యత. మీ పని తీరుబట్టే మరిన్ని కంపెనీలు ఏపీకి వస్తాయి. అందుకే నైపుణ్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. పరిశ్రమలతో నేరుగా అనుసంధానం చేసి, యువతకు అవసరమైన నైపుణ్యాలను నేర్పించాలని కోరుతున్నాం.
మన భవిష్యత్ మనమే నిర్మించుకుందాం
ప్రభుత్వం, పరిశ్రమలు, యువత కలిసి పనిచేసినప్పుడు ఎంత అద్బుత ఫలితాలు వస్తాయో మనం చూస్తున్నాం. పరిశ్రమలు పెట్టుబడులు, సాంకేతికతను తీసుకువస్తాయి. మన యువత ప్రతిభను, ఆశయాలను తీసుకువస్తారు. మనమంతా కలిసి అభివృద్ధిని సృష్టిస్తాం. ఏపీపై విశ్వాసం ఉంచిన గిరీష్ తంతి, అజయ్ కపూర్ కు, మొత్తం సుజ్లాన్ బృందానికి ధన్యవాదాలు. ఈ రోజు మనం కేవలం పవన విద్యుత్ ప్రాజెక్టులకు భూమిపూజ చేయడం లేదు. ఇంధనం, తయారీ, సాంకేతికత, ప్రతిభ ఆధారంగా నిర్మించబోయే కొత్త పారిశ్రామిక ఆంధ్రప్రదేశ్‌కు పునాది వేస్తున్నాం. ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రతి పెట్టుబడిదారుడికి, పారిశ్రామికవేత్తలకు ప్రముఖుడికి నా సందేశం ఒక్కటే.. మా స్పీడ్, స్టెబిలిటీ, కమిట్ మెంట్, ఎగ్జిక్యూషన్ ను నమ్మండి. ఎందుకంటే మీరు ఏపీలో విజయవంతమైతే, ఏపీ కూడా మీతో కలిసి విజయవంతమవుతుంది. భవిష్యత్తు కోసం మనం ఎదురుచూడబోం. స్వచ్ఛ ఇంధనం, కొత్త పరిశ్రమలు, కొత్త ఉద్యోగాలు, కొత్త నైపుణ్యాలతో భవిష్యత్తును మనమే నిర్మించబోతున్నాం అని మంత్రి చెప్పారు.








