షాకింగ్: కిరాయి క్రిమినల్స్‌తో ప్రభుత్వమే హత్యలు చేయిస్తోందా?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
“సార్… కొద్దిగా డబ్బులుంటే ఇవ్వండి. చాలా ఇబ్బందుల్లో ఉన్నాను”
అర్జెంటుగా ఎక్కడికో కవరేజ్ కు బయిలుదేరిన ఆ జర్నలిస్ట్ ఆగాడు. ఎదురుగా నిలబడ్డ యువకుడి ముఖం ఇంతకు ముందు చూసింది కాదు. ఎవరో కొత్తవాడు. పాపం..ఏదో ఇబ్బందుల్లో ఉన్నట్లున్నాడు..ఎంతో కొంత ఇద్దామనిపించింది. అతను అంతకు మించి ఆలోచించకుండా జేబులోకి చేయి పెట్టాడు.
అంతలో వెనుక నుంచి ఎవరో అతని భుజాన్ని గట్టిగా పట్టుకున్నారు. అతను ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. ఆ క్షణంలోనే మెరుపులా కత్తి బయటకు వచ్చింది.
ఒక్క పోటు. అతను కేక పెట్టాడు. మరో పోటు. ఈసారి కాలు వణికింది. మూడోసారి కత్తి దిగేసరికి అతను రోడ్డుపై పడిపోయాడు. అంతా కొన్ని సెకన్లలో జరిగిపోయింది. చుట్టూ ఉన్నవాళ్లకు ఏం జరిగిందో అర్థమయ్యేలోపే ఇద్దరు దుండగులు పరుగెత్తడం మొదలుపెట్టారు.
రోడ్డుకు అవతల ఓ కారు ఇంజిన్ ఆన్ చేసి ఎదురుచూస్తోంది. తలుపు తెరుచుకుంది. ఆ ఇద్దరూ లోపలికి దూకారు. కారు వేగంగా దూసుకెళ్లిపోయింది. అక్కడ మిగిలింది రక్తంతో తడిసిన రోడ్డు… ఓ కత్తి… ఆ జర్నలిస్ట్. అతని కాలులోంచి రక్తం ఆగడం లేదు. అక్కడే పనిచేస్తున్న ఓ నిర్మాణ కార్మికుడు పరుగెత్తుకుంటూ వచ్చాడు. తన దగ్గరున్న టూల్ బెల్ట్‌ను తీసి అతని కాలికి గట్టిగా బిగించాడు.
కొంతసేపటికి పోలీసులు వచ్చారు. ఆ తర్వాత అంబులెన్స్. ఆ జర్నలిస్ట్ ని ఆసుపత్రికి తరలించారు. అతను బతికాడు.కానీ అతన్ని పొడిచింది ఎవరు..ఎందుకు పొడిచారు అనే ప్రశ్న కు సమాధానం అంత ఈజీగా దొరకలేదు. పోలీసులకు దొరికిన కొన్ని ఆధారాలు దొరికాయి. వాటిని తవ్వుకుంటూ వెళ్తే ఈ దాడి వెనుక అసలు కథను మరింత భయంకరంగా మార్చాయి.
దుండగుల్లో ఒకరి ఫోన్ పోలీసుల చేతికి చిక్కింది. ఫోన్ పరిశీలించారు. కొన్ని మెసేజ్‌లు. కొన్ని ఫోన్ నంబర్లు. కొన్ని లొకేషన్లు. అందులో ఒక మెసేజ్ దగ్గర పోలీసులు ఆగిపోయారు.అందులో జర్నలిస్ట్ ప్లాట్ నెంబర్, ఎడ్రస్ ఉంది. అంటే ఇది యాదృచ్ఛిక దాడి కాదు. దుండగులకు అతని ఇంటి వివరాలు తెలుసు. అతని కదలికలు తెలుసు. అతను ఎప్పుడు బయటకు వస్తాడో తెలుసు. ఎక్కడికి వెళ్తాడో తెలుసు.
అంటే… ఎవరో అతన్ని ముందే గమనిస్తున్నారు. ఇంకో విషయం బయటపడింది. ఈ దాడి చేసినవాళ్లకు బాధితుడితో ఎలాంటి వ్యక్తిగత సంబంధం లేదు. వాళ్లు అతన్ని ద్వేషించరు. అతనితో ఎలాంటి గొడవ లేదు. అయినా ఎందుకు చంపాలని చూశారు?
సమాధానం ఒక్కటే. డబ్బు. ఎవరో వాళ్లకు డబ్బిచ్చారు. ఒక పని అప్పగించారు. “అతన్ని చంపాలి.” అని పురమాయించారు.
ఇక్కడి వరకు ఇది ఓ రొటీన్ క్రైమ్ స్టోరీ.
తర్వాత బయటపడిన విషయం ఈ కేసును మరో స్థాయికి తీసుకెళ్లింది. ఎందుకంటే ఆ పని పురమాయించింది ఓ గ్యాంగ్ కాదు. ఓ డ్రగ్ మాఫియా కాదు. వ్యక్తిగత శత్రువు కూడా కాదు. ఒక ప్రభుత్వం.
అవును. ఒక విదేశీ ప్రభుత్వం తన విమర్శకుడిని చంపేందుకు కిరాయి నేరగాళ్లను ఉపయోగించిందన్న విషాయాలు బయటకు వచ్చాయి. అది ఏ ప్రభుత్వం? . ఇరాన్. అప్పుడు అసలు ప్రశ్న మొదలైంది.
ఒక ప్రభుత్వం తన శత్రువును చంపడానికి సైనికులను పంపవచ్చు. గూఢచారులను పంపవచ్చు. కానీ కిరాయి నేరగాళ్లను ఎందుకు ఉపయోగించాలి? దానికి సమాధానం ఈజీగానే దొరికింది. వాళ్లు పట్టుబడితే? “వాళ్లతో మాకు సంబంధం లేదు” అని చెప్పొచ్చు. ప్రభుత్వం చేతులు కడుక్కోవచ్చు.
అయితే ఈ కేసులో టార్గెట్ ఎవరు?
అతన్ని ఎందుకు చంపాలని ఇంత పెద్ద ఆపరేషన్? అతను చేసిన నేరం ఏంటి? ఇక్కడే కథలో మరో షాక్. అతను చేసిన “తప్పు” ఒక్కటే. తన దేశ ప్రభుత్వాన్ని బహిరంగంగా విమర్శించడం. ప్రభుత్వం చేస్తున్న అణచివేతను ప్రపంచానికి చెప్పడం. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు మద్దతు ఇవ్వడం. ఇరాన్ పాలకులను ప్రశ్నించడం.
ఇంతకీ ఆ మనిషి ఎవరు?
అతను పూరియా జెరాతీ. ఇరాన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించే ప్రముఖ జర్నలిస్ట్. అతనిపై జరిగిన ఈ దాడి… లండన్‌లో జరిగింది.
ఇది ఒక్క కేసు మాత్రమే కాదు
ఇక్కడితో ఈ కథ ముగియలేదు. ఎందుకంటే జెరాతీపై జరిగిన దాడిని దర్యాప్తు చేస్తున్న కొద్దీ… అదే తరహాలో ఇతర దేశాల్లో జరిగిన మరికొన్ని దాడులు కూడా బయటకు రావడం మొదలైంది. ఇరాన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వ్యక్తులపై అమెరికా, బ్రిటన్, నెదర్లాండ్స్, జర్మనీ, స్వీడన్ వంటి దేశాల్లో జరిగిన అనేక ఘటనలను పరిశీలించినప్పుడు ఇదే తరహా నమూనా కనిపించిందని అధికారులు చెబుతున్నారు.
ఎక్కడో స్థానిక గ్యాంగ్. మరోచోట డబ్బు కోసం పనిచేసే నేరగాళ్లు. ఇంకోచోట సోషల్ మీడియా ద్వారా సంప్రదించిన యువకులు. కొన్ని సందర్భాల్లో టీనేజర్లను కూడా ఇలాంటి పనుల్లోకి లాగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడే ఈ కథ ఒక జర్నలిస్ట్‌పై జరిగిన దాడిని దాటి పెద్దదవుతుంది.
ఎందుకంటే ఇది ఒక కొత్త రకమైన ప్రభుత్వ ఆపరేషన్ గురించి ప్రశ్నలు లేవనెత్తుతోంది.
అప్పుడు ఒక భయంకరమైన ప్రశ్న ముందుకొచ్చింది. ఒక దేశం తన శత్రువులను చంపేందుకు సైనికులను కాదు… క్రిమినల్స్‌ను ఉపయోగించడం మొదలుపెడితే? అప్పుడు యుద్ధం సరిహద్దుల్లో ఉండదు. మీరు నడిచే వీధిలోకి వస్తుంది. ఇది ప్రభుత్వాలు తమ శత్రువులను విదేశాల్లో వేటాడేందుకు మొదలుపెట్టిన కొత్త పద్ధతి కథ.








