ఓటములు ఎదురైనా పట్టుదలతో గెలిచి.. యూఎస్ స్కాలర్‌గా ఎంపికై.. కిలారు అరుణ స్ఫూర్తిదాయక ప్రయాణం!
జీవితంలో మనం అనుకున్న ప్రయాణం ఎప్పుడూ ఒకేలా సాగదు. ఒక దారి మూసుకుపోతే మరో దారిని వెతుక్కుంటూ ధైర్యంగా ముందుకు సాగాలని నిరూపించారు ప్రముఖ శాస్త్రవేత్త కిలారు అరుణ. డాక్టర్ కావాలన్న తన చిన్ననాటి కల నెరవేరకపోయినా, పీహెచ్డీ మధ్యలోనే ఆగిపోయినా, ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందులు ఎదురైనా ఆమె ఎక్కడా నిరుత్సాహపడలేదు. మూడేళ్ల చిన్నారి కూతురితో కలిసి అమెరికా వెళ్లి, అక్కడ కఠిన శ్రమతో డాక్టరేట్ సాధించి నేడు అంతర్జాతీయ స్థాయిలో అగ్రగామి శాస్త్రవేత్తగా ఎదిగారు. తాజాగా ఆమె ప్రతిష్టాత్మక ‘ఫుల్బ్రైట్-నెహ్రూ అకడమిక్ అండ్ ప్రొఫెషనల్ ఎక్సలెన్స్ యూఎస్ స్కాలర్’గా ఎంపికయ్యారు.
బాల్యం నుంచి పరిశోధనల వరకు:
ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరుకు చెందిన అరుణ విద్యాభ్యాసమంతా స్థానిక సెయింట్ థెరిస్సా విద్యాసంస్థల్లోనే సాగింది. పదో తరగతిలో జాతీయ స్థాయి సైన్స్ ఫెయిర్‌లో వచ్చిన బహుమతి ఆమెలో సైన్స్‌పై ఆసక్తిని పెంచింది. వైద్యురాలు కావాలని ఆమె ఎంతగా ప్రయత్నించినా మెడిసిన్ సీటు రాలేదు. దీంతో గుజరాత్‌లోని ఎం.ఎస్. యూనివర్సిటీలో ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ పూర్తి చేశారు.
డాక్టర్ యోగేష్ జస్రాయ్ ఆధ్వర్యంలో ‘మొక్కల పెరుగుదల , పరిసరాల స్పందన’పై పరిశోధన చేసి ప్లాంట్ బయాలజీపై పట్టు సాధించారు. పీజీ తర్వాత టిష్యూ కల్చర్ కంపెనీని ప్రారంభించి రైతులకు నాణ్యమైన అరటి, టేకు మొక్కలను అందించారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని సీసీఎంబీలో పీహెచ్‌డీకి అవకాశం వచ్చినా కొన్ని కారణాల వల్ల పూర్తి కాలేదు.
అమెరికా ప్రయాణం , మిలియన్ డాలర్ల నిధులు:
చిన్నారి కూతురితో అమెరికా వెళ్లిన ఆమె, యూనివర్సిటీ ఆఫ్ లూసియానాలో పీహెచ్డీ పూర్తి చేశారు. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్, మిషిగన్ స్టేట్ యూనివర్సిటీల్లో పోస్ట్‌డాక్టోరల్ ఫెలోగా పనిచేశారు. లిపిడ్ బయోకెమిస్ట్రీ, సిగ్నలింగ్ రంగాలపై దృష్టి సారించి, మొక్కల్లో నూనెలు , సహజ సమ్మేళనాల ఉత్పత్తిని బయోటెక్నాలజీ, సింథటిక్ బయాలజీ ద్వారా ఎలా మెరుగుపరచవచ్చనే అంశంపై విస్తృత పరిశోధనలు చేశారు.
నాచు మొక్కలు, అవకాడో, నూనెగింజ పంటలపై ఆమె చేస్తున్న పరిశోధనలకు నేషనల్ సైన్స్ ఫౌండేషన్, యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ నుంచి మిలియన్ డాలర్ల నిధులు లభించాయి. ప్రస్తుతం ఆమె అమెరికాలోని ఈస్ట్ టెన్నెసీ స్టేట్ యూనివర్సిటీ బయో సైన్సెస్ విభాగంలో డిస్టింగ్విష్డ్ ప్రొఫెసర్‌గా, ఫ్యాకల్టీ ఫెలోగా సేవలనందిస్తున్నారు.
పాలసీ స్థాయిలో సేవలు , మహిళా సాధికారత:
కేవలం ప్రయోగశాలలకే పరిమితం కాకుండా పాలసీ స్థాయిలోనూ ఆమె సేవలు అందించారు. యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్లో ఏఏఏఎస్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ ఫెలోగా, నేషనల్ సైన్స్ ఫౌండేషన్‌లో ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా పనిచేశారు. గత రెండు దశాబ్దాలుగా అమెరికన్ సొసైటీ ఆఫ్ ప్లాంట్ బయాలజిస్ట్స్లో నాయకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తూ, మహిళా శాస్త్రవేత్తలకు , విద్యార్థులకు కెరీర్ పరంగా పూర్తి మద్దతునందిస్తున్నారు.
ఫుల్బ్రైట్ ద్వారా నూతన వారధులు:
తాజాగా ఫుల్బ్రైట్-నెహ్రూ స్కాలర్‌గా ఎంపికైన ఆమె, మొహాలీ సమీపంలోని నేషనల్ అగ్రి-ఫుడ్ అండ్ బయోమాన్యుఫ్యాక్చరింగ్ ఇన్స్టిట్యూట్ (NABI) శాస్త్రవేత్తలతో కలిసి ప్లాంట్ సెల్ బయోమాన్యుఫ్యాక్చరింగ్పై పరిశోధనలు చేయనున్నారు. భారత్-అమెరికా శాస్త్రవేత్తలు, విద్యార్థులు కలిసి పనిచేస్తే భవిష్యత్తులో మరిన్ని గొప్ప అవకాశాలను సృష్టించవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. కొత్త ప్రదేశంలో ఇబ్బందులు ఎదురైనా, సైన్స్ కాన్ఫరెన్స్‌లకు బిడ్డను వెంట తీసుకెళ్తూ కష్టపడి చదివిన ఆమె కూతురు నేడు యూనివర్సిటీ ఆఫ్ షికాగోలో సైకాలజీ పూర్తి చేసి తన కెరీర్లో ముందుకు సాగుతున్నారు. కష్టాలను ఓపికగా ఎదుర్కొని పట్టుదలతో సాధించిన ఈ విజయం ఎందరికో ఆదర్శం.








