బ్రేక్‌ఫాస్ట్ టైమ్కూ.. మీ ఆయుష్షుకూ లింక్ ఉందా? షాకిచ్చే స్టడీ !
“ఆకలేస్తే తిందాంలే… అంత పొద్దుపొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ముందు పనులన్నీ పూర్తి చేసుకుందాం.. మెల్లిగా ఏ 10 గంటలకో, 11 గంటలకో తిందాం. అయినా పొద్దుపొద్దున్నే తినకపోతే ఏమవుతుంది? ఒకేసారి భోజనం చేసేద్దాం. మన తాతలు కూడా ఏ టైమ్‌కు వీలైతే ఆ టైమ్‌లోనే తిన్నారు కదా…”
ఇలాంటి ఆలోచనలు మనలో చాలామందికి ప్రతిరోజూ వస్తూనే ఉంటాయి. బ్రేక్‌ఫాస్ట్ కాస్త ఆలస్యమైతే పెద్దగా పట్టించుకోం. రాత్రి భోజనం కూడా పని మీద పడి ఆలస్యమైతే “ఏం కాదు” అనుకుంటాం.
కానీ మనం పెద్దగా పట్టించుకోని ఈ సమయాలకే మన ఆరోగ్యంతో, ఎక్కువ కాలం బ్రతకటంతో ఏదైనా సంబంధం ఉంటే?
అమెరికాలో 40 ఏళ్లు పైబడిన 31,044 మంది వ్యక్తుల ఆహారపు అలవాట్లను పరిశీలించిన ఓ భారీ అధ్యయనం ఇప్పుడు ఇదే ప్రశ్నను ముందుకు తెచ్చింది. పరిశోధకులు వారు రోజులో మొదటిసారి ఎప్పుడు తిన్నారు, చివరిసారి ఎప్పుడు తిన్నారు అనే వివరాలను.. వారి ఆరోగ్య పరిస్థితులతో పోల్చారు.
ఫలితం ఆసక్తికరంగా ఉంది.
ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య బ్రేక్‌ఫాస్ట్ చేసినవారితో పోలిస్తే, 8 నుంచి 10 గంటల మధ్య మొదటి ఆహారం తీసుకున్నవారిలో అన్ని కారణాలతో మరణించే ప్రమాదం 10 శాతం ఎక్కువగా కనిపించింది.
10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య మొదటిసారి తిన్నవారిలో ఈ తేడా 19 శాతానికి చేరింది. మధ్యాహ్నం 12 తర్వాతే మొదటి ఆహారం తీసుకున్నవారిలో అది 29 శాతం ఎక్కువగా కనిపించింది.
గుండె సంబంధిత మరణాలను మాత్రమే చూసినప్పుడు ఈ సంబంధం మరింత బలంగా కనిపించింది. మధ్యాహ్నం తర్వాతే మొదటిసారి తినే వారిలో.. ఉదయం 7–8 మధ్య తినేవారితో పోలిస్తే cardiovascular mortality risk 46 శాతం ఎక్కువగా ఉంది.
50 ఏళ్ల వయసులో ఉన్నవారికి సంబంధించిన మోడల్ అంచనాల్లో, ఆలస్యంగా మొదటిసారి తినే గ్రూప్‌లో సగటు life expectancy సుమారు 2.46 సంవత్సరాలు తక్కువగా కనిపించింది.
అయితే కథ ఇక్కడితో ఆగలేదు.
పరిశోధకులు రాత్రి చివరి భోజనం ఎప్పుడు చేశారో కూడా చూశారు. ఇక్కడ ఫలితం కొంచెం భిన్నంగా ఉంది.
రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య డిన్నర్ ముగించినవారిలో ప్రమాదం తక్కువగా కనిపించింది. రాత్రి 7 గంటలకంటే ముందే చివరి భోజనం ముగించినవారిలో మొత్తం మరణాల ప్రమాదం 13 శాతం ఎక్కువగా ఉండగా, అర్ధరాత్రి తర్వాత తినేవారిలో 27 శాతం ఎక్కువగా కనిపించింది.
అయితే దీని అర్థం “ప్రతి ఒక్కరూ రాత్రి 8 గంటలకే డిన్నర్ చేయాలి” అని కాదు.
ఇక్కడే ఈ అధ్యయనాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చాలా త్వరగా తినడం, చాలా ఆలస్యంగా తినడం వెనుక ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. ఉదాహరణకు ముందుగానే డిన్నర్ ముగించే వ్యక్తులు వయసులో పెద్దవారై ఉండొచ్చు, తక్కువగా తినేవారై ఉండొచ్చు లేదా ఇప్పటికే కొన్ని ఆరోగ్య సమస్యలు కలిగి ఉండొచ్చు.
అంటే ఆరోగ్య సమస్యల వల్లే వారి ఆహార సమయం మారి ఉండొచ్చు. దీనినే reverse causation అంటారు. అందుకే ఈ అధ్యయనం “ఆలస్యంగా బ్రేక్‌ఫాస్ట్ చేస్తే తప్పకుండా ఆయుష్షు తగ్గుతుంది” అని చెప్పడం లేదు. ఇది కేవలం రెండు అంశాల మధ్య ఒక సంబంధాన్ని గుర్తించింది.
అయితే దానికి శాస్త్రీయంగా ఓ కారణం ఉండే అవకాశం ఉంది.
మన శరీరంలో biological clock ఉంటుంది. అది నిద్ర, హార్మోన్లు, జీర్ణక్రియ, metabolism వంటి అనేక ప్రక్రియలను ప్రభావితం చేస్తుంది. మనం తినే సమయం కూడా ఈ body clockకు ఒక సంకేతంలా పనిచేస్తుంది.
చాలా ఆలస్యంగా తినడం వల్ల ఈ circadian rhythmలో అసమతుల్యత ఏర్పడి, glucose, fat metabolism వంటి ప్రక్రియలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
కానీ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ అధ్యయనంలో పాల్గొన్నవారి ఆహారపు సమాచారం ప్రధానంగా ఒక రోజు 24-hour recallపై ఆధారపడింది. అంటే ఆ ఒక్కరోజు తిన్న విధానం వారి ఎన్నో సంవత్సరాల అలవాట్లను పూర్తిగా ప్రతిబింబించకపోవచ్చు.
నిద్ర సమయాలు, shift work, వ్యక్తిగత body clock వంటి అంశాలు కూడా ఫలితాలపై ప్రభావం చూపి ఉండవచ్చు. అందుకే పరిశోధకులు కూడా ఈ ఫలితాలను చూసి ఒక్కసారిగా ఆహార సమయాలను మార్చుకోవద్దని చెబుతున్నారు.
అయితే ఈ అధ్యయనం మన రోజువారీ అలవాట్లపై ఓ ఆసక్తికరమైన విషయం చెప్తోంది. ఇన్నాళ్ళూ మనం “ఏం తినాలి?” అని ఎక్కువగా ఆలోచించాం. ఇకపై మరో విషయం కూడా ఆలోచించాల్సి రావచ్చు.
“ఎప్పుడు తినాలి?” అని.
బ్రేక్‌ఫాస్ట్‌ను ఎప్పటికప్పుడు వాయిదా వేయడం, రాత్రి చాలా ఆలస్యంగా డిన్నర్ చేయడం మనకు సాధారణ అలవాట్లలా కనిపించొచ్చు. కానీ మన శరీరానికి మాత్రం అవి కేవలం సమయాలు కాకపోవచ్చు. అవి దాని గడియారానికి పంపుతున్న సంకేతాలు కావచ్చు.మనని ఇబ్బందుల్లో పడేయచ్చు కూడా.
— సూర్య ప్రకాష్ జోశ్యుల








