అవినాష్ రెడ్డి నివాసంలో రెండుబ్యాగుల్లో కీలక పత్రాలు, డైరీల సీజ్..?
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అత్యంత సంచలన హత్య కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఈరోజు ఉదయం నుంచి చేపట్టిన ఆకస్మిక సోదాలు ఎట్టకేలకు ముగిశాయి. కడప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పులివెందుల నివాసంలో ఈడీ అధికారులు గంటల తరబడి ముమ్మర తనిఖీలు నిర్వహించారు. సోదాలు ముగిసిన అనంతరం అధికారులు అవినాష్ రెడ్డి(Avinash Reddy) నివాసం నుండి బయటకు వస్తూ రెండు పెద్ద బ్యాగులలో అత్యంత కీలకమైన డాక్యుమెంట్లు, ఆస్తుల పత్రాలు, మరియు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డైరీలను స్వాధీనం చేసుకుని తీసుకెళ్లినట్లు నమ్మదగిన సమాచారం.
ఈ దాడులు కేవలం ఎంపీ అవినాష్ రెడ్డి నివాసానికే పరిమితం కాకుండా కడప జిల్లా వ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించాయి. వివేకా హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న సునీల్ యాదవ్, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డిలతో పాటు అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరి ఇళ్లల్లోనూ ఈడీ ప్రత్యేక బృందాలు ఏకకాలంలో సోదాలు ముగించాయి. నిందితుల కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న ఆస్తులు, గత కొన్నేళ్లుగా వారి బ్యాంక్ అకౌంట్లలో జరిగిన ఆర్థిక లావాదేవీల వివరాలపై అధికారులు క్షుణ్ణంగా ఆరా తీశారు. సోదాల నేపథ్యంలో నిందితుల ఇళ్ల వద్ద భారీగా భద్రతను ఏర్పాటు చేశారు.
గతంలో సీబీఐ సేకరించిన చార్జ్‌షీట్ ఆధారాల ప్రకారం.. ఈ హత్యకు సుపారీగా చేతులు మారినట్లు చెబుతున్న రూ. 4 కోట్ల నగదు చుట్టూనే ఈడీ దర్యాప్తు ప్రధానంగా సాగుతోంది. ఈ కేసులో భారీ ఎత్తున మనీలాండరింగ్ (PMLA) మరియు హవాలా మార్గాల్లో నిధుల బదిలీ జరిగిందనే బలమైన కోణంలో ఈడీ జోనల్ అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. హత్య జరిగిన సమయానికి ముందే నిందితుల చేతికి అందిన కోట్ల రూపాయల నగదు అసలు ఎక్కడి నుండి వచ్చింది, దీని వెనుక ఉన్న ఆర్థిక సూత్రధారులు ఎవరు అనే విషయాన్ని తేల్చడానికి అధికారులు రంగంలోకి దిగారు. స్వాధీనం చేసుకున్న డిజిటల్ ఆధారాలు, పత్రాల ఆధారంగా రాబోయే రోజుల్లో ఈడీ అధికారులు ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు మరికొంతమంది కీలక నేతలకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.








