ఆచారాలు, సంప్రదాయాల్లో “సింబాలిక్ భాష” ? డీకోడ్ చేస్తే సైన్స్ కనిపిస్తుందా?
మనకు తెలియకుండానే మనం ప్రతిరోజూ ఒక భాష మాట్లాడుతున్నాం. కానీ ఆ భాషలో పదాలు ఉండవు. సంకేతాలు ఉంటాయి.
దీపం వెలిగించడం ఒక సంకేతం. వీడ్కోలు ఒక సంకేతం. ఒక వస్తువును దాచుకోవడం ఒక సంకేతం.
అయితే ఈ సంకేతాలతో మనం ఎవరితో మాట్లాడుతున్నాం? మన చుట్టూ ఉన్నవారితోనా? సమాజంతోనా? లేక మన సొంత మెదడుతోనా? ఈ “సింబాలిక్ భాష”ను డీకోడ్ చేస్తే… మన ఆచారాల వెనుక దాగి ఉన్న సైన్స్ కనిపిస్తుందా?
పుట్టిన రోజు వస్తే కొవ్వొత్తులు ఆర్పి,కేకులు కోసి సెలిబ్రేట్ చేస్తాం.
ఎవరైనా పోతే ఫొటో ముందు దీపం పెడతాం. అస్థికలను నదిలో కలుపుతాం.
కొన్నిసార్లు వాళ్ల జ్ఞాపకంగా ఒక చెట్టు నాటుతాం.
ఇవన్నీ కేవలం ఆచారాలేనా?
లేక…
మనసు ఒక నిజాన్ని అంగీకరించడానికి మనిషి సృష్టించుకున్న “సింబాలిక్ భాష”నా?
బయటికి చూస్తే ఇవన్నీ చిన్న చిన్న పనుల్లానే కనిపిస్తాయి.కానీ తరతరాలుగా మనం చేస్తూనే ఉన్నాం. మన పెద్దలు సంప్రదాయం పెట్టారు.మనం ఫాలో అవుతున్నాం. ఎప్పుడైనా ఇవన్నీ చేయటం వల్ల కలిసొచ్చేదేమిటి? అనీ ఆలోచిస్తామా.
నిజానికి కేకు కోయటం వల్ల మన వయస్సు లో మార్పేమీ రాదు. దీపం వెలిగిస్తే పోయిన వ్యక్తి తిరిగి రాడు. లెటర్స్ ను చింపేయడం వల్ల గతం మారదు. అస్దికలను నదిలో కలిపితే బాధ ఒక్కసారిగా మాయమవదు. అయినా మనిషి వేల సంవత్సరాలుగా ఇలాంటి పనులనే చేస్తూనే ఉన్నాడు. ఎందుకు?
మన ఆచారాలకు, సైన్స్ ఆలోచలతో లింక్ ఉందా?
మన సంప్రదాయాలు, ఆచారాలు పేరట చేసే మన పనుల వెనక ఓ సైక్లాజికల్ విషయం ఉండదంటోంది సైన్స్. ఎందుకంటే బాధ కనిపించదు. కానీ దానికి ఒక రూపం కావాలి. అదే పని ఆచారం చేస్తుంది. మనిషి బాధను బయటకు ఎందుకు తీసుకురావాలి? దుఃఖం మనలో జరుగుతుంది. దానికి ఆకారం ఉండదు. ఒక వ్యక్తిని కోల్పోయినప్పుడు గుండెలో ఖాళీ ఏర్పడుతుంది. ఒక సంబంధం ముగిసినప్పుడు ఏదో కోల్పోయిన భావన మిగులుతుంది.
జీవితంలో ఒక పెద్ద మార్పు వచ్చినప్పుడు… పాత జీవితం ముగిసిందో, కొత్తది మొదలైందో మనసుకు వెంటనే అర్థం కాదు. ఇక్కడే ఒక విచిత్రమైన మానవ అవసరం బయటపడుతుంది. మనసులో జరిగిన మార్పును శరీరం చేసే ఒక పనితో గుర్తించాలి.
అందుకే పెళ్లిలో ఉంగరం ఉంటుంది.
గ్రాడ్యుయేషన్‌లో సర్టిఫికెట్ ఉంటుంది.
అంత్యక్రియల్లో చివరి వీడ్కోలు ఉంటుంది.
వస్తువులో అసలు శక్తి ఉండకపోవచ్చు. కానీ ఆ వస్తువుకు మనం ఇచ్చే అర్థంలో శక్తి ఉంటుంది.ఒక ఉంగరం కేవలం లోహం. కానీ పెళ్లి తర్వాత అదే ఉంగరం ఒక సంబంధానికి గుర్తుగా మారుతుంది. ఒక ఫొటో కేవలం కాగితం. కానీ అందులో ఉన్న వ్యక్తి ఇక మన మధ్య లేడని తెలిసిన క్షణం… అదే ఫొటో జ్ఞాపకంగా మారుతుంది.
అంటే వస్తువు మారలేదు.
దానితో మన సంబంధం మారింది. మెదడు కూడా ఈ సంకేతాలను సీరియస్‌గా తీసుకుంటుంది మనిషి మెదడు కేవలం పదాలతోనే ప్రపంచాన్ని అర్థం చేసుకోదు. చిహ్నాలు, వస్తువులు, ప్రదేశాలు, శారీరక చర్యలు కూడా మన భావోద్వేగాలకు అర్థం ఇస్తాయి. అందుకే కొన్ని పనులు చేసిన తర్వాత మనకు నిజంగానే ఒక దశ ముగిసినట్టుగా అనిపిస్తుంది.
“ఇది జరిగింది. ఇప్పుడు నేను ముందుకు వెళ్లాలి.”
మనస్సుకు సంభందించిన సైంటిఫిక్ రీసెర్చ్ కూడా ఆచారాలు ఆందోళనను తగ్గించడంలో, నియంత్రణ భావనను పెంచడంలో, అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కోవడంలో సహాయపడవచ్చని చెప్తోంది.
మనోవిజ్ఞానంలో ఒక ముఖ్యమైన ఆలోచన ఏమిటంటే—లోపలే తిరుగుతున్న అనుభవాలకు మాటలు, చిత్రాలు లేదా చర్యల రూపం ఇవ్వడం కొన్నిసార్లు వాటిని ఎదుర్కోవడాన్ని సులభం చేస్తుంది.
ఎవరైనా తమ భయాలను కాగితంపై రాస్తారు. ఎవరైనా తమ బాధను చిత్రంగా గీస్తారు. ఎవరైనా ఒక ఉత్తరం రాస్తారు. కానీ దాన్ని పంపరు. ఇక్కడ లేఖకు వెళ్లాల్సిన చిరునామా ఉండకపోవచ్చు.అది మనసులోని మాటకు ఒక చిరునామా.
కొన్ని చికిత్సా విధానాల్లో కూడా భావోద్వేగ అనుభవాలను పదాల్లోకి తీసుకురావడం, శరీర అనుభూతులపై దృష్టి పెట్టడం, నియంత్రిత శ్వాస లేదా ఇతర నిర్మిత పద్ధతులను ఉపయోగించడం జరుగుతుంది. అయితే ప్రతి వ్యక్తికి, ప్రతి పరిస్థితికి ఒకే విధానం పనిచేస్తుందని చెప్పలేం.
ఇక్కడ మరో ముఖ్యమైన విషయం… ఆచారం పనిచేయడానికి అది మతపరమైనదే కావాల్సిన అవసరం లేదు. మీకు మాత్రమే అర్థమయ్యే ఒక వ్యక్తిగత ఆచారం కూడా కావచ్చు.
అందుకే మనం కొన్ని వస్తువులను వదలలేం. ఎవరైనా చనిపోయిన తర్వాత వారి వాచ్‌ను కొందరు సంవత్సరాల పాటు దాచుకుంటారు. వారి ఫోన్‌ను డిలీట్ చేయలేరు. ఒక పాత షర్ట్‌ను అల్మారాలో అలాగే ఉంచుతారు. బయటి వ్యక్తికి అవి సాధారణ వస్తువులు. కానీ ఆ వ్యక్తికి మాత్రం అవి ఒక మనిషికి సంబంధించిన చివరి స్పర్శలు. అందుకే “ఇది కేవలం ఒక వస్తువే కదా” అని చెప్పడం అంత సులభం కాదు.
ఎప్పటినుంచో ఉన్నవే?
ఇది కేవలం ఆధునిక మనోవిజ్ఞానం కనిపెట్టిన విషయం కాదు. మనిషి నాగరికత పుట్టినప్పటి నుంచే మరణం, పుట్టుక, వివాహం, యుద్ధం, వలస, పంట, ఋతువుల మార్పు—ప్రతి పెద్ద పరిణామానికి ఏదో ఒక ఆచారం సృష్టించాడు. ఎందుకంటే జీవితంలోని కొన్ని మార్పులకు సాధారణమైన “సరే, అయిపోయింది” అనే ముగింపు ఉండదు.
ఏదైమైనా
బహుశా అందుకే వేల సంవత్సరాలుగా మనిషి ఆచారాలను సృష్టిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే కొన్ని భావోద్వేగాలకు మాటలు సరిపోవు. వాటికి ఒక చర్య కావాలి. కొన్నిసార్లు… మనసు ఒక అధ్యాయాన్ని మూసివేయడానికి, చేతులతో ఒక చిన్న పని చేయాల్సి ఉంటుంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








