రెండు చరణాల వందేమాతరమే.. సీడబ్ల్యూసీ కీలక నిర్ణయం
కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా వందేమాతరంపై తీవ్ర చర్చ సాగుతోంది. మరీ ముఖ్యంగా అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మరీనూ. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో పూర్తి వందేమాతరం ప్లే చేసిన సమయంలో ఆపాలంటూ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అన్నట్లు తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. అయితే.. దీనిపై బీజేపీ రాజకీయం చేస్తోందంటూ కాంగ్రెస్ తిప్పి కొట్టినా… జనాల్లో అది బాగా వెళ్లిపోయింది.
ఇక.. తాజాగా బుధవారం కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాత్మక మండలి అయిన సీడబ్ల్యూసీ భేటీ ఢిల్లీలో జరిగింది. ఇందిరా భవన్ లో సుమారు 4 గంటల పాటు ఈ భేటీ కొనసాగింది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖార్గేతో పాటు మొత్తం 88 మంది ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా వందేమాతరం విషయంలో సీడబ్ల్యూసీ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ కార్యక్రమాల్లో వందేమాతరం మొదటి రెండు చరణాలను మాత్రమే ఆలాపించాలని నిర్ణయించింది. ఇది 1937 లో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయమని, దీనిని అనుసరించాల్సిందేనని నిర్ణయించారు. అప్పటి సమావేశంలో గాంధీ, నెహ్రూ, రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్ వంటి స్వాతంత్ర ఉద్యమ నాయకులు పాల్గొన్నారు. అప్పటి నిర్ణయం ప్రకారం జాతీయ సమావేశాల్లో మొదటి రెండు చరణాలను మాత్రమే పాడాలని నిర్ణయించారని పార్టీ పేర్కొంది. వందేమాతరం అనేది కాంగ్రెస్ కి భావోద్వేగ అంశమని, బీజేపీకి రాజకీయ అంశమని కాంగ్రెస్ దెప్పిపొడిచింది.








