సీఎం ఫడ్నవీస్.. ఇక మరింత ‘‘మోస్ట్ పవర్ ఫుల్ సీఎం’’.. అక్కడ కొత్త రూల్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇప్పుడు మరింత ‘‘పవర్ ఫుల్ ముఖ్యమంత్రి’’ అయిపోయారు. ‘మహారాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాల నియమావళి, 2026’ (Maharashtra Government Rules of Business, 2026)ను ప్రకటించింది. దీని ప్రకారం ఏ మంత్రి అయినా తీసుకున్న నిర్ణయాన్ని దేవేంద్ర ఫడ్నవీస్ తోసిపుచ్చవచ్చు. అయితే, ఆ చర్య ప్రజా ప్రయోజనాలకు అనుకూలంగా ఉండాలని భావించి, అందుకు గల కారణాలను లిఖితపూర్వకంగా నమోదు చేయాలి.
అయితే… ఇది కేవలం పరిపాలనా విధానంగా బయటికి కనిపిస్తున్నా.. రాజకీయపరమైన నిర్ణయం దీని వెనుక వుండి వుంటుందన్న భావన బలంగా వుంది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అవసరమని భావిస్తే, ఏ మంత్రి తీసుకున్న నిర్ణయాలనైనా సవరించే లేదా వాటిలో జోక్యం చేసుకునే స్పష్టమైన అధికారం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు లభించింది.
ఒక శాఖకు సంబంధించిన ప్రాథమిక బాధ్యత ఆయా శాఖా మంత్రిపైనే ఉన్నప్పటికీ, కీలకమైన లేదా వివాదాస్పద నిర్ణయాలను రద్దు చేసే స్పష్టమైన మరియు నిబంధనల ఆధారిత అధికారం ఇప్పుడు ముఖ్యమంత్రికి వచ్చేసింది. అయితే, ఈ అధికారాన్ని వినియోగించేటప్పుడు, ఆ నిర్ణయానికి గల కారణాలను ముఖ్యమంత్రి లిఖితపూర్వకంగా నమోదు చేయాల్సి ఉంటుంది.
మహారాష్ట్రలో ప్రభుత్వ కార్యకలాపాలను నియంత్రించే నిబంధనలు కొత్త విషయమేమీ కాదు; రాజ్యాంగంలోని 166వ అధికరణం కింద ప్రభుత్వ పనితీరును క్రమబద్ధీకరించే ‘వ్యాపార నిర్వహణ నియమావళి’ (Rules of Business) ఆ రాష్ట్రంలో అప్పటికే అమలులో ఉంది.అయితే, 2026 నాటి కొత్త నిబంధనలు ముఖ్యమంత్రి మరియు మంత్రుల మధ్య అధికారాల విభజన విషయంలో మరింత స్పష్టతను కల్పిస్తున్నాయి. ముఖ్యంగా, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా శాఖాపరమైన నిర్ణయాలను సమీక్షించడానికి మరియు వాటిని సవరించడానికి ముఖ్యమంత్రికి స్పష్టమైన అధికారాలు కల్పించబడ్డాయి.
మహారాష్ట్ర రూల్స్ ఆఫ్ బిజినెస్ 2026′, 1975 నుండి అమల్లో ఉన్న విధానపరమైన చట్రం స్థానంలో కొత్తగా వచ్చాయి.పాత నిబంధనల ప్రకారం ఒక మంత్రి తీసుకున్న నిర్ణయాన్ని అధిగమించే అధికారం ముఖ్యమంత్రికి లేదని 2023లో బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చిన మూడేళ్ల తర్వాత ఈ మార్పు చోటుచేసుకుంది.








