ఉరి శిక్షకు బదులు ఇంజెక్షన్? ప్రస్తుతానికైతే ఉరిశిక్షే అంటున్న సుప్రీం
మరణ శిక్ష అమలు విధానంపై మన దేశంలో మరోసారి చర్చ ప్రారంభమైంది. ఉరిశిక్షకు బదులుగా తక్కువ బాధాకరమైన, మరింత మానవీయమైన పద్ధతిని అమలు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.మరణశిక్ష అమలులో ఉరి తీయడానికి బదులు ప్రాణాంతక ఇంజెక్షన్ వాడాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
మరణ శిక్షను ప్రస్తుతం కొనసాగుతున్న పద్ధతి ఉరితీయడమే కొనసాగుతుందని తేల్చి చెప్పింది. దోషికి తక్కువ నొప్పి కలిగించే, వారి గౌరవాన్ని కాపాడే విధంగా ప్రత్యామ్నాయ పద్ధతులను అవలంబించాలని కోరుతూ సుప్రీంలో ఓ పిటిషన్ దాఖలైంది. దీనిని తాజాగా ధర్మాసనం కొట్టేసింది.
ప్రస్తుతం ఈ అంశాన్ని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ అంశాన్ని విచారిస్తోంది. న్యాయవాది రిషి మల్హోత్రా దాఖలు చేసిన పిటిషన్లో ప్రస్తుతం అమల్లో ఉన్న ఉరిశిక్ష విధానాన్ని సవాల్ చేశారు. ఉరి ద్వారా మరణశిక్ష అమలు చేయడం క్రూరమైన, అమానవీయమైన పద్ధతిగా మారే అవకాశం ఉందని ఆయన వాదించారు. మరణశిక్ష విధించిన వ్యక్తికి కూడా రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించే గౌరవంతో జీవించే హక్కు, దానికి అనుబంధంగా గౌరవప్రదమైన ప్రక్రియకు సంబంధించిన హక్కులను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా ఉరి తీసిన తర్వాత ఆ వ్యక్తి మరణించాడని ప్రకటించడానికి 40 నిమిషాలు సమయం పడుతుందని, అదే ఇంజెక్షన్ ద్వారా ఆ సమయం ఐదు నిమిషాల్లోనే పూర్తవుతుందని పిటిషన్ లో పేర్కొన్నారు.
వీటన్నింటినీ విన్న సుప్రీం కోర్టు.. తమ తీర్పే అంతిమం కాదని కూడా స్పష్టం చేసింది. మరణ శిక్ష అమలుకు ప్రత్యామ్నాయ పద్ధతులపై మెరుగైన శాస్త్రీయ ఆధారాలు వుంటే, వాటిని కూడా పరిశీలించవచ్చని సూచించింది. ప్రస్తుతానికి మాత్రం కేంద్రం ఉరిశిక్షను కొనసాగించడానికే సుముఖత చూపించింది.








