విడాకులు లేకుండా రెండో పెళ్లి చేసుకుంటే.. జీతంలో 20 శాతం కట్
బహు భారత్వం నిషేధం విషయంలో అసోం ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా, రెండో పెళ్లి చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. వారి జీతాల్లో కోత విధిస్తామని సీఎం హిమంత బిస్వ శర్మ కీలక ప్రకటన చేశారు.
‘‘ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా చట్టబద్ధంగా తన భార్య నుంచి విడాకులు తీసుకోకుండా ఆమెను వదిలేసి మరో మహిళతో వివాహ బంధం ఏర్పర్చుకుంటే, ఆ వ్యక్తిపై చర్యలు తీసుకుంటాం. ఆ ఉద్యోగి జీతం నుంచి 20 శాతం కోత విధించి, ఆ మొత్తాన్ని మొదటి భార్య బ్యాంకు ఖాతాలోనే నేరుగా వేసేస్తాం. అయితే.. ఆ భార్య దీని గురించి ప్రభుత్వం దగ్గర దరఖాస్తు మాత్రం చేసుకోవాలి’’ అని సీఎం ప్రకటించారు.
ఇటీవల కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు విడాకుల ప్రక్రియ పూర్తికాకముందే మరో మహిళతో కలిసి ఉంటున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయని హిమంత తెలిపారు.ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మొదటి భార్యతో విడాకుల అంశం ఇప్పటికే కోర్టులో పెండింగ్లో ఉన్నప్పటికీ జీతంలో 20 శాతం కోత కొనసాగుతుందని సీఎం స్పష్టం చేశారు.న్యాయపరమైన ప్రక్రియ పూర్తయ్యే వరకు వేచి చూడకుండా తొలి భార్యకు ఆర్థిక సహాయం అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు.
ఇదే సమయంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగులపైనా అస్సాం ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల వేతనంలో 10 శాతం కోత విధించనున్నట్లు సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు.ఆ మొత్తాన్ని తల్లిదండ్రులకు అందించే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.








