తెలంగాణ డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అమెరికా పర్యటన విజయవంతం
తెలంగాణ అభ్యున్నతి, పెట్టుబడుల కోసం తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇటీవల జరిపిన అమెరికా పర్యటన విజయవంతమైంది. పర్యటనలో భాగంగా మేరీలాండ్ లోని బాల్టిమోర్‌లో నిర్వహించిన అమెరికా తెలుగు సంఘం మహాసభల్లోనూ, ఇతర నగరాల్లోను జరిగిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
కాలిఫోర్నియా రాష్ట్రంలో….
అమెరికా పర్యటనలో భాగంగా కాలిఫోర్నియా రాష్ట్ర పర్యటనకు వచ్చిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు ఘనస్వాగతం లభించింది. ఆయన పర్యటనను పురస్కరించుకుని శాన్ఫ్రాన్సిస్కోలో భారత కాన్సులేట్ జనరల్ (సీజీఐ ఎసఎఫఓ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక ‘మీట్ అండ్ గ్రీట’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేదికగా బే ఏరియాకు చెందిన ప్రముఖ తెలుగు ప్రవాసులు, పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులు, వృత్తి నిపుణులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణను దేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన, అగ్రగామి పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లడమే ప్రజాప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉద్ఘాటించారు.
పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూ వసతి, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, నిరంతరం 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా, మెరుగైన మౌలిక సదుపాయాలు రాష్ట్ర ప్రధాన బలాలని వివరించారు. పారిశ్రామిక కారిడార్లు, పార్కుల్లో తయారీ, ఐటీ, జీవశాస్త్రం (ఫార్మా), స్వచ్ఛ ఇంధనం (గ్రీన్ ఎనర్జీ) మరియు నాలెడ్జ్ ఆధారిత పరిశ్రమలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలిపారు. పెట్టుబడిదారులకు ఎలాంటి జాప్యం లేకుండా వేగంగా అనుమతులు ఇచ్చేందుకు పారదర్శకమైన సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. పరిశ్రమలకు అవసరమైన నిపుణులను తీర్చిదిద్దేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో పాటు ఇతర సాంకేతిక విద్యా సంస్థలను బలోపేతం చేస్తున్నామని వెల్లడించారు.
అత్యాధునిక సాంకేతికత, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, సుస్థిర పట్టణ ప్రణాళికను సమన్వయం చేస్తూ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నామని, ప్రపంచస్థాయి సంస్థలను ఆకర్షించేందుకు ఈ ప్రాజెక్టు ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు సాంకేతికత, ఆవిష్కరణలు, పరిశ్రమల విస్తరణలో భాగస్వాములు కావాలని ప్రవాస తెలుగు పారిశ్రామికవేత్తలకు ఆయన పిలుపునిచ్చారు.
ప్యూచర్ సిటీలో సాంకేతికకు సహాయపడండి
నూతన తరం మొబిలిటీ సాంకేతికతను హైదరాబాద్, ఫ్యూచర్ సిటీలలో అనుసంధానించే అవకాశాలను పరిశీలించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వేమో (గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌కు చెందిన రోబో ట్యాక్సీ సేవల సంస్థ) ప్రతినిధులను కోరారు. అమెరికా పర్యటనలో భాగంగా శాన్ఫ్రాన్సిస్కోలోని బే ఏరియాకు చెందిన తెలుగు ప్రవాసులు, పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులు, వృత్తి నిపుణులతో భట్టి సమావేశమయ్యారు. తరువాత వేమో స్వయంచాలక (డ్రైవర్‌లెస్) వాహనంలో ప్రయాణించారు.
అనంతరం వేమో ప్రతినిధులతో సమావేశమై స్వయంచాలక వాహన సాంకేతికత, దాని నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు, నియంత్రణ విధానాలపై వివరాలు తెలుసుకున్నారు. హైదరాబాద్ నగరంతోపాటు ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీలో స్వయంచాలక మొబిలిటీ పరిష్కారాలను ప్రయోగాత్మకంగా అమలు చేసే అవకాశాలపై ఆరా తీశారు. ఇందుకు అవసరమైన అధిక రిజల్యూషన్ మ్యాపింగ్, సెన్సార్ అనుకూల రోడ్డు డిజైన్, ప్రత్యేక టెస్టింగ్ కారిడార్లు, డేటా కనెక్టివిటీ, ఏఐ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాల గురించి వేమో ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. స్వయంచాలక వాహనాల ట్రయల్స్, భవిష్యత్ విస్తరణకు అవకాశాలపై చర్చించారు.
అమెరికాలోని మైనింగ్ కేంద్రాలు పరిశీలించిన భట్టి
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అమెరికా పర్యటనలో భాగంగా ఆరిజోనా, టెక్సాస్ రాష్ట్రాల్లోని ప్రముఖ మైనింగ్ యంత్రాల తయారీ సంస్థలైన ‘కేటర్పిల్లర’, ‘కొమాట్సు’ కేంద్రాలను సందర్శించారు. రాష్ట్రంలో కీలకమైన సింగరేణి సంస్థను మరింత అభివృద్ధి పథంలో నడిపించడంతో పాటు, అక్కడ పనిచేసే కార్మికుల ప్రాణరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఓపెన్‌కాస్ట్ గనుల్లో తరచూ జరిగే ప్రమాదాలను అరికట్టడానికి విదేశాల్లో అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి, వాటిని సింగరేణిలో ప్రవేశపెట్టేందుకు ఉన్న అవకాశాలపై అక్కడ ప్రతినిధులతో లోతుగా చర్చించారు.
ఆటోమేషన్, టెలి రిమోట్
సాంకేతికత వైపు అడుగులు
గనుల్లో పని సంక్లిష్టతను తగ్గించి, పారదర్శకతను పెంచేందుకు స్వయంచాలిత (ఆటోమేటెడ్), టెలి-రిమోట్ టెక్నాలజీలను వినియోగంలోకి తీసుకురావాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని, మానవ తప్పిదాల వల్ల జరిగే ప్రమాదాలను కనిష్ట స్థాయికి తీసుకురావడానికి, క్లిష్టమైన వాతావరణంలో యంత్రాలను సురక్షితంగా దూరప్రాంతాల నుండి నియంత్రించే సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతుందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ఆధునిక పరికరాలను సమకూర్చుకోవడం ద్వారా సింగరేణిలో బొగ్గు ఉత్పాదకత పెరగడమే కాకుండా, మైనింగ్ రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తెలంగాణను ముందంజలో నిలపవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
లాస్ వెగాస్‌లో….
తెలంగాణ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో, ఫోర్త్ సిటీ నిర్మాణంలో, ఎదుగుదలలో పాలుపంచుకోవాలని అమెరికన్ పరిశ్రమలు, వ్యాపార సంస్థలకు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు పిలుపునిచ్చారు. అమెరికాలోని లాస్ వేగాస్ లో ప్రారంభమైన అంతర్జాతీయ మైనెక్స్-2024 ప్రదర్శనలో పాల్గొన్న అనంతరం పలు అమెరికన్ కంపెనీల ప్రతినిథులతో ఆయన సమావేశమయ్యారు. ఆయనతోపాటు రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, సింగరేణి సి&ఎండి ఎన్.బలరామ్ , స్పెషల్ సెక్రెటరీ కృష్ణభాస్కర్, ఇంకా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
భారతదేశంలో పరిశ్రమల స్థాపనకు, పెట్టుబడులకు, వ్యాపారాలకు హైదరాబాద్ అత్యంత అనువైన ప్రాంతమని, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో కీలకపాత్ర పోషిస్తుందని, కనుక ఇక్కడ ఖనిజ పరిశ్రమాభివృద్ధికి దోహదపడాలని ఇందుకు అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు,
ఖనిజాలను రక్షణతో మంచి ఉత్పాదకతతో ఉత్పత్తి చేయడానికి అవసరమైన యంత్రాలను సమకూర్చవచ్చని తెలిపారు. భూగర్భంలో దాగిన విలువైన ఖనిజాలను వెలికితీయడంలో, నిలకడగల అభివృద్ధిని సాధించడంలో అమెరికన్ కంపెనీలు భాగస్వాములు కావచ్చని సూచించారు. హైదరాబాద్ కు అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఫోర్త్ సిటీలో కూడా భాగస్వాములు కావాలని ఆయన అమెరికన్ పారిశ్రామిక కంపెనీలకు, వాణిజ్య సంస్థలకు పిలుపునిచ్చారు. ఇప్పటికే ఇక్కడ స్థాపించిన అమెరికన్ కంపెనీలు ఎంతో సౌకర్యవంతంగా తమ వ్యాపారాలను వృద్ధి చేసుకుంటున్నాయని, ఇంకా వివిధ రంగాల పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఉన్నందున దీనిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
తెలంగాణకు చెందిన ప్రభుత్వ కంపెనీ అయిన సింగరేణికి క్రిటికల్ మినరల్స్ అన్వేషణలో పూర్తి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల జరిగిన ఇరుదేశాధినేతల సమావేశంలో పరస్పరం రెండు దేశాలు ఒకరికొకరు తోడ్పడాలని అంగీకరించిన నేపథ్యంలో అమెరికన్ కంపెనీలు మరింతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అమెరికన్ ప్రభుత్వ ప్రతినిథి బృందానికి నాయకత్వం వహిస్తున్న గ్లోబల్ మార్కెట్స్ సహాయ కార్యదర్శి అరుణ్ వెంకటరామన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ లో ఇప్పటికే అమెరికాకు చెందిన పలు సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలు విజయవంతంగా నిర్వహించుకుంటున్నాయని, ఈ ఒరవడిని కొనసాగిస్తూ మరిన్ని అమెరికన్ సంస్థలు తెలంగాణలో తమ వ్యాపారాలు ప్రారంభిస్తాయని ఆయన ఆశాభావం ప్రకటించారు.
భారీ యంత్రాలు, సేవల ప్రదర్శనలో 1900 కంపెనీలు నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఈ భారీ అంతర్జాతీయ మైనెక్స్-2024 ప్రదర్శనలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు 1900 యంత్ర ఉత్పత్తి సంస్థలు తమ స్టాల్స్‌ను ఏర్పాటు చేసుకున్నాయి. వీటిలో భారీ మైనింగ్ తవ్వకాల యంత్రాలు, ఖనిజ రవాణా వాహనాలు, రక్షణ సేవలు, అనుబంధ యంత్ర విభాగాలను ప్రదర్శనకు ఉంచారు. 121 దేశాల నుండి సుమారు 44,000 వేల మంది ప్రతినిథులు దీనిలో పాల్గొన్నారు.
రాష్ట్రం నుంచి తొలిసారిగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కమల్లు సారథ్యంలోని రాష్ట్ర అధికారుల బృందం ప్రముఖ ఖనిజ పరిశ్రమల యంత్ర తయారీ సంస్థలైన కొమాట్సు, క్యాటర్ పిల్లర్, బి.కే.టి టైర్స్ తదితర స్టాల్స్ ను సందర్శించారు. అథికోత్పత్తి సాధించే రక్షణ సహిత భారీ యంత్రాల గురించి ఆయా కంపెనీల వారు తమ ప్రత్యేకతలను వివరించారు. ప్రదర్శనలో ఉంచిన వాటిలో అత్యాధునిక కంటిన్యూయస్ మైనర్ యంత్రాలు, లోడ్ హాల్ డంపర్లు, మైనింగ్ డోజర్లు, బ్లాస్ట్ హోల్ డ్రిల్స్, ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్స్ ఇంకా అత్యాధునిక టైర్లు, స్పేర్లు, వివిధ సేవలకు సంబంధించిన అంశాలను పరిశీలించారు.








