రామ్ మాధవ్ గారికి కవుటూరు రత్న కుమార్ అభినందనలు
సింగపూర్: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ ఉపాధ్యక్షులుగా శ్రీ రామ్ మాధవ్ గారు మరోసారి నియమితులైనందుకు శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్ హర్షం వ్యక్తం చేస్తూ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా కవుటూరు రత్న కుమార్ మాట్లాడుతూ, “రామ్ మాధవ్ గారితో గత కొన్ని సంవత్సరాలుగా నాకు సన్నిహిత అనుబంధం ఉంది. వారి సహకారంతో సింగపూర్ తెలుగు సమాజం పూర్వ అధ్యక్షులు వామరాజు సత్యమూర్తి గారితో కలిసి 2015లో “Singapore Welcomes Modi” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాము. అనంతరం రామ్ మాధవ్ గారు రచించిన Hindutva Paradigm, The Partition Freedom, The Indian Reality మరియు The New World తదితర పుస్తకాలను సింగపూర్లో పరిచయం చేసే కార్యక్రమాలను కూడా నిర్వహించాము” అని తెలిపారు.
శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ స్థాపించిన నాటి నుంచి సంస్థ నిర్వహించిన అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు రామ్ మాధవ్ గారు స్వయంగా హాజరై తమ ప్రోత్సాహాన్ని, సహకారాన్ని అందించారని రత్న కుమార్ తెలిపారు. సింగపూర్లో తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, కళలను ప్రోత్సహించేందుకు సంస్థ చేస్తున్న కార్యక్రమాలకు ఆయన అందించిన సహకారం ఎంతో విలువైనదని పేర్కొన్నారు.
రామ్ మాధవ్ గారి నాయకత్వం, అనుభవం భారతీయ జనతా పార్టీకి, దేశానికి మరింతగా ఉపయోగపడాలని ఆకాంక్షిస్తూ, ఆయనకు మరోసారి జాతీయ ఉపాధ్యక్ష పదవి లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.









