ఒక్క క్లిక్‌తో.. లంచం అడిగే ఆఫీసుల లిస్ట్!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
ఒక గవర్నమెంట్ ఆఫీసులో మీకు పని ఉంది.
ఫలానా సర్టిఫికెట్ కావాలి. ఫలానా డాక్యుమెంట్లో మార్పు చేయించుకోవాలి. RTOలో పని ఉంది. పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలి. లేక భూమికి సంబంధించిన పని మీద Revenue ఆఫీసుకు వెళ్లాలి.
పని ఏదో తెలుసు. ఎక్కడికి వెళ్లాలో కూడా తెలుసు. కానీ ఒక చిన్న డౌట్… అక్కడ లంచం అడుగుతారా? అడిగితే ఎంత అడుగుతారు? మన పని సరిగ్గా చేయడానికి డబ్బులు ఇవ్వాల్సిందేనా? లేక డబ్బులు ఇవ్వకుండా కూడా పని పూర్తవుతుందా? ఇదే అసలు డైలమా.
అక్కడికి వెళ్లే ముందు ఆ ఆఫీసుకు ఇదే పని మీద వెళ్లిన వాళ్లను అడిగితే బాగుంటుంది. వాళ్లను అడిగితే నిజంగా చెబుతారా?. “అవును.. నేను లంచం ఇచ్చాను” అని ఎవరు అంత ఈజీగా బయటకు చెబుతారు? అయితే ఏం చేయాలి?
మనకంటే ముందు అదే ఆఫీసుకు వెళ్లిన వాళ్ల అనుభవం తెలుసుకోవాలి. వాళ్లు ఎంత ఇచ్చారు? ఎవరు అడిగారు? ఏ పని కోసం అడిగారు? లంచం ఇవ్వకపోతే పని జరిగిందా? కానీ ఈ సమాచారం ఎక్కడ దొరుకుతుంది అంటారా?
ఆగండి…
అలాంటి సమాచారం ఒకే చోట కనిపించే ఫెసిలిటీ ఇప్పుడు మీకు దొరకబోతోంది. దాని పేరు Bribes.fyi. దీని మేటర్ ఏంటి అంటారా…
ఇది రెగ్యులర్ గా మనకు కనపడే “లంచం గురించి ఫిర్యాదు చేయండి” అనే వెబ్సైట్ మాత్రమే కాదు. ప్రజలు తమకు ఎదురైన లంచం అనుభవాలను పేరు చెప్పకుండా నమోదు చేస్తారు.
ఏ ప్రభుత్వ శాఖ?, ఏ నగరం?, ఎంత మొత్తం అడిగారు?, లంచం ఇచ్చారా?, తిరస్కరించారా? ఇలాంటి వివరాలను రిపోర్ట్ చేయొచ్చు. ఆ తర్వాత ఆ రిపోర్టులు పబ్లిక్ డేటాబేస్‌లో కనిపిస్తాయి. అంటే మీరు రేపు ఒక ప్రభుత్వ ఆఫీసుకు వెళ్లాల్సి వస్తే…మీకంటే ముందే అక్కడికి వెళ్లిన వాళ్లు ఏం రిపోర్ట్ చేశారో చూసుకోవచ్చు.
ఇది ప్రభుత్వ ఆఫీసుల ‘లంచం రివ్యూస్’ లాంటిదేనా?
ఒక విధంగా చూస్తే… అవును!. హోటల్‌కు వెళ్లే ముందు reviews చూస్తాం. సినిమాకు వెళ్లే ముందు ratings చూస్తాం. ఏదైనా వస్తువు కొనేముందు customer reviews చూస్తాం. అలాగే ఇకపై ప్రభుత్వ ఆఫీసుకు వెళ్లే ముందు… “ఇక్కడి experience ఎలా ఉంది?” అని కూడా చూసుకునే అవకాశం వస్తోంది. అయితే ఇది ఏ ప్రభుత్వ శాఖకూ అధికారిక rating ఇవ్వడం కాదు. ప్రజలు తమకు ఎదురైన అనుభవాలను రిపోర్ట్ చేస్తున్నారు. వాటిని ఒకచోట చేర్చి చూపిస్తోంది Bribes.fyi.
ఇప్పటివరకు 251 నగరాల నుంచి 616 రిపోర్టులు
ఆగస్టు 17, 2026 నాటి వివరాల ప్రకారం Bribes.fyiలో 251 నగరాల నుంచి 616 రిపోర్టులు నమోదయ్యాయి. అందులో అత్యధికంగా పోలీస్ శాఖపై 337 రిపోర్టులు ఉన్నాయి. ఆ తర్వాత RTOపై 88, Revenue/Land Recordsపై 69, Passport Officesపై 43, Municipal Corporationsపై 29 రిపోర్టులు నమోదయ్యాయి.
లంచం ఇచ్చారా? లేక ‘నో’ చెప్పారా?
ఇక్కడ మరో విషయం కూడా ఉంది. Bribes.fyi డేటా ప్రకారం నమోదైన ఘటనల్లో సుమారు 38 శాతం సందర్భాల్లో ప్రజలు లంచం ఇవ్వడానికి నిరాకరించినట్లు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో లంచం ఇవ్వకపోయినా తమకు కావాల్సిన సేవ లభించిందని రిపోర్టులు ఉన్నాయి.
ఓవరాల్ గా ఇది ప్రభుత్వ సర్వే కాదు. ఇది ప్రజలు రిపోర్ట్ చేసిన లంచం అనుభవాల డేటాబేస్.
ఫైనల్ గా…
ప్రభుత్వ ఆఫీసుకు వెళ్లే ముందు మనం చెక్ చేసుకోవాల్సిన checklistలో మరో item చేరినట్టే.
Documents తీసుకున్నారా?
Fees ఎంతనో చూసుకున్నారా?
Office timing తెలుసుకున్నారా?
అక్కడి లంచం history చూసుకున్నారా?








