లక్ష కోట్లు.. డ్రా చేసుకోకుండా వదిలేశారు, RBI వెల్లడి, ఎవరు డబ్బులవి?
— సూర్య ప్రకాష్ జోశ్యుల
మీ ఇంట్లో ఎక్కడో ఒక పాత బ్యాంకు పాస్‌బుక్ ఉంది. అందులో ఎంత డబ్బుందో మీకే తెలియదు. ఖాతా ఎవరు తెరిచారో కూడా గుర్తు లేదు. సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ డబ్బు మాత్రం బ్యాంకులోనే ఉంది. ఇలాంటి ఖాతాలు ఒక్కటి కాదు.. రెండు కాదు.. దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉన్నాయి. వాటిలో ఉన్న మొత్తం ఇప్పుడు దాదాపు రూ.1 లక్ష కోట్లకు చేరుకుంది!
RBIకి చెందిన Depositor Education and Awareness (DEA) Fundలో క్లెయిమ్ చేయని బ్యాంకు డిపాజిట్లు 2026 జనవరి 31 నాటికి రూ.98,073 కోట్లకు చేరినట్లు కేంద్ర ఆర్థిక శాఖ రాజ్యసభలో వెల్లడించింది.
ఆ ఎక్కౌంట్స్ ఎవరివి?
ఎప్పుడో ఉద్యోగం చేసినప్పుడు తెరిచిన పాత సేవింగ్స్ అకౌంట్ కావచ్చు. ఒక ఊరు నుంచి మరో ఊరికి వెళ్లిపోయిన తర్వాత ఉపయోగించని ఖాతా కావచ్చు. పెళ్లి తర్వాత మార్చేసిన పాత ఖాతా కావచ్చు. ఎప్పుడో తల్లిదండ్రులు పిల్లల పేరుతో తెరిచిన ఖాతా కావచ్చు. లేదా సంవత్సరాల క్రితం పెట్టిన ఫిక్స్డ్ డిపాజిట్ కావచ్చు.
డబ్బు చిన్న మొత్తమే అనుకుని పట్టించుకోకుండా వదిలేస్తారు. కానీ ఆ చిన్న మొత్తాలు వేల, లక్షల ఖాతాల్లో చేరితే.. చివరకు మొత్తం రూ.98 వేల కోట్లకు చేరుతుంది.
కానీ అందరూ డబ్బు మర్చిపోయిన వాళ్లే కాదు. ఇక్కడ మరో విషాదకరమైన కోణం ఉంది. కొంతమంది ఖాతాదారులు చనిపోయి ఉంటారు. వాళ్ల దగ్గర ఉన్న బ్యాంకు ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు కుటుంబ సభ్యులకు తెలియకపోవచ్చు. కొన్నిసార్లు నామినీకి కూడా ఆ డిపాజిట్ విషయం తెలియదు.
ఇంకొన్ని సందర్భాల్లో వారసులకు విషయం తెలిసినా.. అవసరమైన పత్రాలు సమర్పించడం, వారసత్వాన్ని నిరూపించడం, బ్యాంకు ప్రక్రియ పూర్తి చేయడం వంటి కారణాలతో క్లెయిమ్ ఆగిపోతుంది.
అంటే ఈ రూ.98 వేల కోట్లు కేవలం “డబ్బు మర్చిపోయిన వాళ్ల” సొమ్ము కాదు. అందులో తమ డబ్బు గురించి తెలియని ఖాతాదారులు ఉన్నారు. మరణించిన వారి వారసులు ఉన్నారు. పాత ఖాతాలను గుర్తించలేని కుటుంబాలు ఉన్నాయి.
మరి బ్యాంకు ఎప్పటివరకు ఆ డబ్బును అలాగే ఉంచుతుంది?
ఇక్కడ RBIకి ఒక స్పష్టమైన రూల్ ఉంది. సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతాలో 10 సంవత్సరాల పాటు ఎలాంటి కార్యకలాపాలు లేకపోయినా, లేదా టర్మ్ డిపాజిట్ మెచ్యూర్ అయిన తర్వాత 10 సంవత్సరాల పాటు ఎవరూ క్లెయిమ్ చేయకపోయినా, ఆ మొత్తాన్ని ‘Unclaimed Deposit’గా పరిగణిస్తారు.
ఆ తర్వాత ఆ డబ్బును బ్యాంకు తన దగ్గరే ఉంచుకోదు. RBI నిర్వహించే Depositor Education and Awareness Fundకు బదిలీ చేస్తుంది.
అంటే పదేళ్లు ఎవరూ పట్టించుకోని బ్యాంకు ఖాతా.. చివరకు RBI వ్యవస్థలోకి చేరుతుంది. కానీ ఇక్కడ చాలామందికి తెలియని ఒక ముఖ్యమైన విషయం ఉంది. RBIకి బదిలీ అయిందంటే డబ్బు పోయినట్లు కాదు.
ఇప్పుడు క్లైయిమ్ చేసుకోవచ్చా?
DEA Fundకు డబ్బు బదిలీ అయినా అసలు ఖాతాదారు లేదా చట్టపరమైన వారసుడి హక్కు పోదు. తర్వాత ఎప్పుడైనా క్లెయిమ్ చేయవచ్చు. RBI స్పష్టంగా చెబుతున్న ప్రకారం, అర్హత ఉన్న డిపాజిటర్ లేదా క్లెయిమెంట్ సంబంధిత బ్యాంకును సంప్రదించి డబ్బును తిరిగి పొందవచ్చు. వర్తించే సందర్భాల్లో వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది.
అంటే పదేళ్లు ఖాతాను పట్టించుకోకపోయినా.. డబ్బు ప్రభుత్వానికి శాశ్వతంగా వెళ్లిపోయినట్టు కాదు. ఇది చాలా కీలకమైన తేడా.
ఈ డబ్బులో ఎక్కువ ఎవరిది?
ఈ భారీ మొత్తంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా గణనీయంగా ఉంది. SBIకి సంబంధించిన క్లెయిమ్ చేయని డిపాజిట్లు రూ.20,040 కోట్లు. Punjab National Bankలో రూ.7,585 కోట్లు, Canara Bankలో రూ.6,830 కోట్లు, Bank of Barodaలో రూ.5,848 కోట్లు, Union Bank of Indiaలో రూ.5,549 కోట్లు ఉన్నాయి.
ప్రైవేట్ బ్యాంకుల్లో ICICI Bankలో రూ.2,278 కోట్లు, HDFC Bankలో రూ.1,912 కోట్లు, Axis Bankలో రూ.1,734 కోట్లు ఉన్నాయి.
మరి నా కుటుంబం డబ్బు కూడా ఇందులో ఉందో ఎలా తెలుసుకోవాలి?
ఇక్కడే RBI తీసుకొచ్చిన UDGAM Portal ఉపయోగపడుతుంది. UDGAM అంటే Unclaimed Deposits – Gateway to Access Information. ఒకే చోట అనేక బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్లను వెతకడానికి RBI ఈ పోర్టల్‌ను రూపొందించింది. RBI వివరాల ప్రకారం, 30 బ్యాంకులు ఇందులో ఉన్నాయి. ఇవి విలువ పరంగా DEA Fundలోని క్లెయిమ్ చేయని డిపాజిట్లలో దాదాపు 90 శాతాన్ని కవర్ చేస్తున్నాయి.
మీ పేరు మీద పాత ఖాతా ఉందా? తండ్రి లేదా తల్లి పేరుతో ఏదైనా డిపాజిట్ మిగిలిపోయిందా? మరణించిన కుటుంబ సభ్యుడి పేరుతో ఎప్పుడో పెట్టిన FD ఉందా? ఇలాంటి వివరాలను UDGAMలో వెతకవచ్చు.
అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి.
UDGAM డబ్బు ఇచ్చే పోర్టల్ కాదు. అది డబ్బు ఎక్కడుందో చూపించే సెర్చ్ సిస్టమ్ మాత్రమే. డిపాజిట్ కనిపిస్తే సంబంధిత బ్యాంకును సంప్రదించి క్లెయిమ్ ప్రక్రియ పూర్తి చేయాలి.








