క్రైమ్ కామెడీ : ‘ప్రీతమ్ అండ్ పెడ్రో’ సిరీస్ రివ్యూ!
Rating : 3.5/5
—సూర్య ప్రకాష్ జోశ్యుల
గోవా క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఆఫీసర్ పెడ్రో గన్సాల్వేస్(అర్షద్ వార్సీ) నిజాయితీ పరుడుగా మంచి పేరుంటుంది. పెడ్రో కాస్తంత క్రిందట జనరేషన్ వాడే కానీ క్రైమ్ కేసులను డీల్ చేయటంలో పండిపోయినవాడు. అతను ఓ సారి స్పోర్ట్స్ మినిస్టర్(సత్యదేవ్ మిశ్ర)ఇంట్లో సెల్ ఫోన్ మిస్సైతే వాళ్లింటికి వెళ్తాడు. అక్కడ వాళ్ళ అబ్బాయే తీసాడని క్రైమ్ జరిగిన ప్యాట్రన్ ని బట్టి క్షణాల్లో అర్దం చేసుకుంటాడు.
అదే విషయం చెప్తే వాళ్లు తట్టుకోలేక, నువ్వు పట్టుకోవటం చేతకాక , మా అబ్బాయిపైనే నెపం మోపుతావా అంటూ పెడ్రోపై సీరియస్ అవుతారు. అంతేకాదు ఆ మనిష్టర్ అతనికి ఫనిష్మంట్ ఇస్తారు. క్రైమ్ బ్రాంచ్ నుంచి సైబర్ క్రైమ్ కు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇక్కడే ట్విస్ట్.
పెడ్రోకు సైబర్ క్రైమ్ గురించి ఓనమాలు తెలియవు.సైబర్ క్రైమ్ లు మాట దేవెడురుగు…కంప్యూటర్ కీ బోర్డ్ గురించి కూడా అవగాహన ఉండదు. దాంతో పెడ్రోకి అక్కడ కూర్చోవటం నరకంలో ఉన్నట్లు అనిపిస్తుంది. అక్కడ నుంచి బయిటపడాలంటే మినిమం ఓ రెండు కేసులైనా సాల్వ్ చేయమని పై అధికారి చెప్తాడు. అప్పుడు అతనికి గుర్తుకు వస్తాడు ప్రీతమ్ (వీర్ హిరానీ). ఇంతకీ ప్రీతమ్ ఎవరు.
ప్రీతమ్ గోవాలో తన తాతయ్యతో కలిసి ఉంటూంటాడు. బ్రతకటానికి వాక్యూమ్ క్లీనర్స్ సేల్స్‌మ్యాన్‌గా పనిచేస్తుంటాడు. ఓ రోజు తన తాతకు ఎంతో ఇష్టమైన టేప్ రికార్డర్ ఎవరో దొంగిలిస్తారు. ఆ టేప్ రికార్డ్ లో ఓ క్యాసెట్ ఉంటుంది. అందులో తన నాయనమ్మ పాడిన పాట ఉంటుంది. అది విని రోజూ తన తాతయ్య ఆనందపడుతూంటాడు. దాంతో ఆ టేప్ రికార్డ్ ని వెతికి పట్టుకోమని, పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లైంట్ చేస్తాడు.
అక్కడే ఓ ఎటీఎం దొంగతనం కేసులో తికమకపడుతూంటాడు పెడ్రో. అతనికి తన తెలివితో సాయం చేసి, కొద్ది గంటల్లోనే కేసు సాల్వ్ అయ్యేలా చేస్తాడు. అప్పుడు ప్రీతమ్ టాలెంట్ పెడ్రోకు అర్దం అవుతుంది. అతను పైకి వాక్యూమ్ క్లీనరే కానీ అతను కంప్యూటర్ జీనియస్ అని అర్దం చేసుకుంటాడు. ఆ తర్వాత ఒకటి రెండు కేసుల్లో పెడ్రోకు ..ప్రీతమ్ సాయిం చేస్తాడు. ఇప్పుడు కూడా అందుకే పెడ్రోకు ప్రీతమ్ గుర్తు వస్తాడు.
ఈ లోగా అదే స్పోర్ట్స్ మినిస్టర్ కొడుకు కిడ్నాప్ అవుతాడు. సైబర్ క్రైమ్ నుంచి పెడ్రో వెళ్లాల్సి వస్తుంది. ప్రీతమ్ ని తనకు సాయిం చేయమని అడుగుతాడు. ప్రతిగా ప్రీతమ్ తాత పోగొట్టుకున్న టేప్ రికార్డర్ వెతికి పెడతానని చెప్తాడు. అక్కడ నుంచి ప్రీతమ్, పెడ్రో కలిసి కిడ్నాప్ కేసులోకి దూకుతారు. అయితే అనుకున్నంత ఈజీగా కిడ్నాప్ కేసు తెమలదు. రకరకాల ట్విస్ట్ లు వస్తాయి. ప్రీతమ్ గతంతో ఈ కిడ్నాప్ కేసు లింకప్ అయ్యి ఉంటుంది. అసలు మంత్రి కొడుకుని కిడ్నాప్ చేసింది ఎవరు? ప్రీతమ్ గతేమేంటి? ఈ కథలో హ్యాకర్ మార్టిన్(విక్రాంత్ మస్సే) ఎవరు? ఆఖరకు ఈ కథ ఎలా ముగిసింది అనేదే మిగతా స్టోరీ.
విశ్లేషణ
చాలామంది మంచి థ్రిల్లర్ అంటే… ట్విస్టులు ఉండాలి. విలన్ తెలివిగా ఉండాలి. హీరో చివర్లో షాక్ ఇవ్వాలి అనుకుంటారు. కానీ ప్రపంచంలోని గొప్ప థ్రిల్లర్లు ఏవీ అలా ఉండవు. అవి ప్రేక్షకుడి మెదడును మోసం చేస్తాయి. కథతో కాదు. స్క్రీన్‌ప్లేతో. Pritam And Pedro కూడా అలాంటి ప్రయత్నమే. రాజ్‌కుమార్ హిరానీ డైరెక్ట్ చేయకపోయినా… ఆయన రైటింగ్ DNA మొత్తం ఈ సిరీస్‌లో కనిపిస్తుంది. చాలా థ్రిల్లర్ సినిమాలు, సీరిస్ లు లాగా మొదటి సీన్లోనే విలన్. మొదటి ఐదు నిమిషాల్లోనే మర్డర్. పది నిమిషాల్లో కేసు అన్నట్లుగా దీన్ని హిరాని రాయలేదు. ముందు కథా ప్రపంచాన్ని చూపించి, పాత్రలను పరిచయం చేసాడు. వారి జీవితంలోకి ప్రేక్షకుడిని తీసుకెళ్ళాడు. ఎందుకంటే… ఆయనకు తెలుసు ప్రేక్షకుడు కథను ఫాలో అవ్వడు. మనుషులను ఫాలో అవుతాడు అని.
అందుకే మొదటి ఎపిసోడ్లో ATM కేసు కంటే… పెద్రో. ప్రీతమ్. వాళ్లేంటి, వాళ్ల బిహేవియర్స్ ఏమిటి.. వారి మధ్య కెమిస్ట్రీ. వీటికే ఎక్కువ సమయం కేటాయించారు. ఆయనకు తెలుసు… ప్రేక్షకుడు ఈ ఇద్దరిని ప్రేమిస్తే… తర్వాత వాళ్లు ఏ కేసు చేసినా చూస్తాడని. అలాగే క్యారక్టరైజేషన్స్ కూడా అలాగే డీల్ చేసారు. హీరోకు కంప్యూటర్ కూడా రాదు. Mouse కూడా సరిగ్గా పట్టుకోలేడు. ఇది పై నుంచి చూస్తే కామెడీ. కానీ నిజానికి ఇది Screenplay Strategy.
Imperfect Hero…ని ప్రేక్షకుడి మనిషిగా చూపిస్తాడు.
అలాగే నాకు ఇచ్చింది మరొకటి.. సీరిస్ ప్రారంభంలో వచ్చే ATM కేసు… చాలామందికి చిన్న కేసులా అనిపిస్తుంది. కానీ Screenplay పరంగా చూస్తే… ఇది మొత్తం సిరీస్‌కు Prototype. ఇక్కడే ఈ సీరిస్ బ్లూ ప్రింట్ ఇచ్చేస్తాడు. ఎలా మిగతా కథను చూడాలో నేర్పిస్తాడు. ఈ ప్రపంచంలో… డిజిటల్ Evidence కూడా Physical Evidence లాగే ముఖ్యమని మన బుర్రలోకి ఎక్కించేస్తాడు. దాంతో తర్వాత కథలో పెద్ద కేసు వచ్చినప్పుడు… ప్రేక్షకుడు Confuse అవ్వడు. ఇలాంటివి ఈ సీరిస్ లో బోలెడు ఉన్నాయి. తీరిగ్గా జాగ్రత్తగా చూస్తే కనపడతాయి. ఆసక్తిగా అనిపిస్తాయి.
అలాగని ఈ సిరీస్ ఫెరఫెక్ట్ గా ఉందని కాదు. కిడ్నాప్ ట్రాక్‌లో అక్కడక్కడా సాగదీత కనిపిస్తుంది. కొన్ని ట్విస్టులు మరింత షార్ప్ గా ఉండాల్సింది. కానీ ప్రతి ఎపిసోడ్ చివర ఆసక్తిని నిలబెట్టే స్క్రీన్‌ప్లే, సహజమైన పాత్రలు, అర్షద్ వార్సీ నటన, సైబర్ ప్రపంచంలోని ప్రమాదాలను సాధారణ ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చెప్పిన తీరు ఈ లోపాలను చాలా వరకు కప్పిపుచ్చేస్తాయి.
ఫైనల్ థాట్
క్రైమ్ థ్రిల్లర్ అనేది కేవలం హంతకుడిని కనిపెట్టే కథ మాత్రమే కాదని… కాలం మారితే థ్రిల్లర్ చెప్పే భాష కూడా మారాల్సిందేనని ఈ సిరీస్ మరోసారి నిరూపిస్తుంది.
ఎక్కడ చూడచ్చు
జియో హాట్ స్టార్ లో తెలుగులో ఉంది








