‘ఫార్చ్యూన్’ ఆయిల్ వాడేవారికి షాకింగ్ న్యూస్
—సూర్య ప్రకాష్ జోశ్యుల
మీ ఇంటి వంటగదిలోకి ఒకసారి తొంగి చూడండి.
అక్కడ Fortune ఆయిల్ ఉందా? ఉంటే… ఆ ప్యాకెట్‌పై ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి.
ఆ ప్యాకెట్ వెనకాల “Fortified with Vitamin A & D.” అని ఉంటుంది. ఈ ఒక్క వాక్యమే కోట్లాది కుటుంబాలకు ఒక నమ్మకాన్ని అమ్మింది. దీన్ని చూడగానే , దాని యాడ్స్ గమనించగానే …”ఇది సాధారణ నూనె కాదు… ఆరోగ్యానికి మంచిది.” అని ఫిక్సైపోతాం. అయితే ఆ ప్యాకెట్‌పై రాసిన విటమిన్లు… నిజంగా అందులో లేకపోతే?, మనకు ఎలా తెలుస్తుంది..ఎవరు చెక్ చేసి చెప్తారు. అది పని ఇప్పుడు FSSAI చేసింది. అందులో ఏమి తేలింది.
Fortune బ్రాండ్ కింద విక్రయించే Fryola Refined Sunflower Oilపై తాజాగా FSSAI చర్య తీసుకుంది. గోవాలో సేకరించిన ఒక నమూనాను పరీక్షించిన ల్యాబ్… ఆ నూనెలో Vitamin A, Vitamin D స్థాయిలు నిర్దేశించిన ప్రమాణాల కంటే తక్కువగా ఉన్నాయని గుర్తించింది. కంపెనీ అలాంటిదేమీ లేదని అభ్యంతరం చెప్పింది. మరోసారి రిఫరల్ ల్యాబ్ పరీక్షించింది. అక్కడ కూడా ముఖ్యంగా Vitamin D స్థాయి అనుమతించిన పరిమితికి చాలా తక్కువగా ఉందని తేలింది. దీంతో FSSAI కేసు నమోదు చేసి… కంపెనీపై జరిమానా విధించింది. ఆ జరిమానా మొత్తం మాత్రం వెల్లడించలేదు.
అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. నూనె విషపూరితమని FSSAI చెప్పలేదు. “Fortified” అని విక్రయిస్తున్న ఉత్పత్తిలో ఉండాల్సిన విటమిన్లు లేవని మాత్రమే చెప్పింది. అంటే ఇది నాణ్యత సమస్య మాత్రమే కాదు. నమ్మకం సమస్య.
మనం నూనె కాదు… ఒక హామీని కొనుగోలు చేస్తున్నాం
సూపర్ మార్కెట్లో నూనె కొనేటప్పుడు ఎవరూ ల్యాబ్ రిపోర్ట్ అడగరు. బ్రాండ్‌ను చూస్తారు. ప్రకటనను గుర్తు చేసుకుంటారు. ప్యాకెట్‌పై రాసిన మాటను నమ్ముతారు. “Fortified.” ఆ ఒక్క పదం కోసం చాలామంది సాధారణ నూనె కంటే ఎక్కువ ధర కూడా చెల్లిస్తారు. ఎందుకంటే ఆ పదం వెనుక ఒక ఆరోగ్య హామీ ఉంటుంది. అయితే ఆ హామీనే పరీక్షలో నిలబడకపోతే ఇదిగో ఇలాంటి సిట్యువేషనే వస్తుంది.
అసలు “Fortified” అంటే ఏమిటి?
భారతదేశంలో ఇప్పటికీ Vitamin A, Vitamin D వంటి సూక్ష్మపోషకాల లోపం పెద్ద ప్రజారోగ్య సమస్య.దాన్ని తగ్గించడానికి ప్రభుత్వం, FSSAI కలిసి కొన్ని ఆహారాల్లో అదనంగా విటమిన్లు కలపాలని నిబంధనలు రూపొందించాయి. దానినే ఫోర్టిఫికేషన్ అంటారు. అంటే… ప్యాకెట్‌పై “Fortified” అని రాస్తే… అందులో నిర్దేశించిన పరిమాణంలో విటమిన్లు ఉండాలి. అది కేవలం ఒక మార్కెటింగ్ పదం కాదు. ఒక చట్టబద్ధమైన హామీ. ఇది ఒక్క Fortune కంపెనీ కథ మాత్రమే కాదు…
గత కొన్ని నెలలుగా FSSAI చర్యలు గమనిస్తే ఒక ఆసక్తికరమైన నమూనా కనిపిస్తోంది. మొదట కొన్ని ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు. తర్వాత ఎనర్జీ డ్రింక్స్. ఆ తర్వాత ఆల్కహాలిక్ బేవరేజ్ కంపెనీలు. ఇప్పుడు ప్రముఖ ఎడిబుల్ ఆయిల్ బ్రాండ్. ఈ వరుస చూస్తే…FSSAI దృష్టి ఇప్పుడు కల్తీ ఆహారం పట్టుకోవడంపైనే కాదు. ప్యాకెట్‌పై రాసిన ప్రతి ఆరోగ్య వాదన నిజమేనా? అనే దానిపై కూడా దృష్టి పెట్టింది. ఇది భారత ఫుడ్ ఇండస్ట్రీలో కొత్త దశకు సంకేతం.








