భారత్‌లో కొత్త ‘డిజిటల్ డెట్ ట్రాప్’! మీరూ ఇరుక్కున్నారా?
–సూర్య ప్రకాష్ జోశ్యుల
ఒకప్పుడు మనిషి అప్పు తీసుకుని వస్తువు కొనేవాడు. ఇప్పుడు… ఒక అప్పు తీసుకుని మరో అప్పు తీరుస్తున్నాడు.
మిడిల్ క్లాస్ వ్యక్తి. నెల మొదటి తేదీ. జీతం ఖాతాలో పడింది. ఫోన్లో మెసేజ్ చూసిన ఆనందం ఎంతోసేపు ఉండదు. ఒక Loan App EMI, మరో యాప్ రిమైండర్, ఇంకో అప్పు చెల్లింపు.. ఒక్కొక్కటిగా డబ్బు ఖాతా నుంచి బయటకు వెళ్లిపోతుంటుంది. పదో తేదీ వచ్చేలోగా మొత్తం ఖాళీ. అక్కడ నుంచి ఎలా గడపాలి. ఎందుకంటే మన దగ్గర డబ్బులు అప్పటికే అయ్యిపోతాయి. కానీ ఇంటి ఖర్చులు మాత్రం ఆగవు. అప్పుడు ఫోన్లో మరో Loan App ఓపెన్ అవుతుంది. కొన్ని క్లిక్స్‌లో డబ్బు ఖాతాలోకి వస్తుంది.
ఆ క్షణానికి సమస్య తీరినట్టే అనిపిస్తుంది. కానీ నిజానికి అక్కడే మరో సమస్య మొదలవుతుంది. ఒక అప్పు తీర్చడానికి మరో అప్పు తీసుకున్న రోజు నుంచి.. మనిషి అప్పు తీర్చడం కాదు, అప్పును కొనసాగించడం మొదలుపెడతాడు. ఇదే ఇప్పుడు భారత్‌లో నెమ్మదిగా పెరుగుతున్న కొత్త డిజిటల్ డెట్ ట్రాప్.
అప్పు తీసుకోవడం సులభమైంది.. కానీ బయటపడటం?
అవసరమైనప్పుడు అప్పు తీసుకోవడం కొత్త విషయం కాదు. ఇల్లు, చదువు, వ్యాపారం లేదా అత్యవసర అవసరాల కోసం బ్యాంకు లోన్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ Digital Lending ఆ ప్రక్రియను పూర్తిగా మార్చేసింది. ఒకప్పుడు లోన్ కోసం బ్యాంకుకు వెళ్లాలి. పత్రాలు ఇవ్వాలి. అర్హతను పరిశీలించాలి. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లో కొన్ని వివరాలు నమోదు చేస్తే చాలు. అప్పు తీసుకునే ముందు ఆలోచించే సమయాన్ని కూడా టెక్నాలజీ తగ్గించేసింది.
దీంతో చిన్న మొత్తాల్లో రుణాలు తీసుకోవడం చాలా సులభమైంది. అదే సమయంలో, వాటిని వరుసగా తీసుకునే ప్రమాదం కూడా పెరిగింది.
భారత కుటుంబాల అప్పులు ఎందుకు ఆందోళన కలిగిస్తున్నాయి?
కోవిడ్‌కు ముందు భారత కుటుంబాల Household Debt GDPలో సుమారు 38% ఉండేది. 2025 డిసెంబర్ నాటికి అది 48%కి చేరింది. ఇక్కడ ముఖ్యమైన విషయం కేవలం అప్పుల మొత్తం కాదు. Non-housing Creditలో వినియోగ అవసరాలకు వెళ్తున్న రుణాల వాటా కూడా గణనీయంగా ఉంది.
అంటే ప్రజలు కేవలం ఇల్లు లేదా వ్యాపారం వంటి ఆస్తి కోసం మాత్రమే అప్పు తీసుకోవడం లేదు. రోజువారీ జీవితాన్ని నడపడానికి కూడా అప్పు అవసరమవుతోంది.
ఈ గ్యాప్‌ను Digital Lending వేగంగా భర్తీ చేస్తోంది.
భారత్‌లో Loan Apps మార్కెట్ గత మూడేళ్లలో దాదాపు 2.5 రెట్లు పెరిగి, సంవత్సరానికి సుమారు $23 బిలియన్ స్థాయికి చేరింది. గత ఆర్థిక సంవత్సరంలో Fintech ప్లాట్‌ఫార్ములు 13 కోట్లకు పైగా చిన్న రుణాలు మంజూరు చేశాయి. సగటు రుణం సుమారు ₹16,000.
చూడటానికి పెద్ద మొత్తం కాదు.
కానీ తక్కువ ఆదాయం ఉన్న కుటుంబానికి అది ఒక నెల బడ్జెట్‌ను మార్చేసేంత పెద్ద మొత్తం కావచ్చు. 36% వడ్డీ అని చెబుతారు.. కానీ అసలు భారం అక్కడితో ఆగదు కొన్ని Loan Apps సంవత్సరానికి 36% వడ్డీని చూపిస్తాయి. కానీ Processing Fee, ఇతర Charges, Penalties వంటి వాటిని కలిపితే Borrower చెల్లించే వాస్తవ ఖర్చు చాలా ఎక్కువ కావచ్చు. Moneylife Foundation పరిశీలించిన కొన్ని కేసుల్లో ఈ మొత్తం వార్షిక వ్యయం 365% లేదా అంతకంటే ఎక్కువ స్థాయికి వెళ్లినట్లు అధ్యయనం పేర్కొంది.
అసలు ప్రమాదం మాత్రం వడ్డీ కంటే ఇంకో చోట ఉంది.
ఒక వ్యక్తి మొదటి Loan EMI చెల్లించడానికి రెండో App నుంచి డబ్బు తీసుకుంటాడు. రెండో అప్పు చెల్లించడానికి మూడో Appను ఆశ్రయిస్తాడు. ఇలా అప్పు తగ్గకుండా.. అప్పుల సంఖ్య పెరుగుతుంది. కొన్ని కేసుల్లో ఒకే వ్యక్తి మీద 15 నుంచి 30 వరకు Active Loans ఉన్న పరిస్థితులు నమోదయ్యాయి. అంటే అతని భవిష్యత్తు జీతంలో పెద్ద భాగం ఇప్పటికే గతంలో తీసుకున్న అప్పులకు కేటాయించబడిపోయింది.
ఇది కేవలం Loan App సమస్య కాదు
Moneylife Foundation పరిశీలించిన 13 Distressed Borrower కేసుల్లో 11 మందికి నెలవారీ రుణ చెల్లింపులు వారి ఆదాయాన్ని మించిపోయాయి. Median Debt-Service Ratio 200%గా నమోదైంది. సింపుల్‌గా చెప్పాలంటే.. ఒక కుటుంబం ₹100 సంపాదిస్తే, అప్పుల చెల్లింపులకు ₹200 అవసరమయ్యే పరిస్థితి.
ఆ అదనపు ₹100 ఎక్కడి నుంచి వస్తుంది?
మళ్లీ అప్పు నుంచే. ఇక్కడ Loan App ఒక కారణం మాత్రమే. దాని వెనుక తక్కువ ఆదాయం, పెరుగుతున్న జీవన వ్యయం, ఉద్యోగాలపై అనిశ్చితి, పొదుపు లేకపోవడం వంటి పెద్ద సమస్యలు ఉన్నాయి. అందుకే ఇది కేవలం Fintech మేటర్ కాదు. ఇది భారతీయ కుటుంబాల ఆర్థిక భద్రతకు సంబంధించిన విషయం.
అయితే పరిష్కారం Loan Appsను ఆపేయడమేనా?
కాదు. అత్యవసర పరిస్థితుల్లో చిన్న రుణాలు అవసరమే. కానీ ఒక వ్యక్తి ఎన్ని Digital Loans తీసుకోవచ్చో పరిమితి ఉండాలి. Processing Feeతో సహా మొత్తం రుణ ఖర్చుపై స్పష్టమైన Ceiling ఉండాలి. ఒక వ్యక్తి ఇప్పటికే ఎన్ని అప్పుల్లో ఉన్నాడో Credit Bureausకు వెంటనే తెలిసేలా Real-Time Reporting ఉండాలి.
అంతకంటే ముఖ్యంగా.. తీవ్ర అప్పుల్లో చిక్కుకున్న వ్యక్తికి చట్టబద్ధంగా బయటపడే మార్గం కూడా అవసరం. కానీ దీర్ఘకాలిక పరిష్కారం మరోచోట ఉంది. భారత్‌కు మరో Loan App కంటే.. మరో Saving App అవసరం డబ్బు పంపడం సెకన్లలో జరిగే దేశం ఇది. డబ్బు అప్పుగా తీసుకోవడం కూడా కొన్ని నిమిషాల్లో జరుగుతోంది.
అప్పు తీసుకోవడం మూడు క్లిక్స్‌లో జరిగితే.. పొదుపు చేయడం కూడా అంతే సులభంగా ఎందుకు జరగకూడదు? రోజుకు ₹20 అయినా, నెలకు ₹500 అయినా.. ప్రజలు చిన్న మొత్తాలను భవిష్యత్తు కోసం పక్కన పెట్టుకునేలా చేసే Financial Products పెద్ద స్థాయిలో ఎందుకు అభివృద్ధి చెందకూడదు?
ఎందుకంటే ఒక దేశం ఆర్థికంగా బలంగా ఉందని చెప్పడానికి ప్రజలు ఎంత లోన్ తీసుకున్నారన్నది మాత్రమే ముఖ్యం కాదు. నెల చివరికి వారి చేతిలో ఎంత పొదుపు మిగిలింది అన్నదే అసలు ప్రశ్న. ఈరోజు Loan App మనకు భవిష్యత్తు నుంచి డబ్బు తెచ్చి ఖర్చు చేసే అవకాశం ఇస్తోంది.
రేపటి Fintech మాత్రం.. అదే మనిషి ఈరోజు సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని భవిష్యత్తు కోసం దాచుకునేలా చేయాలి. లేకపోతే ఫోన్లో బ్యాంకింగ్ యాప్స్ ఎన్నున్నా… మనిషి భవిష్యత్తు జీతం మాత్రం గత అప్పులకే అంకితమైపోతుంది.








