చంద్రుడిపై ఫ్యాక్టరీ కట్టడానికి మస్క్ ప్లానింగ్, అక్కడేం చేయాలని?
చంద్రుడిపై సూర్యోదయం అవుతోంది.
నల్లటి ఆకాశంలో భూమి నీలి బంతిలా వేలాడుతోంది.
వందల మీటర్ల ఎత్తులో క్రేన్లు కదులుతున్నాయి. దుమ్ము లేని చంద్రుడి నేలపై స్పార్కులు చిమ్ముతూ భారీ ఉక్కు నిర్మాణాలు ఒక్కో అంతస్తుగా పైకి లేస్తున్నాయి. పక్కనే రోబోల వరుస… ఒక్క సెకను కూడా ఆగకుండా పని చేస్తూనే ఉంది. ఎవ్వరూ ఆదేశాలు ఇవ్వడం లేదు. ఎవ్వరూ మాట్లాడటం లేదు. అయినా మొత్తం ఫ్యాక్టరీ ఒక భారీ యంత్రంలా నిశ్శబ్దంగా పనిచేస్తోంది.
కొద్దిసేపటికి ఒక పొడవాటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ట్రాక్‌పై లోహపు కంటైనర్ మెరుపు వేగంతో దూసుకెళ్లి… రాకెట్ లేకుండానే చంద్రుడి గురుత్వాకర్షణను దాటి అంతరిక్షంలోకి దూసుకుపోతోంది. ఆ దృశ్యాన్ని దూరంగా నిలబడి పర్యవేక్షిస్తున్న మనిషి ఎవరూ లేరు. ఎందుకంటే… మనుషులు ఇంకా చంద్రుడిపై అడుగుపెట్టలేదు.
వినడానికి ఇది క్రిస్టోఫర్ నోలన్ లేదా డెనిస్ విల్నెవ్ తీసిన సైన్స్ ఫిక్షన్ సినిమా క్లైమాక్స్‌లా అనిపించొచ్చు. కానీ ఇలాంటి భవిష్యత్తునే నిజం చేయాలనుకుంటున్నారు ఎలాన్ మస్క్. రోబోలతో చంద్రుడిపై ఫ్యాక్టరీలు నిర్మించి, తర్వాత మనుషులను పంపాలన్నది ఆయన తాజా ప్రణాళిక.
చంద్రుడిపై అడుగుపెట్టడం ఒకప్పుడు మానవజాతి కల. ఇప్పుడు అక్కడే ఫ్యాక్టరీలు కట్టాలని ప్లాన్ చేస్తోంది ఎలాన్ మస్క్ నేతృత్వంలోని SpaceX. వినడానికి సైన్స్ ఫిక్షన్ సినిమా కథలా అనిపించినా… ఇదే భవిష్యత్తు అని మస్క్ చెబుతున్నారు. ఈ క్రమంలో చంద్రుడిపై ఫ్యాక్టరీ ఎందుకు? దాన్ని ఎలా కడతారు? అక్కడ అసలు తయారయ్యేది ఏమిటి? అనే ప్రశ్నలే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి.
SpaceX తొలి పబ్లిక్ ఎర్నింగ్స్ కాల్లో ఎలాన్ మస్క్ తన భవిష్యత్ ప్రణాళికను వివరించారు. మనుషులను చంద్రుడిపై స్థిరంగా నివసింపజేయాలంటే ముందుగా అక్కడ మౌలిక వసతులు ఉండాలని, ఆ పని కోసం రోబోలను పంపాలని ఆయన భావిస్తున్నారు. అంటే వ్యోమగాములు వెళ్లేలోపే రోబోలు అక్కడ పని మొదలుపెడతాయన్న మాట.
ఈ రోబోలు కేవలం నిర్మాణ పనులే చేయవు. ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయడం, విద్యుత్ వ్యవస్థలను అమర్చడం, పరికరాలను నిర్వహించడం, చంద్రుడిపై లభించే ఖనిజాలను సేకరించి ప్రాసెస్ చేయడం వంటి పనులను కూడా నిర్వహిస్తాయి. దీంతో ప్రమాదకరమైన వాతావరణంలో మనుషులపై ఆధారపడాల్సిన అవసరం గణనీయంగా తగ్గుతుందని SpaceX భావిస్తోంది.
మస్క్ చెప్పిన మరో ఆసక్తికరమైన ఆలోచన మాస్ యాక్సిలరేటర్. ఇది చంద్రుడి ఉపరితలం నుంచి సరుకులను అంతరిక్షంలోకి పంపేందుకు ఉపయోగించే ప్రత్యేక వ్యవస్థ. సాధారణ రాకెట్లకు బదులుగా సౌరశక్తితో పనిచేసే ఈ వ్యవస్థ భవిష్యత్తులో అంతరిక్ష రవాణా ఖర్చును భారీగా తగ్గించే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఇలాంటి భారీ నిర్మాణాలను కూడా రోబోలే నిర్మిస్తాయని వివరించారు.
“ఇది ఇప్పుడు పూర్తిగా పిచ్చి ఆలోచనలా అనిపించవచ్చు. కానీ ఒకరోజు ఇది తప్పకుండా జరుగుతుంది” అని మస్క్ వ్యాఖ్యానించారు. చంద్రుడిపై పరిశ్రమలు ఏర్పడితే భూమి ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఉన్నదానికంటే వెయ్యి రెట్లు విస్తరించే అవకాశం ఉందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే ఈ పనికి Tesla తయారు చేస్తున్న Optimus హ్యూమనాయిడ్ రోబోలనే ఉపయోగిస్తారా? లేక చంద్రుడి కోసం ప్రత్యేకంగా కొత్త రోబోలను అభివృద్ధి చేస్తారా? అనే విషయంపై SpaceX ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అలాగే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎంత పెట్టుబడి అవసరం అవుతుంది అనే వివరాలు కూడా వెల్లడించలేదు.
ఏదైమైనా…
ఒకప్పుడు చంద్రుడిపై మనిషి అడుగుపెట్టడం అసాధ్యమని అనుకున్నారు. ఇప్పుడు అక్కడే ఫ్యాక్టరీలు నిర్మించి పరిశ్రమలను ఏర్పాటు చేయాలనే ఆలోచన వినిపిస్తోంది. ఈ ప్రణాళిక ఎప్పుడు నిజమవుతుందో చెప్పడం కష్టం. కానీ అంతరిక్షాన్ని కేవలం అన్వేషణకే పరిమితం చేయకుండా, పరిశ్రమల కేంద్రంగా మార్చాలనే ఎలాన్ మస్క్ లక్ష్యం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.








