‘జయంత్ చల్లా మీరొక ఛాంపియన్’.. ఆటా మహాసభల్లో డేవిడ్ మిల్లర్ ప్రశంసలు
అమెరికాలోని బాల్టిమోర్ వేదికగా జరిగిన 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలలో మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్ భర్త డేవిడ్ మిల్లర్ సుదీర్ఘంగా ప్రసంగించారు. ఆటా కన్వెన్షన్‌లో పాల్గొనడంపై ఆనందం వ్యక్తం చేస్తూ, నిర్వాహకులకు, ఆటా నాయకత్వానికి డేవిడ్ మిల్లర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లాను ఛాంపియన్‌గా అభివర్ణించారు.
లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్‌పై…
అరుణా మిల్లర్ అత్యంత తెలివైన, దూరదృష్టి ఉన్న నాయకురాలని అభివర్ణించారు. ఆమె రవాణా ఇంజినీర్‌గా, విద్యావంతురాలిగా ఎదిగి ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు. 2022 జనవరి 18న మేరీల్యాండ్ గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన చారిత్రక సందర్భాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.
అరుణా మిల్లర్, మరో మహిళా నాయకురాలు జాయ్ తమ వలస కుటుంబాల కలలకు ప్రతీకలుగా నిలిచారని తెలిపారు. అమెరికాలోని తెలుగు అమెరికన్ పిల్లలను ఉద్దేశించి ఏదైనా సాధ్యమే అనే బలమైన సందేశాన్ని ఇచ్చారు. వారు అడుగుపెట్టే ప్రతి గది, వారి రాకతో మరింత మెరుగవుతుందని చెబుతూ యువతలో అత్మవిశ్వాసాన్ని నింపారు.
అమెరికాలో తెలుగు డయాస్పోరా తమ ప్రతిభ, ఆనందం , సేవ ద్వారా సమాజానికి గొప్ప మార్పు తీసుకురావాలని పిలుపునిచ్చారు. మేరీల్యాండ్‌ను టెక్నాలజీ, మెడికల్, బిజినెస్ , విద్య రంగాల్లో ముందుకు నడిపించడంలో తెలుగు కమ్యూనిటీ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు.
ప్రభుత్వ విధానాలపై…
మైనారిటీ వ్యాపారాలకు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో సమాన అవకాశాలు కల్పించే ప్రొక్యూర్మెంట్ రిఫార్మ్కు(procurement reform) తెలుగు కమ్యూనిటీ పూర్తి మద్దతు ఇచ్చిందని తెలిపారు. అలాగే హైస్కూల్ గ్రాడ్యుయేట్లకు సేవా సంవత్సరం అవకాశం కల్పించిన మేరీల్యాండ్ కార్యక్రమానికి కూడా కమ్యూనిటీ సహకరించిందని పేర్కొన్నారు.
విద్యను దీర్ఘకాలిక అవకాశాలు, కుటుంబాల అభివృద్ధికి ప్రధాన మార్గంగా అభివర్ణించారు. తాను , అరుణా మిల్లర్ సహా అనేక మంది చదువు ద్వారానే ఎదిగామని చెబుతూ, ప్రతి చిన్నారికి మంచి విద్య, అవకాశాలు అందాలని ఆకాంక్షించారు. అలాగే తాను జమైకా వలసదారుడి కుమారుడినని, తన కుటుంబ పెద్దలు గతంలో ఎదుర్కొన్న కష్టాలను పంచుకుంటూ గత తరాల త్యాగాల వల్లే ప్రస్తుత తరం ఈ స్థాయి అవకాశాలు పొందుతోందని గుర్తుచేశారు.
చరిత్రలో తెలుగువారి ముద్ర…
అమెరికా 250వ వార్షికోత్సవాన్ని ప్రస్తావిస్తూ, దేశ చరిత్రలో జార్జ్ వాషింగ్టన్, జేమ్స్ మాడిసన్ వంటి ప్రముఖులతో పాటు జయంత్ చల్లా, శ్రీధర్ బానాలా, అరుణా మిల్లర్ వంటి తెలుగు అమెరికన్ల పాత్ర కూడా చిరస్థాయిగా నిలిచిపోవాలని అన్నారు. తెలుగు సమాజం ఎప్పుడూ కలిసికట్టుగా నిలబడి, ఎదగాలని ఆకాంక్షించారు. ఆటా వంటి తెలుగు సమావేశాల్లో పూర్వీకులు తమ కోసం చేసిన కృషిని గుర్తుచేసుకునేలా నేటి తరం కూడా బాధ్యతతో పనిచేయాలని కోరుతూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.








