ఖైరతాబాద్ ఉప ఎన్నికపై SIR ఎఫెక్ట్! పార్టీల్లో గుబులు..!!
దానం నాగేందర్ పై అనర్హత వేటు పడడంతో ఖైరతాబాద్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఇప్పుడు ఖైరతాబాద్‌లో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియ ప్రధాన రాజకీయ పార్టీల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. నియోజకవర్గంలో ఊహించని విధంగా అనర్హత ఓట్లు పెద్ద ఎత్తున తెరపైకి వస్తున్నాయి. ఏకంగా సగం మేర ఓటర్ల జాబితా నుంచి మాయం కావడం ఇప్పుడు నగర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
గతంలో ఖైరతాబాద్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య సుమారు 2.93 లక్షలుగా ఉండేది. అయితే… గైర్హాజరు, షిఫ్టెడ్, డెత్, డూప్లైకేట్.. తదితర కారణాలతో అధికారులు దాదాపు 1.23 లక్షల ఓట్లను తొలగించారు. దీనివల్ల ఇటీవల ప్రకటించిన ముసాయిదా జాబితాలో ఓటర్ల సంఖ్య 1.70 లక్షలకు పడిపోయింది. ఇందులోనూ మ్యాపింగ్, ఎనామలీస్ జాబితాలో ఉన్న మరో 81 వేల మందికి పైగా ఓటర్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు స్పందించి సరైన డాక్యుమెంట్లు సమర్పించని వారి పేర్లు కూడా తొలగించే అవకాశం ఉంది. అదే జరిగితే తుది జాబితా నాటికి ఇక్కడి ఓటర్ల సంఖ్య ఏకంగా 1.5 లక్షలకు పడిపోయే తీవ్ర అవకాశముంది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన దానం నాగేందర్ దాదాపు 22 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అనర్హత పడడంతో ఇప్పుడు మరోసారి ఎన్నిక అనివార్యమైంది. ఈ తరుణంలో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గిపోవడం ఏ పార్టీ విజయావకాశాలను దెబ్బతీస్తుందనే దానిపై సర్వత్రా తీవ్ర చర్చ జరుగుతోంది. పైకి మాత్రం ప్రధాన పార్టీలన్నీ తమ విజయానికి ఢోకా లేదని చెప్తున్నాయి. కానీ, తెరవెనుక పరిణామాలు మాత్రం వారిలో గుబులు పుట్టిస్తున్నాయి. గల్లంతైన ఓట్లలో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన సానుభూతిపరులు, కార్యకర్తలు ఉండటంతో ఎవరికి నష్టం జరుగుతుందో అంచనా వేయలేక పార్టీల వ్యూహకర్తలు తలలు పట్టుకుంటున్నారు.
ఓట్ల తొలగింపు వ్యవహారం రాజకీయంగా పెను దుమారం రేపుతుండటంతో పార్టీలు అప్రమత్తమయ్యాయి. పార్టీ తరపున ఓట్లను పరిశీలించేందుకు ప్రత్యేక నిపుణులను, లీగల్ సెల్ ప్రతినిధులను రంగంలోకి దించారు. ముసాయిదా జాబితా పరిశీలన బాధ్యతలను కొందరి ముఖ్య నేతలకు అప్పగించారు. నోటీసులు అందుకున్న ఓటర్లను వ్యక్తిగతంగా కలిసి, వారు సరైన డాక్యుమెంట్లు సమర్పించేలా చూడాలని నాయకులు క్షేత్రస్థాయి క్యాడర్‌ను ఆదేశించారు. అలాగే, ఎన్యుమరేషన్ ఫారాలు సక్రమంగా సమర్పించినప్పటికీ, సాంకేతిక లోపాలతో కొందరి పేర్లు ముసాయిదా జాబితాలో గల్లంతు కావడంతో, వారందరితో కొత్తగా ఫామ్-6 ద్వారా పేరు నమోదు చేయించేలా కార్యక్రమాలు చేపడుతున్నారు. నవంబర్‌లో ఎస్ఐఆర్ తుది ఓటర్ల జాబితా విడుదల కానుంది. అప్పటివరకు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకూడదని అన్ని పార్టీలు భావిస్తున్నాయి.








