దుబాయి స్కూళ్లలో ఈ ఫుడ్ నిషిద్ధం.. Lunch Boxపై కొత్త Rules!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
ఉదయాన్నే లేచి పిల్లాడిని స్కూల్‌కి పంపించడం అనే కార్యక్రమం ఏదైతే ఉందో అది ప్రతీ ఇంట్లో పెద్ద ప్రహసనమే. హడావుడిగా లంచ్ బాక్స్ తీయడం, పిల్లాడికి ఏది ఇష్టమైతే అది వండి పెట్టడం, పక్కన ఒక జ్యూస్ బాటిల్ ఉంచడం.. ఆ తరవాత బ్యాగ్‌లో పెట్టి బైబై చెప్పేయడం చాలామంది తల్లుల దినచర్య. అయితే, ఇప్పుడు UAE లో ఉన్న పిల్లల తల్లులు మాత్రం అలా రొటీన్ గా చేసుకుంటూ పోతాను..పిల్లలు ఏది అడిగితే అది పెట్టి లంచ్ భాక్స్ ఇచ్చేస్తాను అంటే కుదరదు. ఎందుకంటే అక్కడ స్కూళ్లలో ఈ లంచ్ బాక్స్ పద్ధతి పూర్తిగా మారిపోతోంది.
ఒకప్పుడు “నా పిల్లాడికి ఏం ఇష్టం?” అని మాత్రమే ఆలోచించిన తల్లిదండ్రులు, ఇప్పుడు “అసలు ఈ ఆహారాన్ని స్కూల్లోకి అనుమతిస్తారా?” అని ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. దుబాయ్, అబుదాబి వంటి ప్రాంతాల్లో పిల్లల ఆహారంపై స్కూళ్లు కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నాయి.
ఏంటి ఆంక్షలు? లంచ్ బాక్స్‌లో ఏవి ఉండకూడదు?
పిల్లలు ఎంతో ఇష్టంగా తినే జంక్ ఫుడ్స్‌పై స్కూళ్లు స్పష్టమైన ఆంక్షలు విధించాయి. కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, ప్యాక్ చేసిన స్వీట్ జ్యూస్‌లు, చాక్లెట్లు, లాపాప్లు, ఐస్‌క్రీమ్‌లు, జెల్లీలు, చిప్స్, ప్యాకెట్ స్నాక్స్, ఫ్రైడ్ చికెన్, నగ్గెట్స్, సమోసాలు, హాట్‌డాగ్స్, సాసేజ్లు వంటి వాటన్నింటినీ స్కూల్ పరిసరాల్లో నిషేధించారు. వీటన్నింటి వెనుకా ఒకే రకమైన సమస్య ఉంది. అవేంటంటే.. మోతాదుకు మించిన చక్కెర, ఉప్పు, కొవ్వులతో పాటు కృత్రిమ రంగులు, నిల్వ ఉంచే రసాయనాలు (additives). అందుకే స్కూళ్లు కేవలం ఒక్క ఫుడ్ ఐటమ్‌ను మాత్రమే కాకుండా, పిల్లల రోజువారీ ఆహార అలవాట్లను మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి.
బేక్ చేసినా, శాండ్విచ్ పెట్టినా చెల్లుబాటు కాదు!
చాలామంది తల్లిదండ్రులు నూనెలో వేయించలేదు కదా అని బేక్ చేసిన స్నాక్స్, చిప్స్ ఇస్తుంటారు. కానీ, అది బేక్ చేసినదా లేదా ఫ్రై చేసినదా అనే దానికంటే, అందులో ఏ ఏ పదార్థాలు వాడారు అన్నదే ఇప్పుడు ముఖ్యం. అలాగే బ్రెడ్ మధ్యలో సాసేజ్లు, ప్యాక్ చేసిన మాంసం పెట్టి శాండ్విచ్ పంపినా స్కూల్లో ఒప్పుకోరు. మనం కొనే ప్యాకెట్ వెనుక ఉన్న చిన్న అక్షరాల నిబంధనలను, పామ్ ఆయిల్, టేస్టింగ్ సాల్ట్, ఆర్టిఫిషియల్ కలర్స్ వంటి వాటిని సరిచూసుకోవడం ఇప్పుడు తప్పనిసరిగా మారింది.
ఇది క్యాంటీన్ రూల్ మాత్రమే కాదు.. ఇంటి నిర్ణయాల్లోనూ భాగమే!
ఈ కొత్త నిబంధనలు స్కూల్ క్యాంటీన్లలో అమ్మే తిళ్లకే కాదు, ఇళ్ల నుంచి పిల్లలు తెచ్చుకునే లంచ్ బాక్సులకు కూడా వర్తిస్తాయి. అనుమతి లేని ఆహార పదార్థాల గురించి స్కూళ్లు ముందుగానే తల్లిదండ్రులకు స్పష్టమైన జాబితాను ఇస్తున్నాయి. క్యాంటీన్లలో వండే పద్ధతులను, వాడే పదార్థాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నారు. లంచ్ బాక్సుల్లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆహారాన్ని పంపితే స్కూల్ యాజమాన్యాలు సీరియస్‌గా తీసుకుంటున్నాయి. ఒకప్పుడు లంచ్ బాక్స్ లో ఏం పెట్టాలనేది కేవలం తల్లిదండ్రుల వ్యక్తిగత నిర్ణయంగా ఉండేది, కానీ ఇప్పుడు స్కూల్ నిబంధనలకు అనుగుణంగానే ఆ బాక్స్ తయారవ్వాల్సి వస్తోంది.
ఆహారానికి, చదువుకి అసలు సంబంధం ఉందా?
కూల్ డ్రింక్స్, స్వీట్లు, ఆర్టిఫిషియల్ కలర్స్ ఉన్న పదార్థాలు తినడం వల్ల పిల్లల్లో ఏకాగ్రత తగ్గిపోతోందని, తరగతి గదిలో వారి ప్రవర్తన మారుతోందని స్కూళ్ల నిర్వహకులు భావిస్తున్నారు. అందుకే ఆరోగ్యకరమైన వాతావరణం కోసం ఈ మార్పులు తెచ్చామని చెప్తున్నారు. అయితే చక్కెర, ప్రాసెస్డ్ ఫుడ్ తింటే పిల్లలు మొండిగా తయారవుతారని లేదా అతిగా ప్రవర్తిస్తారని పూర్తిగా వైద్యపరంగా చెప్పలేకపోయినా, ఈ రకమైన ఆహారం వల్ల పిల్లల చదువు, ఆరోగ్యం దెబ్బతింటాయనే ఆందోళన మాత్రం స్కూళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది.
అయితే లంచ్ బాక్స్‌లో అసలు ఏం పెట్టాలి?
నిషేధాల సంగతి సరే, మరి పిల్లలకు లంచ్ బాక్స్‌లో ఏం పంపాలనే దానికి కూడా మార్గదర్శకాలు మంచి ప్రత్యామ్నాయాలను చూపుతున్నాయి. నూనె లేకుండా కాల్చిన లేదా బేక్ చేసిన చికెన్, గ్రిల్ చేసిన చేపలు, మొలకెత్తిన గింజలు, ఆకుకూరలు, తృణధాన్యాలతో చేసిన వంటకాలు, తాజా పండ్లను ప్రోత్సహిస్తున్నారు. ఇక తాగేందుకు సాధారణ మంచినీటికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. అవసరమైతే చక్కెర కలపని సహజమైన పండ్ల రసాలు లేదా వాటర్-ఇన్ఫ్యూజ్డ్ ఫ్రూట్ వాటర్‌ను పంపవచ్చని చెప్తున్నారు.
మొత్తానికి మారింది లంచ్ బాక్స్ కాదు.. పేరెంటింగ్!
ఈ మార్పును ఒక్కసారి గమనిస్తే.. పిల్లాడికి ఇష్టమైన నగ్గెట్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను పక్కన పెట్టి, వాడికి ఏది మంచిది అని ఆలోచించడమే అసలైన విజయం అని అర్థమవుతుంది. స్కూల్ గేటు దాటేసరికి ఆ బాక్స్‌లో ఉప్పు ఎంత ఉంది, షుగర్ ఎంత ఉంది, హానికర రసాయనాలు ఉన్నాయా అని ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. “పిల్లాడికి ఏది ఇష్టం?” అనే ప్రశ్న నుంచి “పిల్లాడికి ఏది మంచిది?” అనే దిశగా తల్లిదండ్రుల ఆలోచనా విధానాన్ని మార్చడమే UAE లో వస్తున్న ఈ కొత్త ఫుడ్ రూల్స్ వెనుక ఉన్న అసలు కథ!








