సినిమా ఒకటే.. కానీ టికెట్ రేటును బట్టి సీన్లు మారతాయా?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
సినిమా టికెట్ ఖరీదును బట్టి మన సీటు మారడం ఇంతకాలం మనకు తెలుసు, సౌండ్ సిస్టమ్ మారడం తెలుసు, ఆఖరికి ప్లాస్టిక్ కుర్చీ నుంచి రీక్లైనర్ సోఫా దాకా మారడం కూడా తెలుసు. కానీ ఎప్పుడైనా టికెట్ రేటును బట్టి చూసే కథే మారిపోతుందేమో అని ఆలోచించారా? వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా, ఇప్పుడు మార్వెల్ రీ-రిలీజ్ చేస్తున్న ఒక సినిమా సరిగ్గా ఇదే చర్చకు తెరలేపుతోంది.
మనం రోజూ చూసే గుళ్లలో దేవుడు ఒక్కడే అయినా, ఎక్కువ డబ్బులిస్తే ప్రత్యేక దర్శనం, తక్కువ డబ్బులిస్తే సాధారణ దర్శనం ఎలాగైతే దక్కుతాయో… రేపు సినిమా థియేటర్లలో కూడా ఎంత డబ్బు చెల్లిస్తే అంత ఎక్కువ కథ చూపిస్తారేమో అన్నట్లుగా ఉందీ పరిస్ధితి. అసలు ఏం జరుగుతోంది. ఈ సినిమా మేటరేంటి?
ఒకే సినిమా.. రెండు వేర్వేరు రన్టైమ్లు!
ఈ సరికొత్త చర్చకు కారణం 2019లో ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించిన ‘అవేంజర్స్: ఎండ్ గేమ్’ రీ-రిలీజ్. మార్వెల్ సంస్థ ‘Avengers: Endgame Encore’ పేరుతో ఈ సినిమాను మళ్లీ థియేటర్లలోకి తీసుకొస్తోంది. సెప్టెంబర్ 25 నుంచి రిలీజ్ కానున్న ఈ వెర్షన్లో కొత్త ఓపెనింగ్స్, అదనపు సన్నివేశాలు, రాబోయే ‘Avengers: Doomsday’కి సంబంధించిన ప్రత్యేక కంటెంట్ ఉంటాయని చెప్పారు. అయితే ఇక్కడే కొత్త మెలిక వచ్చి పడింది.
ఈ కొత్త కంటెంట్ అన్ని స్క్రీన్లలో ఒకేలా ఉండటం లేదు. ఐమాక్స్, ఇన్ఫినిటీ విజన్ లాంటి ప్రీమియం స్క్రీన్లలో సినిమా నిడివి 186 నిమిషాల 14 సెకన్లు ఉంటే, సాధారణ స్క్రీన్లలో మాత్రం 183 నిమిషాల 3 సెకన్లు మాత్రమే ఉంటోంది. అంటే సుమారు మూడు నిమిషాల లెంగ్త్ తేడా.
2019లో వచ్చిన ఒరిజినల్ సినిమా కంటే సాధారణ స్క్రీన్ల ప్రేక్షకులకు రెండు నిమిషాలు అదనంగా వస్తే, ప్రీమియం స్క్రీన్ల ప్రేక్షకులకు ఏకంగా ఐదు నిమిషాలకు పైగా కొత్త సీన్లు కనిపించబోతున్నాయి. దీనిబట్టి ప్రశ్న ఇప్పుడు కొత్త సీన్లు ఉన్నాయా లేదా అని కాదు, మీరు కొన్న టికెట్ రేటును బట్టి ఎంత కంటెంట్ చూస్తారనేదిగా మారిపోయింది.
సీటు పరిమాణమే కాదు.. కంటెంట్ కూడా మారుతుందా?
ఇప్పటివరకు సినిమా టికెట్ ఎకానమీలో మనం చూసిన మార్పులన్నీ సౌకర్యాలకు సంబంధించినవే. సాధారణ స్క్రీన్‌కి ఒక ధర ఉంటే, 3Dకి ఇంకొంచెం, ఐమాక్స్‌కి మరికొంచెం, రీక్లైనర్లయితే ఇంకాస్త ఎక్కువ వసూలు చేసేవారు. మనం ఎక్కువ డబ్బులు చెల్లిస్తే సీటు నడుముకి హాయిగా ఉండేదేమో, లేదా స్క్రీన్ కాస్త పెద్దగా ఉండి సౌండ్ చెవులకు విందుగా అనిపించేదేమో కానీ, సినిమా కథ మాత్రం రూ.100 టికెట్ కొన్నోడికి, రూ.1000 టికెట్ కొన్నోడికి ఒక్కటే.
అయితే ఇప్పుడు ఎండ్ గేమ్ రీ-రిలీజ్లో కనిపిస్తున్న ఈ వ్యత్యాసం ఒక కొత్త అనుమానాన్ని ముందుకు నెడుతోంది. డబ్బులు పెరిగేకొద్దీ కేవలం కూర్చునే సీటు మాత్రమే కాదు, మనం చూసే కథ కూడా పెరుగుతుందా? నిజంగానే అలా జరిగితే, ఇన్నాళ్లూ మనం చూస్తూ వచ్చిన థియేటర్ అనుభవం ఒక కొత్త సరిహద్దును దాటినట్టే అవుతుంది.
‘ఎక్కువ చెల్లించు.. ఎక్కువ చూడు’ అనే సరికొత్త మోడల్!
సాధారణంగా ప్రీమియం టికెట్ కొనే ఏ ప్రేక్షకుడైనా మెరుగైన థియేటర్ అనుభవాన్ని ఆశిస్తాడు. పెద్ద స్క్రీన్, మెరుగైన సౌండ్, ప్రశాంతమైన వాతావరణం ఉంటే చాలు అనుకుంటాడు. కానీ ఆ అనుభవంలోకి కథలోని అదనపు భాగం కూడా వచ్చి చేరితే, ఆ ప్రీమియం టికెట్ కేవలం ‘బెటర్ ఎక్స్పీరియన్స్’ గా మాత్రమే మిగిలిపోదు, అది ‘మోర్ కంటెంట్’ కిందకు మారిపోతుంది.
ఇది చూడటానికి చాలా చిన్న తేడాలా అనిపించవచ్చు కానీ, భవిష్యత్తులో మిగతా నిర్మాతలు కూడా దీనినే ఒక బిజినెస్ మోడల్‌గా మార్చుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. రేపు పొద్దున ఒక సాదా టికెట్‌కి కేవలం మెయిన్ కథ చూపిస్తారు, ఇంకొంచెం ఎక్కువ ఇస్తే ఒక ఎక్స్ట్రా సీన్ చూపిస్తారు, బాగా ఎక్కువ డబ్బులిస్తే సీక్వెల్‌కి సంబంధించిన స్పెషల్ పుటేజ్ చూపిస్తారు.
మార్వెల్ దీనిని ఒక వ్యాపార వ్యూహంగా అధికారికంగా ప్రకటించకపోయినా, ఈ రీ-రిలీజ్ మాత్రం సినిమా భవిష్యత్తు గురించి ఆలోచించేలా చేసే ఒక బలమైన ఉదాహరణను మన ముందుంచింది.
ఇది కేవలం మూడు నిమిషాల సమస్య మాత్రమే కాదు!
ఈ విషయంలో అసలు రచ్చ ఆ మూడు నిమిషాల నిడివి గురించి కాదు. ఆ మూడు నిమిషాల్లో ఉన్న కంటెంట్ రాబోయే సినిమాల కథకు ఎంత ముఖ్యమైనది? సాధారణ టికెట్ కొనుక్కున్న ప్రేక్షకుడు దానిని చూడకుండా మిస్ అయిపోవాల్సిందేనా? లేదా ఆ కాస్త సమాచారం తెలుసుకోవడానికి కావాలని ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలా? అనేవే ఇక్కడ నిలదీయాల్సిన ప్రశ్నలు.
ఎందుకంటే సినిమా అనేది సమాజంలో అందరికీ సమానమైన వినోదాన్ని పంచే ఒక మాధ్యమం. థియేటర్లో మనం కూర్చునే సీటు వేరుగా ఉండొచ్చు, చూసే స్క్రీన్ పరిమాణం వేరుగా ఉండొచ్చు కానీ, అందరం చూసే కథ మాత్రం ఒక్కటే అయి ఉండాలనేది ఏ ప్రేక్షకుడైనా కోరుకునే కనీస హక్కు. అలా కాకుండా ఒకరికి సీన్ ఉండి, ఇంకొకరికి లేకపోతే, అప్పుడు ప్రీమియం సినిమా అనేది కేవలం లగ్జరీగా మాత్రమే మిగలదు, అది కంటెంట్‌ను కూడా శాసించే స్థాయికి వెళ్లిపోతుంది.
రేపు సినిమా కూడా ‘విఐపి దర్శనం’ లాగే మారిపోతే?
ఇక్కడే మనకు దేవుడి గుడి ఉదాహరణ గుర్తుకొస్తుంది. గుడిలో దేవుడు ఒక్కడే, స్థలం ఒక్కటే, కానీ మనం నిలబడే క్యూ లైన్‌ను బట్టి దేవుడిని ఎంత దగ్గరగా, ఎంత సేపు చూస్తామనేది నిర్ణయమవుతోంది. రేపు థియేటర్లలో కూడా ఒకే కథకు సాధారణ ప్రేక్షకుడికి ఒక వెర్షన్, ఎక్కువ డబ్బులు ఇచ్చే శ్రీమంతుడికి మరో వెర్షన్ చూపిస్తే పరిస్థితి ఏంటి? అప్పుడు ప్రశ్న సినిమా ఖరీదు ఎంత అనే దానితో ఆగిపోదు, మీరు ఎంత ఖర్చు పెట్టగలరో దాన్నిబట్టే ఎంత కథ చూడగలరో నిర్ణయించే రోజులు కూడా వస్తాయా అనే దగ్గరకి చేరుకుంటుంది.
ఈ ‘అవేంజర్స్: ఎండ్ గేమ్’ వివాదం ఇప్పుడే ఒక నిర్ణయానికి వచ్చేంత పెద్దది కాకపోవచ్చు కానీ, సినిమా టికెట్ ఎకానమీ ఇప్పటివరకు కేవలం సీట్లను మాత్రమే విభజించింది, ఇకపై అనుభవాన్ని, ఆపై డబ్బున్నవాడికి ఒకలాంటి కంటెంట్, లేనివాడికి ఇంకోలాంటి కంటెంట్ అని కథలను కూడా విభజించబోతోందా అనే పెద్ద సందేహాన్ని ప్రపంచం మీద వదిలే ఒక చిన్న ట్రైలరే!








