జన్వాడ ఫామ్‌హౌస్ కేటీఆర్‌ది కాదా?
తెలంగాణలో ఫామ్‌హౌస్ పాలిటిక్స్ పతాక స్థాయికి చేరాయి. అసెంబ్లీ వేదికగా మొదలైన మాటల యుద్ధం ఇప్పుడు క్షేత్రస్థాయికి మారింది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడలోని ఫామ్‌హౌస్ లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు చేపట్టిన పర్యటన ఉత్కంఠకు దారితీసింది. ఇది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్రమ ఆస్తి అని, అసలు నిజాలు నిగ్గుతేలుస్తామని కాంగ్రెస్ పట్టుబడుతుండగా.. ఇది కేటీఆర్ ది కాదని, లీజు ప్రాపర్టీ మాత్రమేనంటూ అసలైన యజమాని తెరపైకి రావడం ఈ వివాదాన్ని సరికొత్త మలుపు తిప్పింది.
ఉదయం కాంగ్రెస్ నేతల బృందం జన్వాడ వైపు కదిలింది. ఫామ్‌హౌస్ భూముల రికార్డులు, రెవెన్యూ యాజమాన్య వివరాలు, చుట్టుపక్కల ప్రభుత్వ భూములతో ఉన్న సంబంధాలను స్వయంగా పరిశీలించడమే లక్ష్యంగా ఈ యాత్ర సాగింది. అయితే, విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు, కేటీఆర్ బృందం కూడా పెద్ద ఎత్తున జన్వాడకు చేరుకోవడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించి పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
అయితే.. జన్వాడ ప్రాపర్టీ అసలు యజమానిని తానేనంటూ ప్రదీప్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. ఆ స్థలానికి కేటీఆర్‌కు నేరుగా ఎలాంటి యాజమాన్య హక్కులు లేవని స్పష్టం చేశారు. జన్వాడలోని ఈ 4 ఎకరాల భూమి పూర్తిగా తన స్వార్జితమని వెల్లడించారు. 2019లో చట్టబద్ధమైన ప్రక్రియలు, రిజిస్ట్రేషన్ నిబంధనలన్నీ పూర్తి చేసి ఈ భూమిని కొనుగోలు చేశానని, దీనికి సంబంధించి నూటికి నూరు శాతం చట్టబద్ధమైన టైటిల్ పత్రాలు తన వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. కేటీఆర్ తనకు చిన్ననాటి స్నేహితుడు కావడంతో నిబంధనల ప్రకారమే లీజుకు మాత్రమే ఇచ్చానని, ఇక్కడ ఎలాంటి అక్రమాలు లేదా భూ ఆక్రమణలు జరగలేదని తేల్చిచెప్పారు.
రాజకీయ కక్షసాధింపుల్లో భాగంగా ప్రైవేటు వ్యక్తుల ఆస్తులను వివాదాల్లోకి లాగడం సరికాదని ప్రదీప్ రెడ్డి హితవు పలికారు. ప్రభుత్వానికి, రెవెన్యూ శాఖకు ఏవైనా సందేహాలుంటే నిబంధనల ప్రకారం నేరుగా నోటీసులు జారీ చేయాలని, అన్ని డాక్యుమెంట్లను అధికారుల ముందుంచి విచారణకు పూర్తిగా సహకరిస్తానని ప్రకటించారు. అనుమతి లేకుండా ఎవరైనా తన ఆస్తిలోకి అక్రమంగా ప్రవేశిస్తే లేదా ముట్టడికి యత్నిస్తే చట్టప్రకారం పోలీసు రక్షణ కోరతానని స్పష్టం చేశారు.
మొత్తానికి ఎర్రవల్లి నుంచి జన్వాడ మీదుగా వెలికట్ట దాకా కాంగ్రెస్ సర్కార్ సాగిస్తున్న భూ పరిశీలనల పర్వం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టేందుకు అధికార పక్షం ఆస్తుల అస్త్రాలను ప్రయోగిస్తుండగా, తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతుండటంతో ఈ పోరు మరింత ముదిరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.








