ఆస్కార్ బరిలో ‘గొంధల్’.. దేవుడి పూజ, హత్య కుట్ర! ఈ మరాఠీ సినిమా ప్రత్యేకత ఏమిటి?
ఒక పెళ్లి రాత్రి… ఊరంతా డప్పుల మోత, దేవుడి పాటలు, భక్తుల కోలాహలం. కానీ అదే వేడుక వెనుక, అదే మంటల సాక్షిగా ఒక పక్కా ప్లాన్ ప్రకారం హత్యకు కుట్ర జరుగుతుంటే?
పైకి కనిపించే పవిత్రమైన జానపద ఆచారానికి, లోపల రగిలే మనుషుల కామం, క్రూరత్వం, అసూయలకు మధ్య ఉన్న ఆ నల్లటి గీతనే తెరపైకి తీసుకొచ్చింది మరాఠీ చిత్రం ‘గొంధల్’. అందుకే ఈ సినిమా భారత దేశం తరఫున 2027 ఆస్కార్స్ (99వ అకాడమీ అవార్డ్స్) బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ బరిలో అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. దాంతో ఇప్పుడు అందరి దృష్టీ ఈ సినిమా మీదకు తిరిగింది.
సినిమా కథేమిటి
మహారాష్ట్ర గ్రామీణ ప్రాంతంలో ఒకే ఒక్క రాత్రిలో నడిచే కథ ఇది. సుమన్, ఆనంద్ అనే కొత్త దంపతుల కోసం ఊరిలో ‘గొంధల్’ అనే సాంప్రదాయ రాత్రి వేడుక జరుగుతుంటుంది. గొంధల్ సంప్రదాయంలో కొత్త జంట జీవితంలోని అడ్డంకులను తొలగించేందుకు ఖండేరాయుడిని ఆహ్వానిస్తారు. రాత్రంతా చేసే ఒక పవిత్రమైన జానపద పూజా ఆచారం.
ఈ క్రమంలో బయట గ్రామమంతా ఆధ్యాత్మిక మైకంలో ఊగిపోతుంటే, సుమన్ మనసులో మాత్రం ఒక పెద్ద తుఫాను రేగుతుంది. ఆమెకు ఆనంద్‌తో పెళ్లి ఇష్టం లేదు. అంతకుముందు సర్జేరావ్ అనే గ్రామ పటేల్ కొడుకుతో ఆమెకు నిశ్చితార్థం జరుగుతుంది. అయితే , భారీ కట్నం డిమాండ్ కారణంగా ఆ పెళ్లి ఆగిపోతుంది. అలాగని సుమన్ మనసు సర్జేరావ్ దగ్గర కూడా లేదు. ఆమె నిజంగా ప్రాణంగా ప్రేమించేది సాహెబా అనే ఒక గొంధలి (జానపద) కళాకారుడిని.
అంటే సుమన్ చుట్టూ మూడు పురుష పాత్రలు ఉన్నాయి:
ఆనంద్ .. భర్త
సర్జేరావ్ .. ఒకప్పుడు పెళ్లి చేసుకోవాల్సిన వ్యక్తి
సాహెబా…ఆమె నిజంగా ప్రేమించే వ్యక్తి
ఈ మూడు సంబంధాల మధ్యే మొత్తం థ్రిల్లర్ మొదలవుతుంది.
బాధితురాలా? లేక భయంకరమైన సూత్రధారా?
తన భర్త ఆనంద్ బతికున్నంత కాలం తాను ప్రేమించిన సాహెబాతో కలిసి బతకడం సాధ్యం కాదని సుమన్‌కు బాగా తెలుసు. అలా అని ఆమె స్వయంగా చేతులు కాల్చుకోదు. ఆనంద్‌ను తుదిముట్టించడానికి తనపై పాత ప్రేమ, అసూయతో రగిలిపోతున్న సర్జేరావ్ను పావుగా వాడుకుంటుంది.
సర్జేరావ్ బలహీనతలను ఆసరాగా చేసుకుని, అతడి చేతే భర్తను హత్య చేయించేలా మైండ్ గేమ్ ఆడుతుంది. ఆనంద్ చనిపోవాలి, సర్జేరావ్ హంతకుడిగా జైలుకు వెళ్లాలి, తాను మాత్రం సాహెబాతో పారిపోవాలి…ఇదీ ఆమె వేసుకున్న పక్కా స్కెచ్. అయితే, అనుకున్నంత సులభంగా విషయాలు జరగవు. మనుషుల స్వార్థం, గ్రామ రాజకీయం, దైవ విశ్వాసాలు అన్నీ కలగాపులగమై ఆ రాత్రిని ఒక రక్తసిక్తమైన మానసిక సమరంగా మారుస్తాయి.
‘కాంతారా’ తరహాలోనే ఒక ఆచారం వెనుక థ్రిల్లర్
మనం సాధారణంగా చూసే క్రైమ్ థ్రిల్లర్లలో పెళ్లి లేదా పండుగ అనేది కేవలం వెనుక కనిపిచే ఒక బ్యాక్‌గ్రౌండ్ మాత్రమే. కానీ ‘గొంధల్’ దర్శకుడు సంతోష్ దవాఖర్ ఈ ఆచారాన్ని కథలో ఒక ప్రధాన పాత్రలా మార్చేశారు. మనకు ‘కాంతారా’ సినిమాలో తుళునాటి భూతకోలా సంప్రదాయం కథనాన్ని ఎలా నడిపించిందో, ఇక్కడ ఈ సినిమాలో మహారాష్ట్ర గొంధల్ సంప్రదాయం అలాగే పనిచేస్తుంది.
ఒకవైపు దేవుడిని ఆహ్వానించే మంత్రాలు, భక్తి పారవశ్యం.. మరోవైపు భర్తను చంపించే కుట్రలు, మోసం, పారిపోయే ప్లాన్లు. ఈ రెంటి మధ్య ఉన్న తీవ్రమైన వ్యత్యాసమే (Contrast) ఈ సినిమాను ఒక అద్భుతమైన సైకలాజికల్ థ్రిల్లర్‌గా నిలబెట్టింది.
రెండు అర్థాల ‘గొంధల్’ symbolism
మరాఠీలో ‘గొంధల్’ అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి దేవతలను ప్రసన్నం చేసుకునే పవిత్రమైన రాత్రిపూట ఆచారం అయితే, రెండోది సాధారణ వాడుకలో ‘అల్లకల్లోలం’ లేదా ‘భారీ గందరగోళం’. ఈ సినిమా శీర్షిక ఈ రెండు భావాలకూ సరిగ్గా సరిపోతుంది.
ఊరంతా మతపరమైన గొంధల్లో మునిగిపోతే, పాత్రల మనసుల్లో జీవితాలను నాశనం చేసే మానసిక గందరగోళం నడుస్తుంటుంది. కొత్త జంట జీవితంలో అడ్డంకులను తొలగించడానికి దేవుళ్లను పిలిచే ఆ రాత్రే, మనుషులు తమ స్వయంకృతాపరాధాలతో విధి రాసిన దారినే ఎలా నాశనం చేసుకున్నారనేదే ఈ సినిమా అడిగే లోతైన ప్రశ్నించే తత్వం.
దర్శకుడికి చిన్నప్పటి జ్ఞాపకం.. సినిమాకు పెద్ద ప్రపంచం
‘గొంధల్’ ఆచారంతో దర్శకుడు సంతోష్ దవాఖర్కు వ్యక్తిగత అనుబంధం కూడా ఉంది. చిన్నప్పుడు చూసిన గొంధల్ కార్యక్రమాల్లోని చీకటి, జనసందోహం, డప్పుల శబ్దం, లైట్లు, అగ్ని వంటి దృశ్యాలు తన జ్ఞాపకాల్లో నిలిచిపోయాయని ఆయన పలు సందర్భాల్లో చెప్పారు. ఆ జ్ఞాపకాన్నే ఆయన సినిమా ప్రపంచంగా మార్చుకున్నారు.
అందుకే సినిమాలో గొంధల్ ఒక పండుగలా మాత్రమే కనిపించదు. దాని శబ్దం వినిపిస్తుంది. దాని చీకటి కనిపిస్తుంది. దాని జనసందోహంలో మనం కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది. దర్శకుడు దీన్ని ప్రేక్షకుడికి బయట నుంచి చూపించడం కంటే.. ఆ ఆచారం మధ్యలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు.
సినిమాలో సుదీర్ఘమైన లాంగ్ టేక్‌ను ఉపయోగించడం కూడా ఈ అనుభూతిని పెంచుతుంది. ఓ రకంగా కనుమరుగవుతున్న సంప్రదాయానికి సినిమా అద్దం
‘గొంధల్’లో మరో ముఖ్యమైన కోణం ఉంది.
కాలం మారుతున్న కొద్దీ ఈ సంప్రదాయం కూడా మారుతోంది. ఒకప్పుడు రాత్రంతా జరిగే గొంధల్ కార్యక్రమాలు ఇప్పుడు చాలా చోట్ల తక్కువ సమయానికే పరిమితమవుతున్నాయి. టెలివిజన్, ఇంటర్నెట్, ఆధునిక వినోద మార్గాలు పెరగడంతో ఇటువంటి సామూహిక జానపద అనుభవాలు కూడా క్రమంగా తగ్గుతున్నాయి.
ఈ నేపథ్యంలో ‘గొంధల్’ ఒక థ్రిల్లర్ మాత్రమే కాదు. ఒక ప్రాంతీయ సంస్కృతి ఎలా మారిపోతోందో రికార్డు చేసే సినిమా కూడా. ఇది సినిమాకు మరో ప్రత్యేకతను ఇస్తుంది.
ఇళయరాజా సంగీతం
ఈ చిత్రంలో ఇషితా దేశ్‌ముఖ్ ప్రధాన పాత్రలో నటించగా, కిషోర్ కదమ్, యోగేష్ సోహాని, నిషాద్ భోయిర్, అనుజ్ ప్రభు, ధ్రువ్ థోకే తదితరులు నటించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఈ సినిమాకు సంగీతం అందించటం ఈ సినిమా మరో ప్రత్యేకత.
33 సినిమాల నుంచి ‘గొంధల్’ వరకు..
ఆస్కార్ ఎంట్రీ కోసం సమర్పించిన 33 చిత్రాల్లో యామీ గౌతమ్ నటించిన ‘హక్’, ఆదిత్య ధర్ దర్శకత్వంలోని ‘ధురంధర్’, ‘ధురంధర్: ది రివెంజ్’, ‘హనుమాన్ అంష్’, సన్నీ డియోల్ నటించిన ‘బోర్డర్ 2’, ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన ‘మై వాపస్ ఆవూంగా’, రామ్‌చరణ్ నటించిన ‘పెద్ది’, ఫర్హాన్ అక్తర్ నటించిన ‘120 బహాదూర్’ వంటి సినిమాలు కూడా ఉన్నాయి.
గత ఏడాది భారత్ తరఫున నీరజ్ ఘయ్వాన్ ‘హోమ్‌బౌండ్’ ను ఆస్కార్‌కు పంపారు. అయితే అది తుది నామినేషన్లలో చోటు దక్కించుకోలేకపోయింది.
ఆస్కార్‌కు వెళ్లిన నాలుగో మరాఠీ సినిమా
‘గొంధల్’ ఆస్కార్ కోసం భారత్ నుంచి అధికారికంగా ఎంపికైన నాలుగో మరాఠీ చిత్రం.
ఇంతకుముందు:
Shwaas — 2005
Harishchandrachi Factory — 2009
Court — 2015
Gondhal — 2027
అయితే ఇప్పటివరకు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఏ భారతీయ సినిమా కూడా ఆస్కార్‌ను గెలుచుకోలేదు.
ఈ విభాగంలో తుది నామినేషన్ సాధించిన భారతీయ సినిమాలు మూడు:
Mother India — మెహబూబ్ ఖాన్
Salaam Bombay — మీరా నాయర్
Lagaan — ఆశుతోష్ గోవారికర్
దీపా మెహతా దర్శకత్వం వహించిన ‘Water’ కూడా ఆస్కార్ నామినేషన్ పొందింది. అయితే అది కెనడా తరఫున సమర్పించబడింది.
99వ అకాడమీ అవార్డ్స్ 2027 మార్చి 14న జరగనున్నాయి. ‘గొంధల్’ ఇప్పుడు భారతదేశం తరఫున ఆస్కార్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








