మందే ఇవ్వలేదు.. క్యాన్సర్ మాయమైపోయింది! సంచలన ప్రయోగం
—సూర్య ప్రకాష్ జోశ్యుల
క్యాన్సర్ అనే పేరు వింటేనే మన గుండెల్లో ఏదో తెలియని వణుకు మొదలవుతుంది. అది కేవలం ఒక వ్యాధి మాత్రమే కాదు, మనిషి శరీరాన్ని, మనస్సును, ఆ కుటుంబాన్ని ఆర్థికంగా, మానసికంగా దెబ్బతీసే ఒక పెద్ద సుడిగుండం అనేది అందరూ ఒప్పుకునే నిజం.
సాధారణ ఇన్ఫెక్షన్లకు యాంటీబయోటిక్స్ ఉన్నట్లు, అన్ని రకాల క్యాన్సర్లను పూర్తిగా తుడిచిపెట్టే ఒక్క మందు ఇప్పటివరకైతే ప్రపంచంలో లేదు. ఎందుకంటే క్యాన్సర్ అనేది ఒకే వ్యాధి కాదు, అది వందల రూపాల్లో వస్తుంది. ఒకరికి పనిచేసిన మందు ఇంకొకరికి పనిచేయదు, పైగా కొన్నిరోజులకి ఈ క్యాన్సర్ కణాలు ఆ మందులకు అలవాటుపడి తిరిగి దాడి చేయడం మొదలుపెడతాయి.
ఇలాంటి సమయంలోనే, మందులపై ఆధారపడకుండా మన శరీరాన్నే ఒక ఆయుధంగా మార్చే కొత్త తరహా ప్రయోగాలు వైద్య రంగంలో ఆశల వెలుగులు నింపుతున్నాయి.
ఆ మూడేళ్ల చిన్నారి కథ ఏంటి?
అమెరికాలోని వైద్య పరిశోధకులు చేసిన ఒక ప్రయోగం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఒక మూడేళ్ల బాలుడికి కీమోథెరపీ ఇచ్చినా ఫలితం లేకపోయింది, కాలేయంలో మొదలైన ట్యూమర్ ఊపిరితిత్తులకు, ఎముకలకు కూడా వ్యాపించింది. ఆపరేషన్లు చేసి ట్యూమర్లను తొలగించినా క్యాన్సర్ మళ్లీ తిరిగొచ్చింది.
ఇక సంప్రదాయ మందులు పనిచేయవు అనుకున్న సమయంలో, డాక్టర్లు ఒక ప్రయోగాత్మక మార్గాన్ని ఎంచుకున్నారు. ఆ బాలుడికి రెండు దఫాలుగా CAR-T అనే చికిత్స అందించారు. విచిత్రమేమిటంటే, ఆ చికిత్స తర్వాత బాలుడి శరీరంలో క్యాన్సర్ కణాలు పూర్తిగా మాయమయ్యాయి. చికిత్స పూర్తయిన 12 నెలల తర్వాత కూడా ఆ చిన్నారి ఎలాంటి క్యాన్సర్ లక్షణాలు లేకుండా పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు.
CAR-T చికిత్స అంటే ఏంటి?
మన శరీరంలో క్యాన్సర్‌తో పోరాడే T-cells అనే రక్షణ కణాలు ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో అవి క్యాన్సర్ కణాలను సరిగ్గా గుర్తించలేవు. CAR-T చికిత్సలో వైద్యులు ఈ T-cellsను రక్తం నుంచి తీసుకుని, క్యాన్సర్ కణాలను గుర్తించి చంపేలా ప్రత్యేకంగా మార్చుతారు. తర్వాత వాటిని మళ్లీ రోగి శరీరంలోకి పంపిస్తారు.
ఇవి కూడా చదవండి
అంటే సింపుల్‌గా చెప్పాలంటే… మన శరీరంలోని రక్షణ కణాలను బయటకు తీసి → వాటికి క్యాన్సర్‌ను గుర్తించడం నేర్పించి …తిరిగి శరీరంలోకి పంపడం జరుగుతుంది. అక్కడికి వెళ్లిన తర్వాత ఆ కణాలు క్యాన్సర్‌ను గుర్తించి దానిపై దాడి చేస్తాయి. అందుకే CAR-Tను “మందు ఇవ్వడం” కంటే “శరీరాన్నే క్యాన్సర్‌తో పోరాడేలా మార్చడం” అని అర్థం చేసుకోవచ్చు.
ఇది నిజంగానే క్యాన్సర్‌కు శాశ్వత పరిస్కారమా?
ఈ విషయం వినడానికి ఎంత అద్భుతంగా ఉన్నా, దీన్ని బేస్ చేసుకుని “క్యాన్సర్‌కు శాశ్వతంగా మందు దొరికేసింది” అని ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే ఇది ఒక్క రోగిపై చేసిన Phase 1 ప్రయోగంలో వచ్చిన ప్రాథమిక ఫలితం మాత్రమే. రక్త క్యాన్సర్లలో ఇప్పటికే మెరుగైన ఫలితాలు ఇస్తున్న ఈ CAR-T థెరపీ, గట్టిగా ఉండే ‘Solid Tumors’ పై కూడా పనిచేస్తుందని నిరూపించడానికి ఇదొక బలమైన ఆధారంగా నిలిచింది.
అయితే ఈ చికిత్స మరెంతమంది రోగుల్లో పనిచేస్తుంది, దీర్ఘకాలంలో క్యాన్సర్ మళ్లీ తిరగబెట్టకుండా ఉంటుందా, అలాగే ప్రయోగశాలలో కణాలను మార్చి చేసే ఈ ప్రక్రియ సామాన్య రోగులకు ఎంతవరకు అందుబాటు ధరలోకి వస్తుంది అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది.
భారత్‌లో ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?
CAR-T చికిత్స సాధారణ tablet లేదా injection కాదు. ప్రతి రోగి నుంచి కణాలను సేకరించి, వాటిని ప్రత్యేకమైన laboratoryలో genetically engineer చేసి, తయారు చేసి, తిరిగి రోగికి ఇవ్వాలి. అంటే technology మాత్రమే కాదు.. manufacturing infrastructure, specialised hospitals, trained teams, quality control, ఖర్చు అన్నీ కీలకంగా మారతాయి. భవిష్యత్తులో ఈ చికిత్సలు మరింత విజయవంతమైతే భారతదేశంలోకి కూడా రావచ్చు. అప్పుడు వాటిని సామాన్య రోగికి అందుబాటులోకి ఎంత తక్కువ ఖర్చుతో తీసుకురాగలం? అనే ఆలోచన చేయాల్సి ఉంటుంది.
ఏదైమైనా…
ఈ ప్రయోగం ఒక విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా చాటిచెబుతోంది. భవిష్యత్తులో క్యాన్సర్ చికిత్స అనేది “ఏ మందు వాడాలి?” అనే దానికంటే, “రోగి శరీరంలోని కణాలనే క్యాన్సర్‌పై దాడి చేసేలా ఎలా ప్రోగ్రామ్ చేయాలి?” అనే దిశగా మారబోతోంది.
కెమికల్ మందుల కంటే, శరీరంలోకి వెళ్లి క్యాన్సర్‌ను వెతికి వేటాడే ఈ “Living Medicine” భావన వైద్య ప్రపంచంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. శాస్త్రవేత్తలు ఈ సాంకేతికతను విస్తరించి, సామాన్యులకు తక్కువ ఖర్చులో అందుబాటులోకి తేగలిగితే మాత్రం క్యాన్సర్‌పై మానవాళి సాధించే అతిపెద్ద విజయాల్లో ఇది ఒకటిగా నిలిచిపోతుంది.








