నేను కాంగ్రెస్‌ను వీడేటట్లు చేసింది మీరందరూ కదా?: మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
పార్టీ ఫిరాయింపుల గురించి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి మాట్లాడే అర్హత లేదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) అన్నారు. అసెంబ్లీలో సీఎం చేసిన వ్యాఖ్యలపై ఆమె తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. నేను కాంగ్రెస్‌ను వీడేటట్లు చేసింది మీరందరూ కదా? నేను పార్టీ మారితేనే భట్టి ప్రధాన ప్రతిపక్ష నేత పదవి పోయిందా? రేవంత్ రెడ్డికి భట్టిపై అంత ప్రేమ ఉంటే ఇప్పుడు ఆయనకు సీఎం పదవి ఇవ్వాలి. నా భర్త ఇంద్రారెడ్డి (Indra Reddy) చనిపోయినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కాంగ్రెస్‌లో నేను 2000 సంవత్సరంలో చేరా. కాంగ్రెస్ పార్టీకి నేనేం సేవ చేశానో రంగారెడ్డి జిల్లా ప్రజలకు తెలుసు. నా కుమారుడు కార్తీక్ (Karthik)కు టికెట్ ఇప్పించినట్లు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. నేను సీటు త్యాగం చేస్తేనే టికెట్ ఇచ్చారు. స్పీకర్ తల్లి అవమానించారని రెండురోజులు అసెంబ్లీలో చర్చ జరిపారు అన్నారు.
ఆడబిడ్డలమైన మా గురించి ఎందుకు మాట్లాడలేదు? శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని బహదూర్‌గూడ భూముల గురించి రేవంత్ రెడ్డికి అవగాహన లేదు. రంగారెడ్డి జిల్లాలో రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ భూములు పోగు చేస్తున్నారో మాకు తెలుసు. తిమ్మాపూర్ భూదాన్ భూములపై విచారణ చేయాలి. ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసిన నాటి నుంచి ఇప్పటివరకు నా అఫిడవిట్లను పరిశీలిస్తే ఆస్తులు పెరిగాయో, తగ్గాయో తెలుస్తుంది. కేసీఆర్ క్యాబినెట్లో మంత్రిగా చేసినప్పుడు ప్రజలపై ఆయనున్న ఆర్ద్రతను గమనించాను. కేసీఆర్ ( KCR)తో కలిసి ఉద్యమంలో ఎందుకు పాల్గొనలేకపోయానా అనే బాధ ఇప్పటికీ నన్ను వెంటాడుతోంది అని పేర్కొన్నారు.








