కేసీఆర్ అఫిడవిట్లే కాంగ్రెస్ అస్త్రాలు!
తెలంగాణ రాజకీయాల్లో భూ వివాదాలు ఎప్పుడూ కేంద్రబిందువుగానే ఉంటాయి. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్న రాజకీయ పరిణామాలు ఆరోపణల స్థాయిని దాటిపోయాయి. అఫిడవిట్లు, అధికారిక పత్రాల ఆధారంగా సాగుతున్న ఒక వ్యూహాత్మక దాడిలా మారా యి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్ భూములు, కేటీఆర్ ఆస్తుల సంపాదనపై కాంగ్రెస్ ప్రభుత్వం పావులు కదుపుతున్న తీరు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రత్యేకించి గత ఎన్నికల అఫిడవిట్లను ప్రస్తుత వాస్తవాలతో బేరీజు వేస్తూ అధికార పార్టీ సంధిస్తున్న ప్రశ్నలు బీఆర్ఎస్ ను డిఫెన్స్‌లో పడేశాయి.
రాజకీయ నాయకుల గతం, వర్తమానం మధ్య వ్యత్యాసాన్ని ఎత్తిచూపడానికి ఎన్నికల సంఘానికి సమర్పించే అఫిడవిట్లే అత్యంత ప్రామాణికమైన ఆయుధాలుగా మారుతుంటాయి. ప్రస్తుత వివాదంలోనూ కాంగ్రెస్ పార్టీ ఇదే వ్యూహాన్ని అమలు చేస్తోంది. 2004లో కరీంనగర్ లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసిన సమయంలో కేసీఆర్ సమర్పించిన అఫిడవిట్లో తనకు కనీసం ఒక్క ఎకరం వ్యవసాయ భూమి కూడా లేదని స్పష్టంగా పేర్కొన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 2009 ఎన్నికల అఫిడవిట్లో కేవలం ఒక ఎకరం భూమి మాత్రమే ఉన్నట్లు చూపించారని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడించారు..
కానీ తెలంగాణ ఉద్యమ కాలం నుంచి పదేళ్ల అధికార కాలం ముగిసేనాటికి ఈ కుటుంబం చేతిలో వేల ఎకరాల భూములు, వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా సమకూరాయనేది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశమైంది. ఉద్యమ సమయంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని, ప్రాణాలర్పించిన అమరుల త్యాగాల పునాదుల మీద ఎదిగిన నేతలు, ఇంత భారీ స్థాయిలో సంపదను ఎలా కూడబెట్టారంటూ కాంగ్రెస్ సంధిస్తున్న ప్రశ్నలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ధరణి పోర్టల్ నిర్వహణపై అప్పట్లోనే విపక్షాలు అనేక విమర్శలు చేశాయి. అయితే ఇప్పుడు అదే ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని ప్రభుత్వ భూములు, పేదల భూములు, దళితులకు కేటాయించిన అసైన్డ్ భూములు కూడా అన్యాక్రాంతమయ్యాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ అంశంపై కేవలం మాటల యుద్ధానికే పరిమితం కాకుండా.. సెక్షన్ 22ఏ కింద ఉన్న వివాదాస్పద భూముల వ్యవహారంపై అధికారికంగా రెవెన్యూ విచారణకు ఆదేశించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించింది.
అసెంబ్లీ వేదికగా కూడా దీనికి సంబంధించిన పత్రాలను, రికార్డులను ప్రదర్శించి బీఆర్ఎస్ అధినేతను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. కేసీఆర్‌ను ‘భూబకాసురుడు’ అంటూ మంత్రి పొంగులేటి అభివర్ణించడం, కేటీఆర్ తన అమెరికన్ సక్సెస్, వంశపారంపర్య ఆస్తుల గురించి చేసిన ప్రకటనలను తప్పుపట్టడం చూస్తుంటే, రాబోయే రోజుల్లో ఈ అంశం మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంది.








