సిడ్నీ స్వీనీ వివాదాస్పద యాడ్ వైరల్, దీని వెనుక అసలు గేమ్ ఏమిటి?
యాడ్స్ సాధారణంగా ఎలాంటి ప్రొడక్ట్ లకు ఇస్తూంటారో మనకు తెలుసు.. దాదాపు మన నిత్యావసరాల గురించి కాకుండా ఎక్కువ లగ్జరి ప్రొడక్ట్స్ పై అవి దృష్టి పెడుతూంటాయి.మనకీ వాటితో పెద్ద సమస్య ఉండదు.
షాంపూ అయితే జుట్టు బాగుంటుందని చెబుతారు. కారు అయితే స్టైల్, మైలేజ్, పవర్ గురించి చెబుతారు. ఫుడ్ యాప్ అయితే ఆకలి వేసినప్పుడు తమ యాప్ గుర్తుకు రావాలని అందుకు తగినట్లు డిజైన్ చేస్తారు. అంటే కంపెనీ దగ్గర ఒక వస్తువు ఉంటుంది.. దాన్ని మనకు కావాలనేలా చేయడానికి యాడ్ ఇస్తుంది. ఇవన్నీ నిత్య జీవితంలో చూసేవే. ఇందులో అభ్యంతరం లేదు. ఎందుకంటే యాడ్ చూసి కొనేవాళ్లు కొంటారు. లేనివాళ్లు లేరు.
ఇదంతా బాగానే ఉంది . మాదీ వ్యాపారమే అని స్పోర్ట్స్ బెట్టింగ్ కు కూడా యాడ్స్ ఇస్తారా, అందులో సినిమా స్టార్స్ నటిస్తారా, స్పోర్ట్స్‌పై అంచనాలు వేసి డబ్బు పెట్టే ప్లాట్‌ఫామ్‌కు అసలు యాడ్ లతో ప్రమోషన్ ఏమిటి? హాలీవుడ్ నటి సిడ్నీ స్వీనీ లాంటి స్టార్ ఎందుకు ఒప్పుకుంది?
ఇదే డౌట్ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ మీడియా సర్కిల్స్ లో , సోషల్ మీడియాలో మొదలైంది. సిడ్నీ స్వీనీ తాజా యాడ్ వచ్చిన దగ్గర నుంచి ఈ రచ్చ మొదలైంది. ఆమె దాదాపు నగ్నంగా కనిపిస్తూ ఫుట్‌బాల్ ప్యాడ్స్, బాస్కెట్‌బాల్ హూప్, పూల్ టేబుల్ లాంటి స్పోర్ట్స్ వస్తువులతో కనిపించిన ఈ ప్రకటన సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. కొందరికి యాడ్ పిచ్చ పిచ్చగా నచ్చేసింది. మరికొందరికి అస్సలు నచ్చలేదు.
కొందరు అయితే ఇలాంటి ప్రకటనలు మహిళలను, స్పోర్ట్స్‌ను ఎలా చూపిస్తున్నాయంటూ మండిపడ్డారు. కానీ ఈ హడావుడి మధ్య మనం గమనించాల్సిన అసలు విషయం మాత్రం ఇంకోటి ఉంది. అయితే సిడ్నీ స్వీనీ అక్కడ కేవలం యాడ్ చేయడానికి వెళ్లలేదు.
బెట్టింగ్‌కు కూడా యాడ్ కావాలా?
మన దగ్గర “బెట్టింగ్” అనే మాట వినగానే చాలామంది కంగారు పడతారు. ఇంకొంతమందికి వెంటనే క్రికెట్ గుర్తొస్తుంది. మ్యాచ్ మొదలయ్యే ముందు ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎవరు ఎక్కువ పరుగులు చేస్తారు అనే అంచనాలు మన చుట్టూ ఎన్నోసార్లు వినిపిస్తూనే ఉంటాయి. అయితే బెట్టింగ్ లు కాయటం చట్ట ప్రకారం నేరం. అందుకేనేమే దాన్ని పేరు మార్చి పబ్లిసిటీ చేస్తున్నారు.
దాన్ని Prediction Market అంటున్నారు. పేరు వింటేనే కొంచెం వేరుగా అనిపిస్తుంది. “బెట్టింగ్” అన్న పదం వినగానే మనకు ఒక రకమైన భావన వస్తుంది. కానీ “మార్కెట్”, “ట్రేడింగ్”, “ప్రిడిక్షన్” అంటే మరో రకమైన భావన వస్తుంది.
పేరు మారితే మనం చేస్తున్న పనిని చూసే విధానం కూడా మారుతుందా?
Novig కూడా తనను స్పోర్ట్స్‌పై మాత్రమే దృష్టి పెట్టే prediction marketగా పరిచయం చేసుకుంటోంది. అంటే రాజకీయాల నుంచి యుద్ధాల వరకు అన్నింటిపైనా అంచనాలు వేయించే ప్లాట్‌ఫామ్‌గా కాకుండా, స్పోర్ట్స్‌ను కేంద్రంగా పెట్టుకుని పనిచేస్తున్నానని చెప్తోంది.
అందుకు మొదట ప్రజలలో ఒక కొత్త అలవాటు పెంచాల్సి ఉంటుంది. “మీకు స్పోర్ట్స్ తెలుసా? మీ అంచనాపై మీకు నమ్మకం ఉందా? అయితే దాన్ని మార్కెట్లోకి తీసుకురండి” అనే ఆలోచనను అమ్మాలి. అదే యాడ్ పని.
సిడ్నీ స్వీనీ ఈ యాడ్ లోకి ఎందుకు వచ్చింది?
సాధారణంగా ఒక సెలబ్రిటీ యాడ్ చేస్తే కంపెనీకి ప్రచారం వస్తుంది, సెలబ్రిటీకి పారితోషికం వస్తుంది. అంతే. కానీ ఇక్కడ సిడ్నీ స్వీనీ కథ అంత సింపుల్ కాదు. ఆమె Novigలో పెట్టుబడిదారు కూడా అవటం విశేషం. అంటే స్క్రీన్‌పై కనిపిస్తున్నది కేవలం బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీ ముఖం కాదు. ఆ కంపెనీ భవిష్యత్తు బాగుండాలని కోరుకోవాల్సిన అవసరం కూడా ఆమెకు ఉంది.
అంతేకాదు, ఈ యాడ్ ఎలా ఉండాలి, ఏం చెప్పాలి అనే విషయాల్లో కూడా ఆమె క్రియేటివ్ టీమ్‌తో కలిసి పనిచేసింది. అంటే “నా ఫేస్ పెట్టుకోండి.. యాడ్ చేసుకోండి” అన్నంత వరకు ఈ సంబంధం ఆగిపోలేదు. celebrity endorsement కాస్త business partnershipగా మార్చేసింది.
కంపెనీకి కావాల్సింది మీ డబ్బేనా?
నీతి,నియమాల కోసం ఎవరూ వ్యాపారం చేయరు. ఏ వ్యాపారానికైనా చివరికి డబ్బే కావాలి. కానీ దానికి ముందు ఇంకోటి కావాలి. అది మీ దృష్టిని ఆకట్టుకోవటం. అందుకే యాడ్ తయారు చేసారు. దాన్ని మీరు యాడ్ చూశారు. సిడ్నీ స్వీనీ కనిపించింది కాబట్టి కాసేపు ఆగారు. తర్వాత “ఇది ఏ కంపెనీ?” అని చూశారు. ఎవరో ఆ యాడ్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకొకరు దాన్ని తిట్టారు. మరొకరు “సిడ్నీ అదిరిపోయింది” అన్నారు.
మీరు యాడ్‌ను ప్రేమించినా కంపెనీ పేరు బయటకు వచ్చింది. మీరు యాడ్‌ను ద్వేషించినా కంపెనీ పేరు బయటకు వచ్చింది. మీరు దాని గురించి మాట్లాడినంతకాలం కంపెనీకి ప్రచారం వస్తూనే ఉంది. ఇదే ఇప్పుడు సోషల్ మీడియా మార్కెటింగ్‌లో అసలు బలం. వైరల్ కావడానికి అందరూ మిమ్మల్ని ఇష్టపడాల్సిన అవసరం లేదు. అందరూ మీ గురించి మాట్లాడితే చాలు.
వివాదం కూడా కంపెనీకి ఉపయోగపడుతుందా?
సాధారణంగా కంపెనీలు వివాదం వస్తే భయపడతాయి. ప్రకటన వెనక్కి తీసుకుంటాయి. వివరణలు ఇస్తాయి. క్షమాపణలు చెబుతాయి. కానీ సోషల్ మీడియా ప్రపంచంలో ఒక వివాదాస్పద యాడ్ కొన్నిసార్లు కంపెనీకి ఊహించని ప్రచారం తెచ్చిపెడుతుంది. సిడ్నీ స్వీనీ యాడ్‌కు కూడా అదే జరిగింది. యాడ్‌పై అనుకూల కామెంట్లు వచ్చాయి. వ్యతిరేక కామెంట్లు వచ్చాయి. సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఫలితంగా Novig అనే పేరు ఒక్కసారిగా చాలా మందికి తెలిసింది.
ఒక విశ్లేషణ ప్రకారం యాడ్ వచ్చిన తర్వాత Novig గురించి బ్రాండ్ ప్రస్తావనలు వారానికి సగటున 392 నుంచి 4,633కి పెరిగాయి. అంటే దాదాపు 1,180 శాతం పెరుగుదల.
కంపెనీకి కావాల్సింది అందరూ “వావ్.. ఎంత గొప్ప యాడ్” అని చెప్పడమే అయితే ఇది పెద్ద సక్సెస్ కాదు. కంపెనీ లక్ష్యం “Novig అనే పేరు అందరికీ తెలిసిపోవాలి” అయితే?అప్పుడు ఈ వివాదం కూడా మార్కెటింగ్‌లో భాగమే అయిపోతుంది.
ఫైనల్ గా
రేపు ఒక యాప్ మీకు “బెట్టింగ్ చేయండి” అని చెప్పకుండా.. “మీ అంచనాను ట్రేడ్ చేయండి” అంటే? మీరు దాన్ని ఎలా చూస్తారు? జూదంలా? ఇన్వెస్ట్మెంట్లా? లేక కేవలం స్పోర్ట్స్‌పై మీకు ఉన్న నమ్మకాన్ని పరీక్షించుకునే ఆటలా? లేకపోతే “నేను బెట్టింగ్ చేయడం లేదు.. నా అంచనాను ట్రేడ్ చేస్తున్నాను” అంటారేమో.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








